పొరపాట్లు లేకుండా కౌంటింగ్ పూర్తి చేయాలి : ఇలా త్రిపాఠి 

ములుగు/ వరంగల్​సిటీ, వెలుగు: పొరపాట్లు లేకుండా కౌంటింగ్​ప్రక్రియ పూర్తి చేయాలని ములుగు కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ లో అదనపు రిటర్నింగ్ అధికారి, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ చిత్రా మిశ్రాతో కలిసి కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్లకు కౌంటింగ్ ప్రక్రియ నిర్వహణ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 4న జరగనున్న పార్లమెంటు ఓట్ల లెక్కింపు ప్రక్రియలో సిబ్బంది ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. రిజర్వ్ సిబ్బంది అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని, సీలింగ్ సిబ్బంది ప్రత్యేకంగా ఉండాలన్నారు. అనంతరం అదనపు రిటర్నింగ్ అధికారి, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌, కంట్రోల్‌ యూనిట్లలోని ఓట్ల కౌంటింగ్‌, వీవీపాట్‌ స్లిప్పులు కౌంటింగ్‌ విధి విధానాలను వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్రీజ, అదనపు కలెక్టర్ మహేందర్ జి, ఎలెక్షన్ సెల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

సిబ్బంది కి అవగాహన తప్పనిసరి..

కౌంటింగ్ సరళి పై సిబ్బందికి అవగాహన ఎంతో ముఖ్యమని ఏఆర్వో, బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయం లోని కౌన్సిల్ హాల్ లో కౌంటింగ్ విధానంపై  కంప్యూటర్ ఆపరేటర్లు, సిబ్బందికి ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. 230 పోలింగ్ కేంద్రాలకు గాను 14 టేబుళ్లను ఏర్పాటు చేసి, 16 రౌండ్లలో కౌంటింగ్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్లు, ఎన్నికల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.