నకిలీ పత్తి విత్తన వ్యాపారం పది కోట్ల పైమాటే..!

నకిలీ పత్తి విత్తన వ్యాపారం పది కోట్ల పైమాటే..!
  • అధికార పార్టీ నేతలు, వారి అనుచరుల కనుసన్నల్లోనే.. 
  • ఆశించిన దిగుబడి రాక చితికిపోతున్న రైతులు  
  • గ్లైపోసెట్​ వినియోగంతో నిస్సారమవుతున్న భూములు 
  • తూతూమంత్రంగా దాడులు... అధికారులకూ కాసులు  

మంచిర్యాల, వెలుగు:మంచిర్యాల జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల దందా కొంతమంది అధికార పార్టీ లీడర్లకు, సంబంధిత అధికారులకు కాసులు పంటగా మారింది. ఓ అంచనా ప్రకారం జిల్లాలో ఏటా పది కోట్లకు పైగా విలువైన వ్యాపారం సాగుతోంది. తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు ఈ పాపంలో ఎవరి వాటా వారిదే. జిల్లాలో ఇంకా ఓవైపు పత్తి సీజన్​ ముగికముందే... మరోవైపు నకిలీ విత్తులు పల్లెలకు చేరుతున్నాయి. సాధారణంగా ఏటా జూన్​లో రైతులు పత్తి సాగు ప్రారంభిస్తారు. సీజన్​లో అయితే అడపాదడపా అధికారుల నిఘా ఉంటుందని నాలుగు నెలలు ముందుగానే నకిలీ దందాకు తెరలేపారు. ఇప్పుడైతే కాస్త తక్కువ రేటుకే వస్తామని, సీజన్​లో రేటు పెరుగుతుందని చెప్పి రైతులకు అంటగడుతున్నారు. ఇటీవలే అధికారులు నెన్నెల మండలంలో నకిలీ విత్తనాలను పట్టుకున్నారు. మళ్లీ మూడ్రోజుల కిందట టాస్క్​ఫోర్స్​ పోలీసులు తాండూర్​ మండలంలో రూ.10 లక్షల విలువైన ఐదు క్వింటాళ్ల నకిలీ విత్తనాలను పట్టుకోవడమే ఇందుకు నిదర్శనం. 

అధికార పార్టీ లీడర్ల అండతోనే.... 

జిల్లాలోని బెల్లంపల్లి నియోజకవర్గం కేంద్రంగా నకిలీ విత్తన దందా నడుస్తోంది. తాండూర్​, భీమిని, కన్నెపల్లి, నెన్నెల మండలాలు ప్రధాన కేంద్రాలుగా మారాయి. అధికార పార్టీకి చెందిన కొంతమంది చోటామోటా లీడర్లు, వారి అనుచరులు పాత్రధారులు కాగా, బడా నేతలు సూత్రధారులనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భీమిని మండలానికి చెందిన ఒక లీడర్​ నకిలీ బిజినెస్​ ద్వారా కోట్లకు పడగలెత్తిన విషయం అందరికీ తెలిసిందే. నిరుడు బహిరంగానే రైతులకు నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్టు ప్రచారం జరిగినా ఎవరూ అటువైపు కన్నెత్తి చూడలేదంటే అతడి 'పరపతి' ఏమిటో అర్థం చేసుకోవచ్చు. నకిలీ సీడ్​ 'మార్కెటింగ్​'లో పేరుమోసిన అతడిని ఇటీవలే కీలకమైన నామినేటెడ్​ పదవి వరించడం విశేషం. మూడ్రోజుల కిందట టాస్క్​ఫోర్స్​ పోలీసులకు పట్టుబడ్డవారు రేచినికి చెందిన కొడిపాక రంజిత్​కుమార్​, తాండూర్​కు చెందిన గాండ్ల మహేష్​ దగ్గర నుంచి విత్తనాలు తీసుకెళ్తున్నట్టు అంగీకరించారు. రంజిత్​కుమార్​ బెల్లంపల్లి మార్కెట్​ కమిటీ మాజీ డైరెక్టర్​ కావడం గమనార్హం. నెన్నెల మండలానికి చెందిన రూలింగ్​ పార్టీ లీడర్ల అనుచరులు, బంధువులు సైతం గతంలో పోలీసులకు పట్టుబడడం నకిలీ దందాలో వారి పాత్రను రుజువు చేస్తోంది. అలాగే బెల్లంపల్లి, మందమర్రి, తాండూర్​, మాదారం, భీమిని, కన్నెపల్లి ప్రాంతాలకు చెందిన కొంతమంది దళారులతో పాటు మరికొందరు ఆంధ్ర సెటిలర్స్​ కౌలు రైతుల ముసుగులో ఈ దందా సాగిస్తున్నారు. కొందరు అగ్రికల్చర్​, పోలీస్​ అధికారులు లోపాయికారిగా సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

