కౌంటింగ్‌‌కు రెడీ .. నేడు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు స్టార్ట్‌‌    

  • ముందుగా పోస్టల్‌‌ బ్యాలెట్ల కౌంటింగ్‌‌
  • తర్వాత ఈవీఎంలలోని ఓట్లు లెక్కించనున్న ఆఫీసర్లు
  • ప్రతీ నియోజకవర్గానికి 14 టేబుళ్లు ఏర్పాటు, 
  • పోస్టల్‌‌ బ్యాలెట్లకు ప్రత్యేక కౌంటర్‌‌

హనుమకొండ/వరంగల్‌‌/మహబూబాబాద్‌‌, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ఫైనల్‌‌ స్టేజ్‌‌కు చేరుకుంది. గత నెల 30న పోలింగ్‌‌ పూర్తి కావడంతో ఆదివారం ఈవీఎంలను ఓపెన్‌‌ చేసి ఓట్లను లెక్కించనున్నారు. ఉదయం 7 నుంచి 8 గంటల వరకు మాక్‌‌ కౌంటింగ్​ నిర్వహించనున్నారు. తర్వాత 8 గంటల కౌంటింగ్‌‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. ముందుగా పోస్టల్‌‌ బ్యాలెట్లను లెక్కించేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు.

పోస్టల్‌‌ బ్యాలెట్ల లెక్కింపు పూర్తయిన అనంతరం ఈవీఎంలలోని ఓట్లను లెక్కించనున్నారు. ఇందుకోసం ప్రతీ నియోకవర్గానికి 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌‌కు నలుగురు సిబ్బందిని కేటాయించారు. ప్రతి అరగంట నుంచి 45 నిమిషాల వ్యవధిలో ఒక్కో రౌండ్​రిజల్ట్‌‌ వెలువడే అవకాశం ఉంది. కౌంటింగ్​ప్రక్రియకు సంబంధించి రిహార్సల్స్‌‌ ఇప్పటికే పూర్తయ్యాయని, రిజల్ట్‌‌ను మీడియా సెంటర్‌‌ ద్వారానే ప్రకటిస్తామని ఆఫీసర్లు చెప్పారు. కౌంటింగ్‌‌కు సంబంధించిన ఏర్పాట్లను శనివారం ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు, రిటర్నింగ్‌‌ ఆఫీసర్లు పరిశీలించారు. పార్టీల లీడర్లు, అభిమానులు భారీ సంఖ్యలో కౌంటింగ్‌‌ కేంద్రం వద్దకు చేరుకునే అవకాశం ఉండడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతా చర్యలు చేపట్టారు. 

జనగామలో ఎవరి ధీమా వారిదే..

జనగామ, వెలుగు : జనగామ జిల్లాలో పాలకుర్తి, జనగామ, స్టేషన్‌‌ఘన్‌‌పూర్‌‌ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్‌‌ను జనగామ జిల్లా కేంద్రం శివారు పెంబర్తిలోని వీబీఐటీ కాలేజీలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆఫీసర్లు పూర్తి చేశారు. జనగామ కౌంటింగ్‌‌ 20 రౌండ్లలో, పాలకుర్తి, స్టేషన్‌‌ ఘన్‌‌పూర్‌‌ నియోజకవర్గాల కౌంటింగ్‌‌ 21 రౌండ్లలో పూర్తి కానుంది. ఒక్కో రౌండ్‌‌ 10 వేలకుపైగా ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది.

జనగామ నియోజకవర్గంలో 19 మంది క్యాండిడేట్లు బరిలో ఉండగా ప్రధానంగా బీఆర్‌‌ఎస్‌‌ క్యాండిడేట్‌‌ పల్లా రాజేశ్వర్‌‌రెడ్డి, కాంగ్రెస్‌‌ క్యాండిడేట్‌‌ కొమ్మూరి ప్రతాప్‌‌రెడ్డి మధ్య పోరు నెలకొంది. పాలకుర్తిలో 15 మంది బరిలో ఉండగా బీఆర్‌‌ఎస్‌‌ క్యాండిడేట్‌‌, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌రావు, కాంగ్రెస్‌‌ అభ్యర్థి యశస్విని రెడ్డి మధ్య పోటీ ఉంది. ఇక స్టేషన్‌‌ ఘన్‌‌పూర్‌‌లో 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ బీఆర్‌‌ఎస్‌‌ క్యాండిడేట్‌‌ కడియం శ్రీహరి, కాంగ్రెస్‌‌ అభ్యర్థి సింగపురం ఇందిర మధ్య ప్రధాన పోటీ నెలకొంది. గెలుపుపై ఎవరి ధీమాలో వారు ఉన్నారు.

ములుగులో 22 రౌండ్లు

ములుగు, వెలుగు : ములుగు నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌‌ ఇలా త్రిపాఠి చెప్పారు. స్ట్రాంగ్‌‌ రూం వద్ద భద్రతా, కౌంటింగ్‌‌ ఏర్పాట్లను ఆమె పరిశీలించి, ఆఫీసర్లకు పలు సూచనలు చేశారు. ములుగు కౌంటింగ్‌‌ 22 రౌండ్లలో పూర్తి కానున్నట్లు చెప్పారు. కౌంటింగ్‌‌కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లను మరోసారి సమీక్షించుకోవాలని కలెక్టర్‌‌ సూచించారు. కౌంటింగ్‌‌ కోసం 16 మంది నోడల్‌‌ ఆఫీసర్లు, 16 మంది కౌంటింగ్‌‌ సూపర్‌‌వైజర్లు, 15 మంది కౌంటింగ్‌‌ అసిస్టెంట్లు, 22 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించినట్లు చెప్పారు. కౌంటింగ్‌‌ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయనున్నట్లు కలెక్టర్‌‌ ఇలా త్రిపాఠి, ఆర్‌‌వో అంకిత్‌‌ చెప్పారు. భూపాలపల్లి నియోజకవర్గంలో 23 రౌండ్లలో కౌంటింగ్‌ పూర్తి కానుంది.

17 నుంచి 21 రౌండ్లలో రిజల్ట్‌‌

హనుమకొండ జిల్లాలోని పరకాల, వరంగల్ వెస్ట్‌‌, వరంగల్‌‌ జిల్లాలోని వరంగల్‍ తూర్పు, నర్సంపేట, వర్ధన్నపేట నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం వరంగల్‍ ఏనుమాముల అగ్రికల్చర్‌‌ మార్కెట్‌‌లో ఏర్పాట్లు పూర్తి చేశారు. పరకాల నియోజకవర్గ కౌంటింగ్‌‌ 17 రౌండ్లలో, వరంగల్‌‌ వెస్ట్‌‌ లెక్కింపు 18 రౌండ్లలో పూర్తి కానుంది. వరంగల్‍ తూర్పు, వర్ధన్నపేట, నర్సంపేట నియోజకవర్గాల ఓట్ల లెక్కింపును మార్కెట్‍ యార్డులోని 17 నంబర్‌‌ గోదాంలో నిర్వహించనున్నారు.

వరంగల్‌‌ తూర్పు కౌంటింగ్‌‌ 17 రౌండ్లలో, వర్ధన్నపేట 20, నర్సంపేట నియోజకవర్గ లెక్కింపు 21 రౌండ్లలో పూర్తి కానుంది. అలాగే మహబూబాబాద్‌‌, డోర్నకల్‌‌ నియోజకవర్గాల కౌంటింగ్‌‌కు మహబూబాబాద్‌‌లోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్‌‌ స్కూల్‌‌లో ఏర్పాట్లు చేశారు. ఒక్కో నియోజకవర్గం రిజల్ట్‌‌ 21 రౌండ్లలో తేలనుంది. మైక్రో అబ్జర్వర్లు, కౌంటింగ్‌‌ అసిస్టెంట్లు, సూపర్‌‌వైజర్లుగా సెక్టోరల్‌‌ఆఫీసర్లు కౌంటింగ్‌‌ విధుల్లో పాల్గొననున్నారు.