కొత్త టీచర్ల కౌన్సెలింగ్..584 మందికి పోస్టింగ్

కొత్త టీచర్ల కౌన్సెలింగ్..584 మందికి పోస్టింగ్
  • హైదరాబాద్​ జిల్లాలో 584 మందికి పోస్టింగ్ ​ఆర్డర్లు 
  • టెక్నికల్​ ఇష్యూస్​తో ఉదయం కౌన్సిలింగ్​ ఆలస్యం 
  • మధ్యాహ్నం 2 గంటల తర్వాత ప్రారంభం
  • అర్ధరాత్రి వరకు కొనసాగిన ప్రాసెస్

హైదరాబాద్ సిటీ, వెలుగు:ప్రభుత్వం నుంచి అపాయింట్​మెంట్​ఆర్డర్లు అందుకున్న కొత్త టీచర్లకు మంగళవారం కౌన్సెలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 9 గంటలకే  కౌన్సెలింగ్​కు హాజరుకావాలని హైదరాబాద్ ​జిల్లాలోని విద్యాశాఖ అధికారులు ప్రకటించడంతో..అబిడ్స్​లోని స్టాన్లీ గర్ల్స్​హైస్కూల్​కు కుటుంబసభ్యులు, పిల్లాపాపలతో కొత్త టీచర్లు చేరుకున్నారు. 

స్కూల్​ ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. జిల్లాలో 584 డీఎస్సీ పోస్టులను అధికారులు ఫైనల్ ​చేయగా, ఎస్జీటీ 386 మంది, స్కూల్ అసిస్టెంట్107 మంది, లాంగ్వేజ్ పండిట్లు 91 మంది మంగళవారం పోస్టింగ్​ఆర్డర్లు తీసుకున్నారు. వీరంతా బుధవారం ఆయా స్కూళ్లలో రిపోర్ట్​ చేయనున్నారు. 

ఉదయం గందరగోళం

కొత్త టీచర్లంతా ఉదయం స్టాన్లీ గర్ల్స్​ స్కూల్​కు చేరుకోగా, టెక్నికల్​ఇష్యూస్​ కారణంగా కౌన్సెలింగ్ వాయిదా వేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఎప్పుడు జరిగేది త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. దీంతో అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు. కాసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మధ్యాహ్నం టెక్నికల్​సమస్యను అధికారులు పరిష్కరించగా... 2 గంటల నుంచి కౌన్సెలింగ్ ​ప్రారంభమైంది. 

ఎస్టీటీలకు, ఎస్ఏలకు, పండిట్లకు వేర్వేరుగా కౌన్సిలింగ్​నిర్వహించారు. లేటుగా ప్రారంభించడంతో మంగళవారం అర్ధరాత్రి వరకు ప్రక్రియ కొనసాగింది. ఆర్డర్లు పొందిన స్కూల్ అసిస్టెంట్లు, లాంగ్వేజ్​పండిట్లు బుధవారం వారికి కేటాయించిన స్కూళ్లలోని హెచ్ఎంలకు రిపోర్ట్ చేయాలని, ఎస్జీటీలు మాత్రం వారి మండలంలోని డిప్యూటీ ఐఓఎస్​వద్ద రిపోర్ట్​చేయాలని విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. 

స్కూళ్లలో, డిప్యూటీ ఐఓఎస్​వద్ద రిపోర్టింగ్​కు వెళ్లే వారు తప్పనిసరిగా అపాయింట్ మెంట్ ఆర్డర్లు, ఫిట్​నెస్​సర్టిఫికెట్, ఒరిజినల్​సర్టిఫికెట్లతోపాటు, రెండు సెట్ల జిరాక్సులు తీసుకు వెళ్లాలని స్పష్టం చేశారు. 

ఏర్పాట్లు అంతంత మాత్రమే...

కౌన్సెలింగ్ ​కోసం వచ్చిన 584 మంది అభ్యర్థులతోపాటు, వారి వెంట వచ్చిన వారి కుటుంబ సభ్యులతో స్టాన్నీ స్కూల్​ప్రాంగణం నిండిపోయింది. కౌన్సిలింగ్​హాల్ లోకి అభ్యర్థులను మాత్రమే అనుమతించారు. అయితే, అధికారులు తగిన ఏర్పాట్లు చేయలేదని అభ్యర్థులు పెదవి విరిచారు. డ్రింకింగ్ వాటర్​సరిపోను లేవని, అభ్యర్థులు, వారి సంబంధికులు ఉండడానికి ఏర్పాట్లు లేవని అసహనం వ్యక్తం చేశారు. పార్కింగ్​ సమస్య తలెత్తిందని, కుర్చీలు కూడా వేయలేదని చెప్పారు. 
 చిన్న పిల్లల్ని ఎత్తుకొని రోడ్ల మీద, కింద కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోయారు.