దేశమే నా కుటుంబం : ప్రధాని మోదీ

దేశమే నా కుటుంబం : ప్రధాని మోదీ
  • మేరా భారత్, మేరా పరివార్.. నా నినాదం 
  • వికసిత్​ భారత్​ లక్ష్యంగా ముందుకెళ్తున్నం
  • బీఆర్ఎస్, కాంగ్రెస్​ లూట్​, ఝూట్​ పార్టీలు
  • కాళేశ్వరంలో బీఆర్ఎస్​ అవినీతికి పాల్పడితే.. 
  • ఆ ఫైళ్లను కాంగ్రెస్​ ప్రభుత్వం దాస్తున్నది
  • టీఆర్​ఎస్​ బీఆర్​ఎస్​గా మారినా రాష్ట్రంలో మార్పు రాలేదు.. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చినా ఏ మార్పూ కనిపిస్తలేదు
  • ఆదిలాబాద్ విజయ సంకల్ప సభలో వ్యాఖ్యలు
  • హైదారాబాద్​లో రాంజీ గోండు పేరుతో 
  • మ్యూజియం ఏర్పాటు చేస్తామని ప్రకటన

ఆదిలాబాద్, వెలుగు: దేశమే తన కుటుంబమని, తన జీవితం తెరిచిన పుస్తకమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ‘‘నాకు  ప్రత్యేకంగా కుటుంబం లేదు.. దేశమే నా కుటుంబం.. మీరంతా నా కుటుంబ సభ్యులే.. నేను మోదీ కుటుంబ సభ్యుడిని అని చెప్పుకోండి.. నా జీవితం తెరిచిన పుస్తకం లాంటిది.. నా ప్రతి అణువు దేశం కోసమే.. నేను నా ఇంటిని చిన్నప్పుడు విచిపెట్టిన..  దేశ ప్రజల కోసం జీవిస్తానని శపథం తీసుకున్న.. ప్రజల కలను నెరవేర్చడమే నా కల.. మేరా భారత్ మేరా పరివార్.. ఇదే నా నినాదం’’ అని తెలిపారు. 

సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఏర్పాటు చేసిన బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ‘‘అయోధ్య రామమందిరం బంగారు తలుపుల తయారీలో తెలంగాణ రాష్ట్ర పాత్ర ఉంది.. తెలంగాణ ప్రజలకు రాంలల్లా ఆశీర్వాదాలు ఉంటాయి.. వికసిత్ భారత్, వికసిత్ తెలంగాణ సాధిద్దాం. మన తల్లిదండ్రులు కష్టపడ్డారు.. మన పిల్లలకు ఆ కష్టాలు రానివ్వొద్దు.. ఇందు కోసం మీ అందరి ప్రేమ, ఆశీర్వాదం కావాలి” అని ఆయన అన్నారు. ఇది ఎన్నికల సభ కాదు వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకెళ్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. 

 ‘‘ఇది ఎన్నికల సభకాదు. విశ్లేషకులారా.. దీనిని ఎన్నికల సభ అనుకోవద్దు. ఎన్నికల షెడ్యుల్ ఇంకా రానేలేదు. ప్రస్తుతం దేశంలో వికసిత్ ఉత్సవాలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం వేగంగా అభివృద్ధి పనులు చేపడుతున్నది. గత 15 రోజుల నుంచి  నేను వరుసగా వికసిత్ ఉత్సవాల్లో పాల్గొంటూ అభివృద్ధి పనుల లెక్కలు వివరిస్తున్నాను.. ఇక్కడికి కూడా అందుకోసమే వచ్చాను. 

దేశంలో రెండు ఐఐటీలు, ఒక ట్రిపుల్ ఐటీ, మూడు ఐఐఎం, ఒక ఐఐఎస్, 5 ఎయిమ్స్ లు ఈ 15 రోజుల్లో  ప్రారంభించాను. 18 కోట్లతో రైతుల కోసం స్టోరేజీ స్కీంలను ప్రారంభించాను’’ అని ఆయన పేర్కొన్నారు. రైతు సహకార సొసైటీలను కంప్యూటరీకరించామని, రైల్వే విస్తరణ పనులు ప్రారంభించామని, కృష్ణా గోదావరి బేసిన్ లో ఆయిల్ నిక్షేపాలను వెలికి తీశామని చెప్పారు. ఆత్మ నిర్భర్ భారత్ –వికసిత్ భారత్​తో లోక కల్యాణం జరుగుతున్నదని, ఎన్నికలతో సంబంధం లేకుండా దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నామన్నారు.

 వికసిత్ భారత్ నిర్మాణం కోసం రూపొందించిన యాక్షన్ ప్లాన్​లో భాగంగా మంత్రులతో కాప్స్ టీంలు ఏర్పాటు చేశామని, ఇప్పటి వరకు 15 లక్షల మంది సలహాలు తీసుకున్నామని వెల్లడించారు. 3.75 లక్షల మంది స్టేక్​హోల్డర్స్ లతో 3 వేల మీటింగులు పెట్టామని, ఈ ప్రక్రియలో 1,200 యూనివర్సిటీలను, 15 లక్షల మంది యువకులను ఇందులో భాగస్వాములుగా చేశామని తెలిపారు. తాము తీసుకుంటున్న చర్యల వల్ల గత పదేండ్లలో 25 కోట్ల మంది  పేదరికం నుంచి  బయటపడ్డారని ప్రధాని చెప్పారు. 