ఏటా పది కోట్లకు పైగా..

దళారులు ప్రభుత్వ నిషేధిత బీటీ 3, గ్లైసిల్​ పేరుతో నకిలీ విత్తనాలను రైతులకు   విక్రయిస్తున్నారు. వీటిని మహారాష్ర్ట, ఏపీ, కర్ణాటక ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకొంటున్నారు. వివిధ కంపెనీల పేర్లతో ప్యాకింగ్​ చేసి, లూజ్​గా కిలోకు రూ.2వేల నుంచి రూ.2500 వరకు రైతులకు అమ్ముతున్నారు. మంచిర్యాల జిల్లాలో సుమారు లక్షా 70 వేల ఎకరాల్లో పత్తి సాగవుతోంది. ఇందులో దాదాపు 70 వేల నుంచి 80 వేల ఎకరాల్లో గ్లైసిల్​ విత్తనాలు వేస్తున్నట్టు అంచనా. ఎకరాకు కిలో విత్తనాల లెక్కన జిల్లాలో సుమారు రూ.12 నుంచి రూ.15 కోట్ల విలువైన బిజినెస్​ జరుగుతోంది. 

మునుగుతున్న రైతులు...

బీటీ3, గ్లైసిల్​ పత్తి సాగుతో భూసారం క్షీణించి ఆశించిన దిగుబడి రాక, పెట్టుబడులు వెళ్లక రైతులు నిండా మునుగుతున్నారు. పత్తిలో కలుపు నివారణ సమస్యగా మారడం, ​ కూలీల కొరతకు తోడు కూలి రేట్లు భారమవుతున్నాయి. గ్లైసిల్​ పత్తిలో గ్లైపోసెట్​ అనే గడ్డిమందు కొట్టడం ద్వారా కలుపును సులువుగా నివారించవచ్చని దళారులు ప్రచారం చేస్తున్నారు. ఈ మందు కొడితే గడ్డి వెంటనే చనిపోతుందని, పత్తి మొక్కలకు ఏమీ కాదని చెప్తున్నారు. ఈ కారణంతోనే రైతులు గ్లైసిల్​ సాగుకు మొగ్గుచూపుతున్నారు. గడ్డిని నివారించేందుకు గ్లైపోసెట్​ను విచ్చలవిడిగా వాడుతున్నారు. కానీ ఇది చాలా ప్రమాదకరమని, క్యాన్సర్​ కారకమని పరిశోధనల్లో వెల్లడైంది. నేలను గుల్లబార్చే రైతుమిత్ర పురుగులు, వానపాములు చనిపోయి భూములు నిస్సారమవుతాయని తేలింది. దీంతో కేంద్ర ప్రభుత్వం బీటీ3, గ్లైసిల్​ విత్తనాలను నిషేధించింది. తేయాకు తోటల్లో పరిమిత స్థాయిలో గ్లైపోసెట్​ వినియోగానికి పర్మిషన్​ ఉంది.