- ఒక్కో ఈవీఎంను మూడుసార్లు లెక్కించనున్న సిబ్బంది
- రాత్రి 8 గంటల వరకు లెక్కింపు
- స్ట్రాండ్ రూమ్‌కు మూడంచల భద్రత
- ప్రెస్మీట్లో కలెక్టర్లు వీపీ గౌతమ్, ప్రియాంక అల, సీపీ విష్ణు వారియర్, ఎస్పీ వినీత్
భద్రాద్రికొత్తగూడె/ఖమ్మం రూరల్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలకు ఆదివారం ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సర్వం సిద్ధం చేసినట్లు ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్లు వీపీ గౌతమ్, ప్రియాంక అల, సీపీ విష్ణు వారియర్, ఎస్పీ వినీత్ తెలిపారు.
ఖమ్మం జిల్లాలో...
ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను ఖమ్మం రూరల్ మండలంలోని పొన్నెకల్లు శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాల స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచారు. ఆదివారం కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు ఎస్.వారియర్‌తో కలిసి మండలంలోని పొన్నెకల్లు శ్రీచైతన్య ఇంజినీరింగ్‌కళాశాల స్ట్రాండ్ రూమ్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఓట్ల లెక్కింపు ప్రకియపై వివరించారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కౌంటింగ్ ప్రక్రియ మొదలుకానున్నదని, మొదటి అరగంటలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ పూర్తవుతుందని కలెక్టర్ చెప్పారు.
అనంతరం ఈవీఎంలను కౌంటింగ్ అబ్జర్వర్లు, రాజకీయ పార్టీల ఏజెంట్ల ఎదుట లైవ్ వీడియో సమక్షంలో ఓపెన్ చేయనున్నట్లు తెలిపారు. ప్రతీ ఈవీఎంను మూడుసార్లు లెక్కించాల్సి ఉన్నందున ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం ఉందని చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి 14 టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. పోలింగ్ కేంద్రాలు ఎక్కువున్న నియోజకవర్గాలకు ఎక్కువ టేబుల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. పాలేరులో 289 పోలింగ్ కేంద్రాలు ఉండగా 14 టేబుళ్లు 21రౌండ్లు, మధిర 268 కేంద్రాలకు14 టేబుళ్లు 20 రౌండ్లు, వైరాలో 252 కేంద్రాలకు14 టేబుళ్లు 18 రౌండ్లు, సత్తుపల్లిలో 292 కేంద్రాలకు 14 టేబుళ్లు 21 రౌండ్లు, ఖమ్మంలో 355 కేంద్రాలకు 16 టేబుళ్లు 23 రౌండ్లు ఉంటాయని వివరించారు.
పోస్టల్ బ్యాలెట్లు ఐదు నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 14,373 వచ్చాయని, ఇది గత ఏడాది కంటే డబుల్అని చెప్పారు. ఒక్కో టేబుల్‌కి ఒక మైక్రో అబ్జర్వర్, కౌంటింగ్ సూపర్‌వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లతో సహా మొత్తం ఆరుగురు ఉంటారని తెలిపారు. ప్రతి గంటలకు ఒకసారి ఫలితాలను వెల్లడించనున్నట్లు తెలిపారు. సీపీ మాట్లాడుతూ ఈవీఎంలను భద్ర పరిచిన స్ట్రాంగ్ రూమ్‌ల ముందు కేంద్ర, రాష్ట్ర బలగాలతో మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని చెప్పారు. కౌంటింగ్ కేంద్రం లోపల, బయట సీసీ కెమెరాలను అమర్చి ప్రత్యేక నిఘా మధ్యన ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. కౌంటింగ్ కేంద్రంలోకి అబ్జర్వర్లకు తప్ప ఎవరికీ సెల్ఫోన్అనుమతి లేదన్నారు.
ఒకే ఎంట్రీ, ఎగ్జిట్ తో పాటు స్ట్రాంగ్ రూమ్ కు డబుల్ లాక్ సిస్టం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాల్లో పోలీస్ పికెటింగ్ కొనసాగుతుందన్నారు. పటిష్టబందోబస్తు 24 గంటలు అందిస్తున్నామన్నారు. కంటికి రెప్పలా సీఆర్పీ, స్టేట్ ఆర్మూ డ్ టీమ్, సివిల్ పోలీసులు పకడ్బందీగా విధులు నిర్వహిస్తున్నారన్నారు. సోమవారం ఉదయం వరకు 144 సెక్షన్ అమలులో ఉండనుందని, ప్రజలు సహకరించాలన్నారు. రిజల్ట్ రోజు రాజకీయ పార్టీలు ఎటువంటి ర్యాలీలు చేయకూడదని, అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. కౌంటింగ్ సమయంలో అభ్యర్థులు, ఏజెంట్లు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 144 సెక్షన్ ముగిసిన తర్వాత ర్యాలీలకు పర్మిషన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు.
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో..
కలెక్టరేట్లో ఓట్ల కౌంటింగ్‌కు సంబంధించి లెక్కింపు పరిశీలకులతో కలిసి శనివారం నిర్వహించిన మీటింగ్‌లో కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల మాట్లాడారు. కౌంటింగ్ డ్యూటీ చేసే వారిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించనున్నట్టు తెలిపారు. కౌంటింగ్‌ను పరిశీలించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక పరిశీలకులను నియమించిందని చెప్పారు. కొత్తగూడెంకు కమల్ కిషోర్, ఇల్లెందుకు హరి కిషోర్, అశ్వారావుపేటకు వినేశ్ కుమార్, భద్రాచలానికి గణేశ్, భద్రాచలానికి కంటి శేఖర్ సింగ్ పరిశీలకులుగా వ్యవహరించనున్నారని తెలిపారు.
భద్రాచలంలో 76పోలింగ్ బూత్‌లకు సంబంధించి 13 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కానుందన్నారు. అశ్వారావుపేటలో 184 పోలింగ్ బూత్‌లకు 14 , ఇల్లెందులో 241 పోలింగ్ బూత్‌లకు 18, పినపాకలో 244 పోలింగ్ బూత్‌లకు 18, కొత్తగూడెంలో 253పోలింగ్ బూత్‌లకు 19 రౌండ్లలో లెక్కింపు ఉంటుందని చెప్పారు. ఎస్పీ డాక్టర్ వినీత్ మాట్లాడుతూ ఐదు నియోజకవర్గాలకు కలిపి ఓట్ల లెక్కింపు జరిగే పాల్వంచలోని అనుబోస్ కాలేజ్‌లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మూడంచెల బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గుర్తింపు కార్డులు ఉన్న వారిని మాత్రమే లెక్కింపు కేంద్రంలోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు.