స్వా తంత్ర్య పోరాటంలో పాల్గొన్న పార్టీయే కాదు 130 ఏండ్ల ఘన చరిత్ర ఉన్న పార్టీ కాంగ్రెస్. అప్పట్లో ఎలాంటి అధికారం లేకుండానే మహాత్మా గాంధీ అంత ప్రభావవంతులు ఇంకొకరు లేరనే చెప్పొచ్చు. ఆయన ప్రపంచానికే ఆదర్శం. నిజానికి మనదేశంలో ఆయన విగ్రహానికి దండేసి మరిచిపోతాం అంతే. కానీ ఇతర దేశాల్లో ఆయన ఆదర్శాలను గౌరవించే వాళ్లు ఎక్కువగా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు అలాంటి మహానుభావులున్న పార్టీ ఈనాడు తన మూలాలను వెతుక్కోవాల్సిన పరిస్థితిలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఎదిగే ప్రయత్నం చేస్తే మనం సంతోషించాలి. పార్టీకి దేశ భవిష్యత్ పట్ల ఎప్పుడైతే అవగాహన కొరవడిందో, ఎప్పుడైతే ఏక కుటుంబ పాలన, ఏక వ్యక్తి పాలనగా దశాబ్దాల తరబడి నడిపారో, ప్రజల ఆస్తిగా, ప్రజలందరికీ ఒక వేదికగా కాకుండా ఒక కుటుంబం ఆస్తిగా చేశారో అప్పటి నుంచే కాంగ్రెస్ ప్రజలకు దూరమవడం ప్రారంభమైంది. పార్టీ పెద్దలకు ఎప్పుడైతే దేశం గురించి గాక, వారి కుటుంబమే ప్రధానమన్న ఆలోచన ఉందన్నది ప్రజల మనుసుల్లో పడిందో కాంగ్రెస్పార్టీని ప్రజలు క్రమంగా వెనక్కి నెడుతూ వచ్చారు. ఇటీవల కాలంలో అది మరుగున పడిపోయిందా అన్నట్టు చేశారు. కానీ ఒక ప్రజాస్వామ్య సమాజంలో ఏ పార్టీ అయినా గుత్తాధిపత్యంగా ఉండటమనేది మంచిది కాదు. గతంలో కాంగ్రెస్ కావొచ్చు, ఇప్పుడు బీజేపీ కావొచ్చు.. మరే ఇతర పార్టీ అయినా కావొచ్చు. ప్రజాస్వామ్యంలో ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి.
స్పష్టమైన విధానాలు కావాలి
బీజేపీ కాంగ్రెస్ పై గట్టి, సహేతుకమైన విమర్శలు చేస్తున్నది. ‘మీది కుటుంబ పార్టీ, మా పార్టీ అలా కాదు, కార్యకర్తలు మా పార్టీలోకి వచ్చి స్వయంకృషితో పార్టీని బలోపేతం చేశారు. మేమంతా అలా వచ్చిన వాళ్లమే’ అని చెబుతున్నది. ఈ వాదనలు కొంతమేరకు వాస్తవమే. అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్నిచోట్ల నిజాయతీగా అంతర్గత ఎన్నికలు పెట్టాలి. ఇప్పుడు చేసినట్లుగానే సోనియా గాంధీ కుటుంబంలోంచి కాకుండా చిత్తశుద్ధి ఉన్న వాళ్లను ఎంపిక చేసి, ప్రతి స్థాయిలో నాయకత్వం ప్రజల నుంచి, ప్రజలు ఎన్నుకున్న వ్యక్తుల నుంచి వచ్చేలా ఏర్పాటు చేస్తే బీజేపీకి కాంగ్రెస్‌ను వారసత్వ పార్టీ అనే అవకాశం ఉండదు. పార్టీలు ఎప్పుడూ కూడా విధానాల్లో పోటీ పడాలి. ‘మీకంటే మేం బాగా అభివృద్ధి చేస్తున్నాం.. ఇంకా బాగా చేస్తాం’ అదీ రాజకీయమంటే. రాష్ర్ట స్థాయిలో కానీ, జాతీయ స్థాయిలో కానీ ఏ పార్టీ అయినా సరే ఇదే కోరుకోవాలి. కాబట్టి భారత్ జూడో కావొచ్చు, పార్టీ అంతర్గత విధి కావొచ్చు.. ఇలాంటివి ఆహ్వానించదగిన పరిణామాలే. భారత్ జూడో కావొచ్చు, పాదయాత్రలు కావొచ్చు.. అన్ని పార్టీలు పేర్లు మార్చుకొని