![కొందరి చేతుల్లో అందరి సంపద](https://static.v6velugu.com/uploads/2020/01/Country.jpg)
గరీబోళ్లు ఇంకా ఇంకా గరీబైతుంటే.. పెద్దోళ్లు అంతకంతకు పెద్దగైతున్నరు. దేశంల ఒక్క శాతం మంది పెద్దోళ్ల దగ్గర 95 కోట్ల మంది దగ్గరున్న పైసలకంటే 4 రెట్లు ఎక్కువ డబ్బుంది. ఇదీ ఆక్స్ఫామ్ అనే కంపెనోళ్ల రిపోర్టు చెబుతున్న మాట. అవును మరి, దేశంలనే కాదు, దునియా మొత్తంల పరిస్థితి గిట్లనే ఉందట. ఉన్నోళ్లకు, లేనోళ్లకు మధ్య అంతకంతకూ దూరం ఎక్కువైతున్నదట. దునియాలో 22 మంది సంపద, ఆఫ్రికా దేశాల ఆడోళ్ల దగ్గరున్న సంపదలకు సమానమట. ప్రపంచంల 1 శాతం కుబేరుల దగ్గర ఉన్న డబ్బు.. 690 కోట్ల మంది దగ్గరున్న ఉన్నదానికంటే డబుల్ ఉంది.
ఒకరికి తినడానికి కనీసం బ్రెడ్డు ముక్క కూడా దొరకదు.. ఇంకొకరు పంచభక్ష పరమాన్నాలు తింటారు, మిగిలింది పడేస్తరు. ఒక వైపు మురికివాడలు.. వాటికి ఆనుకుని ఆకాశాన్ని తాకే పెద్ద పెద్ద బిల్డింగులు. ఒంటిని కప్పుకునే బట్టలు కూడా లేనోళ్లు కొందరైతే.. విలాసాల భోగంతో బట్టలకే లక్షలు ఖర్చు పెట్టేటోళ్లు ఇంకొందరు. ఆరోగ్యం పాడైనా డాక్టరు దగ్గరకెళ్లలేనోళ్లు కొందరు.. చిన్న జబ్బైనా విదేశాల్లో ట్రీట్మెంట్ తీసుకునేటోళ్లు ఇంకొందరు..!
దేశ బడ్జెట్ రూ.24.42 లక్షల కోట్ల కన్నా ఎక్కువ
ప్రపంచంలోని 22 మంది సంపద 690 కోట్ల మంది సంపద కన్నా రెట్టింపు
విలువ లేకుండా పోతున్న మహిళల ఇంటి పనులు
జీతమిస్తే ఆ పని విలువ రూ.7.67 కోట్ల కోట్లు
ఆక్స్ఫమ్ రిపోర్ట్‌లో వెల్లడి
…సొసైటీలో ఆర్థిక అసమానతలు ఎంతలా పాతుకుపోయాయో చెప్పే ఉదంతాలివి. నానాటికీ అవి పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సు నేపథ్యంలో ఆక్స్‌ఫాం ‘టైం టు కేర్’ ఓ రిపోర్టును విడుదల చేసింది. పేదలకు, పెద్దలకు మధ్య భారీ అంతరం ఉన్నట్టు తేల్చింది. ఎంతలా అంటే మన దేశంలోని 95.3 కోట్ల మంది దగ్గరున్న సంపదకు నాలుగు రెట్ల సంపద కేవలం ఒక్క శాతం, ఒక్కటంటే ఒక్కశాతం ధనికుల దగ్గరే ఉందని వెల్లడించింది. అది మనదేశ గత ఏడాది బడ్జెట్ రూ.24.42 లక్షల కోట్ల కన్నా ఎక్కువే ఉంటుందట. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అసమానతలు, లింగ వివక్ష ఎంతలా ఉందో స్టడీ చేసి ఆ రిపోర్టును విడుదల చేసింది ఆక్స్ఫామ్. ప్రపంచంలోని ధనికులంతా తమ దగ్గర పనిచేసేవాళ్ల నుంచి లాభపడుతున్నారే తప్ప, వాళ్ల కోసం మాత్రం ఏం చేయట్లేదని తెలిపింది. అంతేగాకుండా జీతం విషయంలో మహిళలు, మగవాళ్లు అన్న తేడా కూడా చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
ఒక్క శాతం పెద్దోళ్ల దగ్గర డబుల్ డబ్బులు
ఒక్క మన ఇండియాలోని పరిస్థితే కాదిది. ప్రపంచమంతా అలాగే ఉంది. 690 కోట్ల మంది జనం దగ్గర ఉన్న సంపదకు రెట్టింపు సంపద ఒక్క శాతం ధనికుల దగ్గరే ఉంది. 2,153 మంది ధనికుల దగ్గర సంపద 460 కోట్ల మంది సంపదల కన్నా ఎక్కువ ఉంది. ప్రపంచంలోని ఐదుగురు కుబేరుల సగటు సంపాదనను ఓ మామూలు మనిషి చేరుకోవాలంటే ఈజిప్ట్‌లో పిరమిడ్లు కట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా రోజూ 10 వేల డాలర్లు వెనకేసుకోవాలట. కానీ, వరల్డ్ బ్యాంక్ లెక్కల ప్రకారం రోజూ 5.5 డాలర్లు దొరకడమే గగనమైపోతోందని చెబుతున్నాయి.
