సమసమాజ స్థాపన కోసం జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా వారికి సరిగ్గా చేరాలంటే కచ్చితంగా ఓబీసీ కులాల లెక్కలు తీయాల్సిందే. కుల నిర్మూలన జరగాలంటే ముందుగా ఏ కులానికి ఆ కులం రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలి. అలా అభివృద్ధి చెందినప్పుడు కులం అనేది దానికదే కనుమరుగైపోతుంది. ‘‘కులాల వారీగా జనాభా లెక్కలు తీస్తే పేదలకు వరంగా మారుతాయి’’ అని ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ అన్నారు. ఇది ముమ్మాటికీ నిజం.
స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఇప్పటివరకు ఏర్పడిన ఏ ప్రభుత్వం కూడా కులాల వారీగా జనాభా లెక్కలు తీయలేదు. దీంతో ఓబీసీలు ఎంత మంది ఉన్నారు అనే లెక్క స్పష్టంగా లేదు. అంచనాలే తప్ప అధికారిక ప్రకటన లేదు. అమెరికాలో జాతుల వారీగా జనాభా లెక్కిస్తారు. బ్రిటన్లో ప్రజలను వారి మూలాల ఆధారంగా లెక్కించి అధికారికంగా ప్రకటిస్తారు. బీఎస్పీ చీఫ్ మాయావతి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సహా దేశంలోని ఇతర పార్టీలలోని బీసీ లీడర్లు, బీసీ సంఘాలు కులాల వారీగా జనాభా లెక్కలు తీయాలని బలంగా వాదిస్తున్నాయి. జాతీయ బీసీ సంక్షేమ సంఘం, తెలంగాణ బీసీ ఫ్రంట్, మహారాష్ట్ర ప్రభుత్వాలు కులాల వారీగా లెక్కలు తీయాలని సుప్రీంకోర్టులో కేసు వేశాయి. ఇది ఆచరణ సాధ్యం కాదని, కష్టమైన ప్రాసెస్ అని కేంద్రం కౌంటర్ అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. 2011లో జరిపిన సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం 46 లక్షల కులాలు, ఉపకులాల పేర్లను ప్రజలు చెప్పారని అఫిడవిట్‌లో కేంద్రం పేర్కొంది.
రిజర్వేషన్ల వాటా పెంచాలి
నిజానికి కేంద్ర ప్రభుత్వ ఓబీసీ జాబితాలో 2,642 కులాలు, రాష్ట్రాల బీసీ జాబితాలో 2,892 బీసీ కులాలు ఉన్నాయి. జస్టిస్ రోహిణి రిపోర్టు ప్రకారం దేశంలో 2,633 బీసీ కులాలు, 1,674 ఎస్‌సీ కులాలు, 534 ఎస్టీ కులాలు ఉన్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243డీ(6), 243టీ(6) ప్రకారం వెనుకబడిన వర్గాల వారికి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వాలి. రెండు తెలుగు రాష్ట్రాలలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ 34 శాతానికి మాత్రమే పరిమితం చేశారు. అయితే దీనిని 52 శాతానికి పెంచాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా రాజకీయ, ఉద్యోగ రంగాలలో బీసీలకు 52 శాతానికిపైగా రిజర్వేషన్ అమలు చేయాలి. ఇవి కాకుండా రాజ్యాంగంలో బీసీ కులాల రక్షణకు, అభివృద్ధికి చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి. వీటిని అమలు చేయాలంటే కులాల వారీగా జనాభా లెక్కలు కావాలి.1986లో అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) బీసీల స్థితిగతులను తెలుసుకోవడానికి నియమించిన మురళీధరరావు కమిషన్ నివేదిక ప్రకారం బీసీల రిజర్వేషన్లను 25% నుంచి 44 శాతానికి పెంచారు. సరైన జనాభా లెక్కలు లేకుండా రిజర్వేషన్లను ఏ ప్రాతిపదికన పెంచుతారు అని ఎన్టీఆర్ ప్రభుత్వం ఇచ్చిన జీవోను ఉమ్మడి ఏపీ హైకోర్టు నిలుపుదల చేసింది.
ఆదాయ పరిమితి పెంచాలి
ఓబీసీలకు, ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు అమలు చేస్తున్న రిజర్వేషన్లలో 8 లక్షల వరకు ఆదాయ పరిమితి విధించడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించాలి. ఎన్నో ఏండ్లుగా సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా వివక్ష ఎదుర్కొంటున్న వారికి, తరతరాలుగా వేలాది ఎకరాల భూములు, ఆస్తులు, అంతస్తులు, సామాజిక హోదా అనుభవిస్తున్న వర్గాలకు ఒకే ఆర్థిక శ్రేణి, ఆదాయ పరిమితి విధించడం ఎంతవరకు సమంజసం. ఒక మోస్తరు ఉద్యోగం చేస్తున్న ఓబీసీ వర్గానికి చెందిన వ్యక్తి ఆర్థికంగా నిలదొక్కుకుంటే వారికి రాజ్యంగాబద్దంగా దక్కిన రిజర్వేషన్‌ను దూరం చేయడం కోసమే ఇలాంటి రూల్స్ పెడుతున్నారనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. బీసీలకు ఆదాయ పరిమితి ఉండకూడదు. ఒకవేళ తప్పదని అనుకుంటే కనీసం ఆదాయ పరిమితిని రూ.20 లక్షల వరకు పెంచాలని అప్పుడే ఆ వర్గ ప్రజలకు మేలు జరుగుతుందనేది వాళ్ల అభిప్రాయం. నీట్ అడ్మిషన్ల ఆలిండియా కోటాలో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు రూ.8 లక్షల ఆదాయ పరిమితిని ఏ ప్రాతిపదికన తీసుకున్నారనే దానిని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లను జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం విచారించింది. జాతీయ వ్యయ సూచిక ఆధారంగా ఆదాయ పరిమితిని విధించామని కేంద్రం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. జీవన వ్యయం అనేది రాష్ట్రాలలో ఒక విధంగా, రాష్ట్రంలోని పెద్ద నగరాల్లో మరో విధంగా ఉంటుంది కదా అని ప్రశ్నించింది.
