- తేలనున్న 525 మంది అభ్యర్థుల భవితవ్యం.. మొత్తం పోలైన ఓట్లు 2 కోట్ల 20 లక్షల 24 వేల 806
- కౌంటింగ్ నేపథ్యంలో వైన్స్బంద్.. బుధవారం ఓపెన్
హైదరాబాద్, వెలుగు: ఇరవై రోజులుగా ఎదురుచూస్తున్న ఉత్కంఠకు మంగళవారం తెరపడనుంది. లోక్‌సభ ఎన్నికల ఓట్ల కౌంటింగ్‌కు అంతా రెడీ అయింది. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ఉదయం 8 గంటలకు 34 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ముందు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత 8.30 గంటలకు ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. మధ్యాహ్నం 12 గంటల కల్లా రాష్ట్రంలోని 17 లోక్‌సభ సెగ్మెంట్లలో ఎక్కడ ఎవరు గెలుస్తున్నారనే దానిపై ఓ క్లారిటీ వస్తుంది. మొదటి ఫలితం కూడా ఆ సమయంలోనే వచ్చే చాన్స్ ఉందని ఎన్నికల అధికారులు చెప్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కౌంటింగ్ కేంద్రాల పరిధిలో బందోబస్తును ఏర్పాటు చేశారు. 15 వేల మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ రోజు ర్యాలీలకు అనుమతి లేదు. అయితే, స్థానిక పరిస్థితులకు తగ్గట్టుగా పోలీసులు అనుమతి ఇస్తే ర్యాలీలు నిర్వహించుకోవచ్చు. రాష్ట్రంలోని 17 లోక్ సభనియోజకవర్గాల్లో వివిధ పార్టీలు, ఇండిపెండెంట్లు కలిపి మొత్తం 525 మంది అభ్యర్థులు పోటీ చేశారు.
పోస్టల్‌కు 276.. ఈవీఎంలకు 1855 టేబుల్స్
తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో 2.18 లక్షల పోస్టల్ బ్యాలెట్స్ వచ్చాయి. ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు 276 టేబుల్స్‌ను ఏర్పాటు చేశారు. ఈవీఎంలకు 120 కౌంటింగ్ హాల్స్‌లో 1,855 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్ దగ్గర మైక్రో అబ్జర్వర్ ఉంటారు. కౌంటింగ్ ఏజెంట్లకు ఎక్కడ ఎలాంటి అనుమానం వచ్చినా వెంటనే కౌంటింగ్ అధికారికి తెలియజేయాల్సి ఉంటుంది. కౌంటింగ్ కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకువెళ్లేందుకు అనుమతి లేదు. కౌంటింగ్ ఏజెంట్లు, సిబ్బందికి సైతం సెల్‌ఫోన్స్ అనుమతి ఉండదు. కౌంటింగ్ కేంద్రంలోని ప్రతి మూలను కవర్ చేసేలా సీసీ కెమెరాలతో నిఘా ఉంటుంది. ఓట్ల లెక్కింపులో దాదాపు 10 వేల మంది సిబ్బంది పాల్గొంటారు. అదనపు సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారు. కౌంటింగ్ కేంద్రాల్లో 2,414 మందికి పైగా మైక్రో అబ్జర్వర్లు ఉంటారు.
అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా రౌండ్ల లెక్కింపు
ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు మినహా అన్ని నియోజకవర్గాల్లో 18 నుంచి 20 రౌండ్లలో కౌంటింగ్ ఉండనుంది. చొప్పదండి, యాకుత్‌పురా, దేవరకొండ.. ఈ మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో అత్యధికంగా 24 రౌండ్లలో లెక్కింపు ఉంటుంది. మరో మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆర్మూర్, భద్రాచలం, అశ్వారావుపేటలో అత్యల్పంగా 13 రౌండ్ల లెక్కింపు ఉండనుంది. సిబ్బంది అందరికీ లెక్కింపు ప్రక్రియపై ఇప్పటికే ట్రైనింగ్ పూర్తయింది. సెగ్మెంట్ల వారీగా ఓట్ల లెక్కింపు కోసం సిబ్బందిని ర్యాండమ్‌గా కేటాయిస్తారు. కౌంటింగ్ రోజున మద్యం దుకాణాలు బంద్ ఉంటాయి.
భువనగిరిలో 76.78 పోలింగ్
లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 2 కోట్ల 20 లక్షల 24,806 మంది వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో మహిళ ఓటర్లు, పురుష ఓటర్లు దాదాపు సమానంగా ఉండటం గమనార్హం. రాష్ట్రంలోని మొత్తం 3,32,16,348 మంది ఓటర్లకు గాను 66.3 శాతం మంది పోలింగ్‌లో పాల్గొన్నారు. రాష్ట్రంలోని మొత్తం 35,809 పోలింగ్ కేంద్రాల్లో 2,18,14,035 మంది ఓటు హక్కును వినియోగించుకోగా, మిగిలిన 2,10,771 మంది ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లలో, పోస్టల్ ఓటింగ్ రూపంలో, హోమ్ ఓటింగ్ పద్ధతిలో ఓటు వేశారు. పోలింగ్ కేంద్రాల్లో పోలైన ఓట్లు 65.67% ఉండగా మిగిలినది ఈ మూడు రూపాల్లో ఉన్నది. దీంతో మొత్తం పోలింగ్ 66.3 శాతం నమోదైంది. అత్యధికంగా భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంలో 76.78% మేర పోలింగ్ నమోదుకాగా అతి తక్కువగా హైదరాబాద్ నియోజకవర్గంలో 48.48% నమోదైంది. అసెంబ్లీ సెగ్మెంట్లవారీగా చూస్తే నర్సాపూర్‌లో 84.25% నమోదుకాగా మలక్‌పేట్‌లో 42.76% నమోదైంది.