జగిత్యాల, వెలుగు : జగిత్యాల జిల్లా ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఓ ట్ల లెక్కింపు వ్యవహారం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఈ ఘటనపై ఎలక్షన్ కమిషన్ తరపున ఓ ఐఏఎస్ ఆఫీసర్ సోమవారం విచారణకు రానున్నారు. కొండగట్టు జేఎన్టీయూలో ఆయన ఎంక్వైరీ చేయనున్నట్టు సమాచారం. ఈ మేరకు రిటర్నింగ్ ఆఫీసర్ భిక్షపతితో పాటు ఎన్నికల అధికారులకు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ధర్మపురి నుంచి పోటీ చేసిన అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ..మంత్రి కొప్పుల ఈశ్వర్ చేతిలో 441 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
అయితే, రీకౌంటింగ్ చేయాలని లక్ష్మణ్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఉన్నత న్యాయస్థానం స్ట్రాంగ్ రూముల్లోని పోలింగ్, కౌంటింగ్ ఫామ్స్‌కు సంబంధించిన వివరాలను సమర్పించాలని అధికారులను ఆదేశించింది. గత సోమవారం ఆఫీసర్లు వారి దగ్గరున్న తాళాలతో స్ట్రాంగ్‌రూంను తెరిచేందుకు యత్నించగా ఓపెన్ కాలేదు. తాళం చెవులు పోగొట్టడం వల్లే ఓపెన్ చేయలేకపోయారని లక్ష్మణ్‌కుమార్ కోర్టు దృష్టికి తీసుకుపోయారు. దీంతో అసలు ఏం జరిగిందో తేల్చాలని ఈ నెల 12న ఈసీని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో ఎన్నికల సంఘం ఓ ఐఏఎస్ ఆఫీసర్‌ను నియమించగా, ఆయన సోమవారం జగిత్యాలకు రానున్నారు. పూర్తి వివరాలతో కోర్టుకు నివేదిక ఇవ్వనున్నారు.