వివిధ రకాలుగా తమ ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ దేశాన్ని గట్టెక్కించే చాతుర్యం వాటికి ఉన్నదా? బలమైన భావజాలముందా? హేతుబద్ధమైన విధానాలున్నాయా? అనేదే ప్రశ్న. ఈ దేశంలో చట్టబద్ధమైన పాలన అసలే లేదు. దాన్ని తప్పించుకోవడం కోసం విమర్శించడమే కానీ పార్టీల దగ్గరేమైనా స్పష్టమైన విధానాలున్నాయా? అంటే లేవు. మార్పులు చేస్తామని నాయకులు అసలే అనడం లేదు. వ్యవసాయం అధ్వానంగా ఉంది. వ్యవసాయ రంగంలో మంచి చట్టాలు తీసుకొస్తే వ్యతిరేకించారు. మరి వ్యవసాయ రంగాన్ని గట్టెక్కించడానికి, దీర్ఘకాలంలో రైతుల ఆదాయం పెంచడానికి, దేశాభివృద్ధిని పెంచడానికి మీ దగ్గరేమైనా మంత్రం ఉందా? ప్రజలముందు పెట్టాలి. అలాగే అధికార వికేంద్రీకరణ ఉంది. 73–74 సవరణ తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఉత్సవ విగ్రంహంలా మార్చింది. అందుకే ఆ ప్రభుత్వం నిర్వీర్యమైపోయింది.
ప్రజలకు భరోసా ఇవ్వాలి..
అందరికీ విద్య, ఆరోగ్యం అందాలి. బీదరికం పోవాలి. ఉపాధి అవకాశాలు, ఆదాయాలు పెరిగి ఆర్థికాభివృద్ధి జరగాలి. పెట్టుబడులు కావాలి. ఇవి సాధించడానికి మీ మార్గాలు చెప్పండి? లోతుగా అధ్యయనం చేయండి. ఈ దేశంలో ప్రజలు అన్నీ ప్రభుత్వం చేతుల్లో పెట్టి ఆర్థిక స్వేచ్ఛ లేకుండా చేసుకున్నారు. మార్కెట్లో పోటీ లేకుండా చేసి, ప్రభుత్వం ఉత్పత్తి చేయదు, కొరతలను సృష్టిస్తుంది. లైసెన్సులు లేనిదే ఉత్పత్తులు చేయనివ్వదు. ఏది కావాలన్నా కొరతే. అన్నిటికీ ఖరీదులు పెరుగుతాయి. బ్లాక్ మార్కెట్, లంచాలు, లైసెన్స్‌లు, పర్మిట్లు, ఆర్థిక వ్యూహం ఎప్పుడైతే దెబ్బతింటుందో దేశ ఆర్థిక విధానం అతలాకుతలం అవుతుంది.1991లో ఇదే కాంగ్రెస్ పార్టీ బుద్ధి తెచ్చుకొని ఆపద్ధర్మంగా, ఆలోచనతో కాదు తప్పనిసరి పరిస్థితుల్లో దేశం పూర్తిగా దివాళా తీసి, శ్రీలంకలా పతనానికి అంచున ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోనే పీవీ నరసింహరావు ఒక మార్గాన్ని చూపెట్టే ప్రయత్నం చేశారు. అలాంటివి చిత్తశుద్ధితో ఎప్పుడైనా చేయాలి. ఆ ప్రయత్నాలను మిగతా రంగాలకు విస్తరించాలి. ప్రభుత్వం తాను చేయాల్సిన పనులు సమర్థంగా నిర్వర్తించాలి. అలాకాకుండా వెనక్కు వెళ్లిపోయి దేశ ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక స్వేచ్ఛ, దేశంలోని ఉత్పత్తుల గురించి, ఉపాధి, ఆదాయాల గురించి పట్టించుకోకుండా మళ్లీ ప్రభుత్వ నియంత్రణ, అన్నీ ఉచితంగా ఇస్తామని ప్రజలను మభ్యపెడుతూ ఉంటే నిజమైన పాలన అందేదెప్పుడు? ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ అంతర్మథనం చేసుకోవాలి. దేశ భవిష్యత్తుకు మేమున్నామన్న భరోసా ఇవ్వగలగాలి. అప్పుడే పార్టీ బలోపేతమవుతుంది. ప్రజలకు సుపరిపాలన అందించగలుగుతుంది.
పోటీ లేకుంటే నియంతృత్వమే..