ఆలస్యంగా రాక..

ప్రధాని నరేంద్ర మోదీ ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ కంటే ఆలస్యంగా ఆదిలాబాద్​కు చేరుకున్నారు. ఉదయం 10.30 గంటలకు రావాల్సి ఉండగా.. 11.30 గంటలకు చేరుకున్నారు. ప్రధాని ముందుగా గవర్నర్ తమిళి సై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్థాపనల్లో పాల్గొన్నారు. 

అనంతరం మధ్యాహ్నం 12.20 గంటలకు బీజేపీ విజయసంకల్ప సభ ప్రారంభమైంది. అరగంట పాటు మోదీ ప్రసంగం కొనసాగింది. ఈ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు సోయం బాపురావు, బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్, పాల్వాయి హరీశ్​బాబు, రామరావు పటేల్ పాల్గొన్నారు.

ఆదివాసీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నం..

‘‘రాంజీ గోండు, కొమురం భీం వంటి మహావ్యక్తులు జన్మించిన గడ్డ ఇది. త్యాగాలతో తెలంగాణ భూమి తరించింది. 2014 సంవత్సరం తర్వాత ఈ మహానీయులకు బీజేపీ గుర్తింపు ఇవ్వడమే కాకుండా ఆదివాసీ అభివృద్ధికి నడుం బిగించింది. బీజేపీ కంటే ముందు పరిపాలించిన ప్రభుత్వాలు ఆదివాసీలను నిర్లక్ష్యం చేశాయి. కానీ ఆదివాసీ మహిళను రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీకి దక్కింది. ఆదివాసీల గౌరవం పెంచేందుకు బీజేపీ పనిచేస్తున్నది. ఆదివాసీల దైవమైన బిర్సాముండా జయంతిని కేంద్రం అధికారికంగా నిర్వహిస్తున్నది” అని ప్రధాని మోదీ తెలిపారు. 

హైదారాబాద్​లో రాంజీ గోండు పేరుతో మ్యూజియం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఆదివాసీలను గౌరవించడమే కాకుండా వారిని వెనుకబాటు నుంచి తొలగించి అభివృద్ధి చేసేందుకు పీఏం జన్​మన్​ స్కీంను రూ. 2 వేల కోట్లతో అమలుచేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ స్కీమ్​ ద్వారా తెలంగాణలోని చెంచు, కొలం, కొండారెడ్డి, తోటి, చిన్నచిన్న తెగలకు  ప్రయోజనం కలుగుతుంద న్నారు. సమ్మక్క, సారలమ్మ పేరుతో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

 తెలంగాణ రైతుల కల అయిన పసుపు బోర్డును  ఏర్పాటు చేయడమే కాకుండా పత్తి రైతులకు ఎమ్మెస్పీని కల్పిస్తున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా ఏడు మెగాటెక్స్ టైల్ పార్కులు ఏర్పాటు చేస్తుండగా ఇందులో తెలంగాణలో ఒకటి ఉందని అన్నారు.  ఇతర పార్టీల మాదిరి గ్యారంటీలపై తాము మాటతప్పమని, మోదీ గ్యారంటీ అంటే గ్యారంటీగా అమలవుతుందని ఆయన చెప్పారు. 

కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ ఒక్కటే

‘‘బీఆర్ఎస్, కాంగ్రెస్.. కుటుంబ పార్టీలు. ఒకటి లూట్​ పార్టీ అయితే.. మరొకటి ఝూట్ పార్టీ. టీఆర్ఎస్  బీఆర్ఎస్ గా మార్పు చెందినప్పటికీ రాష్ట్రంలో ఎలాంటి మార్పు తేలేకపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఏం మార్పు కనిపించడం లేదు. ఈ రెండు పార్టీలు ఒక్కటే. అవినీతి, అక్రమాలు, కుటుంబ పాలనకు మాత్రమే కట్టుబడి ఉంటాయి” అని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. బీఆర్ఎస్​ నేతలు వాళ్ల హయాంలో కాళేశ్వరంలో అవినీతికి పాల్పడితే, ఆ అవినీతికి సంబంధించిన ఫైళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం దాచిపెడుతున్నదని ఆరోపించారు.

 ‘‘కాళేశ్వరం ప్రాజెక్టులో  మీరు తిన్నారు అంటే మీరు తిన్నారు అంటూ కాంగ్రెస్​, బీఆర్​ఎస్​తిట్టుకుంటున్నాయి. కాళేశ్వరం అవినీతిపై విచారణ జరిపిస్తామన్న కాంగ్రెస్ ఇప్పటి వరకు ఎందుకు ముందడుగు వేయలేదు?” అని ఆయన ప్రశ్నించారు. ఎక్కడ చూసినా ప్రజలు ‘అబ్ కీ బార్ చార్ సౌ పార్’ అంటూ నినదిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి ఓటు వేసి 400 సీట్లు ఇస్తామని చెప్తున్నారని మోదీ తెలుగులో అన్నారు.