ప్రధాని మోడీపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రమైన విమర్శలు చేశారు. దేశానికి చదువుకున్న వ్యక్తి ప్రధాని కావాలని అన్నారు. ఆప్ నేతలు సిసోడియాను జైలుకు పంపిన రోజే విద్య ప్రాధాన్యత తెలిసిన వ్యక్తి దేశానికి ప్రధాని కావాల్సిన అవసరం ఉందని తాను భావించినట్టుగా కేజ్రీవాల్ తెలిపారు. ఈ ఏడాది చివరిలో మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ పర్యటించిన కేజ్రీవాల్ ఒక ర్యాలీలో మాట్లాడారు. మధ్యప్రదేశ్‌లో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్, విద్య, వైద్య సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్, బీజేపీకి మధ్యప్రదేశ్ ప్రజలు చాలాసార్లు అవకాశాలిచ్చారని, ఆప్ కు ఒకసారి అవకాశం ఇవ్వాలని కేజ్రీవాల్ కోరారు. ఢిల్లీ, పంజాబ్‌లలో లాగా ప్రజలకు ఉచిత విద్యుత్, విద్య, ఆరోగ్య సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ప్రజలకు న్యాయం చేయని పక్షంలో తాను మళ్లీ జనం ముందుకు రానని స్పష్టం చేశారు.
కరోనా టైమ్ లో వైరస్ ను తరిమికొట్టేందుకు ప్లేట్లు వాయించాలని ప్రజలను మోడీ కోరారు. దీనివలన కరోనా పోయిందా అని ప్రశ్నించారు. అందుకే ప్రధాని అయిన వ్యక్తి బాగా చదువుకుని ఉండాలనేది తన అభిప్రాయమని చెప్పారు. దేశ రాజధానిలో విద్య, ఆరోగ్య రంగాలలో వినూత్న మార్పులు చేసిన సిసోడియా, సత్యేంద్ర జైన్ అరెస్టు చేశారని ప్రధానిని విమర్శించారు. విపక్షంలో ఉంటే అవినీతి చేయరాదని, అధికారంలో ఉంటే ఆ పని చేయవచ్చని బీజేపీ సిద్ధాంతంగా ఉందని ఆరోపించారు.