22 మంది మగాళ్ల దగ్గర…
ఆఫ్రికా.. ప్రపంచంలోని అత్యంత పేద దేశాలున్న ఖండం అది. అయితే, ఆఫ్రికాలో ఉన్న మహిళలతో పోలిస్తే కేవలం ప్రపంచంలోని 22 మంది మగమహారాజుల దగ్గరే ఎక్కువ డబ్బులున్నాయి. ఇద్దరు కుబేరులు తమ డబ్బుల కట్టలను పేరుస్తూ పోతే ఏకంగా ‘ఔటర్ స్పేస్’లోకి వెళ్లిపోతారట. కానీ, అభివృద్ధి చెందిన దేశాల్లో ఓ మామూలు మనిషి ఓ చైర్ మీద కూర్చోవడమే గొప్ప అని, చాలా మంది నేలపైనే కూర్చోవలసిన పరిస్థితి అని పేర్కొంది.
ఆడాళ్ల పనికి విలువేది?
ప్రపంచవ్యాప్తంగా మహిళలు చేసే పనికి విలువ లేకుండాపోతోందని ఆక్స్ఫామ్ వెల్లడించింది. నీళ్లు మోసుకోవడం, ఇల్లు శుభ్రం చేసుకోవడం, వంట చేసి పెట్టడం, పిల్లల బాగోగులు చూడడం.. మహిళలు చేసే ఈ ఇంటి పనులకు విలువ లేకుండా పోతోందని చెప్పింది. అలా 1250 కోట్ల గంటల పాటు ఎలాంటి డబ్బులు ఆశించకుండా పనిచేస్తున్నారని చెప్పింది. ఎక్కువగా పేద దేశాల్లోని పేద కుటుంబాల వాళ్లే ప్రభావితమవుతున్నారని పేర్కొంది. ఉగాండా, జింబాబ్వే, ఇండియా, ఫిలిప్పీన్స్, కెన్యా వంటి దేశాల్లో నీళ్లు తేవడం, పొయ్యిలోకి కట్టెలు తీసుకురావడం వంటి పనుల కోసమే 40 నిమిషాలు ఎక్కువ టైం కేటాయిస్తున్నారని తెలిపింది.
మహిళలపై క్లైమేట్ క్రైసిస్ దెబ్బ
జీతం లేని పనితో పాటు వాతావరణ మార్పులూ మహిళలపై పెద్ద ప్రభావాన్నే చూపిస్తున్నాయని ఆక్స్‌ఫాం రిపోర్ట్ వెల్లడించింది. కరువు కాటకాలతో నీళ్లకు ఇబ్బంది రావడం, కిలోమీటర్ల కొద్దీ మహిళలు నడుచుకుంటూ వెళ్లి మోసుకురావడం వల్ల బర్డెన్ పడుతోందని పేర్కొంది. ఇకపై అది మరింత పెరిగే ముప్పుందని హెచ్చరించింది. మహిళల అన్‌పెయిడ్ పని విలువ దాదాపు రూ.7.67 కోట్ల కోట్లు (10.8 లక్షల కోట్ల డాలర్లు) ఉంటుందని అంచనా వేసింది. అది ప్రపంచంలోని టెక్నాలజీ ఇండస్ట్రీ కన్నా మూడు రెట్లు ఎక్కువని చెప్పింది. 42 శాతం మంది మహిళలు ఇంటి పనుల వల్ల ఉద్యోగం చేయలేకపోతున్నారని చెప్పింది. మగాళ్ల విషయంలో అది కేవలం 6 శాతం. అయితే, అన్ని మౌలిక వసతులుంటే మాత్రం ఆడవాళ్ల ఇంటి పని తగ్గుతుందని చెప్పింది. ఇండియాలో రోజూ అరగంట పాటు పని తగ్గుతోందని, 47 నిమిషాలు ఎక్కువ సేపు నిద్రపోతున్నారని పేర్కొంది.
డబ్బున్నోళ్లు పన్నులు కట్టేది తక్కువ
ప్రపంచంలోని డబ్బున్నోళ్లు పన్నులు తగ్గించుకునేందుకు ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నారని రిపోర్ట్ పేర్కొంది. అందుకోసం ట్యాక్స్ నిపుణులను నియమించుకుంటోందని వెల్లడించింది. అయితే, వివిధ దేశాల ప్రభుత్వాలు డబ్బున్నోళ్లకు పన్నులను మరో 0.5 శాతం పెంచినా వచ్చే పదేళ్లలో చదువు, ఆరోగ్యం, పెద్దల బాగోగులు తదితర రంగాల్లో 11.7 కోట్ల కేర్జాబ్స్ను సృష్టించొచ్చని పేర్కొంది.