అడ్వకేట్ల తొలగింపుపై  కౌంటర్ వేయండి.. రాష్ట్రానికి హైకోర్టు ఆదేశం

అడ్వకేట్ల తొలగింపుపై  కౌంటర్ వేయండి..      రాష్ట్రానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్  ప్రభుత్వం నియమించిన ప్రభుత్వ అడ్వొకేట్లు, లీగల్  అడ్వైజర్లు, ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదులను వారి పదవీకాలం పూర్తికాకముందే తొలగించడంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి మంగళవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా కోర్టుల్లో పనిచేస్తున్న ఆ అడ్వొకేట్లను తొలగిస్తూ గత నెల 26న జారీ చేసిన జీవో 354ను సవాలుచేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.అంజయ్యతోపాటు వివిధ జిల్లాలకు చెందిన మరో 20 మంది హైకోర్టులో పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  వేశారు. దీనిపై జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  పుల్లా కార్తీక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  మంగళవారం విచారణ చేపట్టారు. పిటిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ రాజకీయ కక్షతో పిటిషనర్లను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. నిర్దిష్ట కాలపరిమితికి సేవలందించాలని నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయని, గడువు తీరక ముందే తొలగింపు ఉత్తర్వులు జారీచేయడం సరికాదని, జీవో అమలును నిలిపివేయాలని కోరారు. వాదననలు విన్న న్యాయమూర్తి ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ వివరణ ఇవ్వాలని విచారణను ఈనెల 8వ తేదీకి వాయిదా వేశారు. అయితే, జీవో అమలును నిలిపివేయడానికి నిరాకరించారు.