ఒక పార్టీ నచ్చకపోతే, ఆ పార్టీ ప్రభుత్వం పాలనలో అవినీతి ఎక్కువగా ఉంటే, విధానాల్లో స్పష్టత లేకపోతే, ఆర్థికాభివృద్ధికి సరైన బాటలు వేయలేకపోతే, బతుకుల్ని బాగుచేసే పరిస్థితులు కనిపించకపోవడం వంటివి ఎదురైనప్పుడు మరో పార్టీని ఎన్నుకునే ప్రత్యామ్నాయం ప్రజలకు ఉండాలి. అలా కాకుండా ఒకే పార్టీ ఎంత అధ్వానంగా పరిపాలిస్తున్నప్పటికీ వేరే ప్రత్యామ్నాయం లేక ముక్కు మూసుకొని ఓటు వేస్తే ప్రజాస్వామ్యం మూలన పడిపోతుంది. కాబట్టి కాంగ్రెస్ కావొచ్చు, మరే ఇతర పార్టీ అయినా కావొచ్చు. ప్రస్తుతం జాతీయ స్థాయిలో బీజేపీ అపారమైన ప్రభావాన్ని రాజకీయంగా చూపిస్తున్న మాట వాస్తవం. కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు, ప్రజలు వారిని ఆదరిస్తున్నారు. కొన్ని వాళ్లలో తప్పులు జరుగుతుంటే వాటిని వ్యతిరేకిస్తున్నారు. రాజకీయంలో రెండూ ఉంటాయి. కానీ అసలు ప్రత్యామ్నాయమే లేనప్పుడు అపరిమితమైన అధికారం నియంతృత్వానికీ, అవినీతికి దారి తీస్తుంది. దీటైన పోటీ ఉంటే ఏ పార్టీ అయినా ఒళ్లు దగ్గరపెట్టుకొని పనిచేస్తుంది. చేయకపోతే ప్రజలు తమను తిరస్కరించి, వేరొకరికి అధికారం కట్టబెడతారన్న భయంతో వారు క్రమశిక్షణతో, వినమ్రతతో, దేశభక్తితో పనిచేస్తారు. ఏ పోటీ లేదనుకున్నప్పుడు అహంకారంతో విచక్షణారహితంగా ప్రవర్తిస్తారు.
దేశ అవసరాలు గుర్తించాలి
ఆర్థికాభివృద్ధికి బీజేపీ కొన్ని ప్రయత్నాలు చేస్తున్నది. కొన్ని ఫలితాలను ఇస్తున్నాయి. ఇంకొన్ని అనుకున్నట్టు ఇవ్వకపోవచ్చు. ఇట్లా కాదు, ఈ రకంగా చేస్తే ఆర్థికాభివృద్ధి వస్తుంది, దీనికి మేం కట్టుబడి ఉన్నాం వంటి విధానాలు ఏమైనా కాంగ్రెస్పార్టీ దగ్గర ఉన్నాయా? ఈ దేశంలో, డబ్బు ఖర్చు పెట్టినా కూడా నాణ్యమైన విద్య అందక లక్షలాదిమంది కుటుంబాల పిల్లలు బీదలుగా మిగిలిపోతున్నారు. విద్యను బాగు చేసేందుకు మా దగ్గర ఈ మార్గం ఉంది, మంచి ఆరోగ్య విధానాలు ఉన్నాయి, స్పష్టమైన విధానాల పట్ల అవగాహన ఉంది అని చెప్పగలిగే స్థితిలో కాంగ్రెస్ ఉండాలి. ఇవేమీ కాకుండా అన్ని పార్టీలకు ఒకటే తారకమంత్రం రుణ మాఫీ. చత్తీస్గఢ్లో రుణ మాఫీ చేస్తామని అపడం ఓ విధానం ఎలా అవుతుంది? అది పాలన కిందకు ఎలా వస్తుంది? దేశాభివృద్ధికి ఎలా దోహదం చేస్తుంది? కచ్చితమైన మంచి చేస్తే మనం ఆహ్వానించొచ్చు. అంతకు మించి మనం కోరాల్సింది మీ విధానాలేంటి? ఈ దేశం గురించి మీకున్న అవగాహన ఏమిటి? ఎక్కడ పాలన బాగుంది, పొరపాట్లు ఎక్కడ జరుగుతున్నాయి? పొరపాట్లను మీరు ఎలా సరిదిద్దుతారు? ఏ రంగాల మీద ప్రత్యేక దృష్టి పెడతారు? అని ఆలోచించే ప్రజలు లేకుండా పోయారు. ఈ విధానం మారాలి.
- జయ ప్రకాశ్ నారాయణ్, వ్యవస్థాపక అధ్యక్షులు, లోక్సత్తా