ఈడబ్ల్యూఎస్‌తో అన్యాయం జరగట్లేదా?
మండల్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని నిర్ణయించినప్పుడు దేశంలో అల్లర్లు చేసిన కొన్ని వర్గాల ప్రజలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ఎలా పొందగలుగుతున్నారు. ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేస్తే ప్రతిభ ఉన్న వారికి అన్యాయం జరుగుతుందని చాలామంది ఆవేదన వ్యక్తం చేశారు. అదే ఈడబ్ల్యూఎస్ అమలు చేస్తే వారికి అన్యాయం జరగదా? ప్రతిభ పాడైపోదా? తమకు ఒక న్యాయం.. ఇతరులకు మరొక న్యాయం అనేది ఎంతవరకు సమంజసం. ఏపీ, తెలంగాణతోపాటు 11 రాష్ట్రాల్లో బీసీ రిజర్వేషన్లను ఏ, బీ, సీ, డీలుగా విభజించారు. ఇదే విధంగా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో, కేంద్ర ఓబీసీ జాబితాలో కూడా వర్గీకరణ జరిగితే ఉద్యోగాలలోనైనా వారికి ప్రాతినిధ్యం వచ్చి కొంతవరకైనా మేలు జరిగే అవకాశం ఉంటుంది. 2014, 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో నరేంద్ర మోడీని బీసీగా ప్రచారం చేయడం వల్ల, 47% బీసీలు బీజేపీని ఆదరించడంతో పీఎం అయ్యారు. 2017లో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీల మద్దతు కారణంగానే బీజేపీకి 312 స్థానాలు దక్కాయి. అందువల్ల బీసీల మద్దతు దక్కించుకున్న బీజేపీ కులాల వారీగా జనాభా లెక్కలు తీయడానికి చర్యలు తీసుకోవాలి. కులాల వారీగా జనాభా లెక్కలు తీసి 85 శాతంగా ఉన్న నిమ్న జాతులు అభివృద్ధికి కృషి చేయాలి. అప్పుడే సమసమాజ స్థాపన జరిగి అసమానతలు లేని దేశం ఆవిర్భవిస్తుంది. ప్రతి భారతీయుడు ఆర్థిక, సామాజిక, రాజకీయ అసమానతలు లేని సమాజంలో జీవిస్తాడు.
ఆరుగురిలో అయిదుగురు కింది కులాల వారే
యునైటెడ్ నేషన్స్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఎక్స్‌పర్ట్స్ రూపొందించిన "మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్" ప్రకారం ప్రతి ఆరుగురు నిరుపేదలలో ఐదుగురు కింది కులాల (ఎస్సీ, ఎస్టీ, బీసీ/ ఓబీసి) వారే ఉన్నారని చెప్పింది. మన దేశంలోని సుమారు 38.1 కోట్ల మంది నిరుపేదల్లో ఎస్టీలు 6.5 కోట్లు, ఎస్సీలు 9.4 కోట్లు, ఓబీసీలు 16 కోట్ల మంది ఉన్నారని తేలింది. విద్య, ఆరోగ్యం, జీవన ప్రమాణాలు, భద్రత తదితర అంశాల ఆధారంగా నివేదిక రూపొందించారు. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (ఎన్‌ఎస్‌ఎస్‌వో) నివేదిక ప్రకారం.. దేశంలో 17.24 కోట్ల గ్రామీణ కుటుంబాలు ఉండగా వాటిలో 44.4% ఓబీసీ కుటుంబాలేనని చెప్పింది. 21.6% ఎస్సీ కుటుంబాలు, 12.3% ఎస్టీ కుటుంబాలు, అలాగే ఇతర సామాజిక వర్గాలు ఫ్యామిలీలు 21.7% ఉన్నాయని తేలింది. 17.24 కోట్ల గ్రామీణ కుటుంబాల్లో 9 కోట్లు అనగా 54% వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నవిగా.. వాటిలో 45.8% ఓబీసీలు, 15.9% ఎస్సీలు, 14.2% ఎస్టీలు.. 24.1% ఇతర సామాజిక వర్గాలని రిపోర్టులో పేర్కొంది. ఇండియన్ ఇన్ఫోలైన్ లిమిటెడ్ (ఐఐఎఫ్‌ఎల్), హురున్ ఇటీవల ప్రకటించిన వెయ్యి కోట్లకు పైగా ఆస్తులు కలిగిన పది మంది యువ ధనవంతుల (40 ఏండ్లలోపు) జాబితాలో నిమ్న వర్గాలకు నుంచి ఏ ఒక్కరూ లేకపోవడం గమనించాల్సిన విషయం. యువ పారిశ్రామిక వేత్తల్లోనే కాదు, ఏ పారిశ్రామిక వేత్తల్లోనూ కూడా అణగారిన వర్గాలకు ప్రాతినిధ్యం అణువంతైనా లేకపోవడం దారుణమైన విషయం.
- కావలి చెన్నయ్య ముదిరాజ్, హైదరాబాద్