
దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్‌ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్‌ఎంఎస్ కోర్సుల్లో అడ్మిషన్స్ కోసం నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) యూజీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షను ఇంగ్లీష్, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో పెన్ అండ్ పేపర్ విధానంలో మే 7న నిర్వహించను న్నారు. ఈ నేపథ్యంలో ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్, ప్రిపరేషన్ విధానం తెలుసుకుందాం..
ఎంబీబీఎస్, బీడీఎస్.. ఇంటర్ బైపీసీ చదువుతున్న లక్షల మంది విద్యార్థుల డ్రీమ్. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో చేరాలని, డాక్టర్‌గా స్థిరపడాలని కలలు కనే వారి సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. అలాంటి విద్యార్థులంతా తమ స్వప్నం సాకారం చేసుకునేందుకు నీట్ ఎంట్రన్స్ మంచి అవకాశం. ఈ ఎంట్రన్స్‌లో స్కోర్‌తోనే ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ వంటి వైద్య కోర్సుల్లో ప్రవేశం లభిస్తోంది.
లక్షల్లో పోటీ
నీట్‌కు జాతీయ స్థాయిలో లక్షల సంఖ్యలో విద్యార్థులు హాజరవుతారు. గతేడాది 17,64,571 మంది పరీక్ష రాశారు. జాతీయ స్థాయిలో అందుబాటులో ఉన్న దాదాపు 96 వేల ఎంబీబీఎస్, 28 వేల వరకు బీడీఎస్, 52 వేలకు పైగా ఆయుష్ కోర్సుల సీట్లకు పోటీ తీవ్రంగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి 65,305 మంది; తెలంగాణ నుంచి 59,296 మంది గతేడాది ఈ పరీక్షకు హాజరయ్యారు. తెలంగాణలో 6,690, ఆంధ్రప్రదేశ్‌లో 5,485 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఏపీలో 1400, తెలంగాణలో 1300 బీడీఎస్ సీట్లు ఉన్నాయి. ఈ సీట్లను నీట్ యూజీ స్కోర్ ఆధారంగా ఆల్ ఇండియా కోటా, స్టేట్ కోటా విధానంలో భర్తీ చేస్తారు. అన్ని రాష్ట్రాల్లోని 15 శాతం సీట్లకు జాతీయ స్థాయిలో కౌన్సెలింగ్ నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తారు. స్టేట్ కోటా విధానంలో..రాష్ట్ర స్థాయిలో ఆల్ ఇండియా కోటాకు బదిలీ అయిన సీట్లను మినహాయించి.. మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.
ఎగ్జామ్ ప్యాటర్న్
నీట్ పరీక్ష నాలుగు సబ్జెక్ట్‌లలో 720 మార్కులకు నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. పరీక్షకు మూడు గంటల సమయం ఇస్తారు.
టార్గెట్ ..140 మార్కులు
ప్రతి సబ్జెక్ట్‌లో 180 మార్కులకు140 మార్కులు సాధించేలా అభ్యర్థులు ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే మెరుగైన ర్యాంకుతో సీటు వస్తుంది. సిలబస్‌కు అనుగుణంగా ఆయా సబ్జెక్ట్‌లకు సమయం కేటాయిస్తూ ప్రిపరేషన్ చేయాలి. వీలైనంత సమయం రివిజన్‌కు కేటాయించాలి. చదవాల్సిన టాపిక్స్‌ను ముందుగానే విభజించుకుని దానికి అనుగుణంగా ప్రాక్టీస్ చేయాలి. మాక్ టెస్టులకు హాజరవుతూ, మోడల్ పేపర్స్ సాధన చేయాలి. ప్రిపరేషన్ సమయంలోనే షార్ట్ నోట్స్ రాసుకుంటే రివిజన్ ఈజీగా ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్‌లోనూ సెక్షన్-బిలోని 15 ప్రశ్నలకు గాను పదింటికి సమాధానాలు గుర్తిస్తే సరిపోతుంది. అంటే..సెక్షన్-బిలో ఛాయిస్ ఉంటుంది. ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కులు కేటాయిస్తారు. నెగెటివ్ మార్కింగ్ ఉంది.
సిలబస్ ఎనాలసిస్
* ఫిజిక్స్‌లో విద్యార్థులు ప్రాక్టీస్‌కు ప్రాధాన్యమివ్వాలి. ఆప్టిక్స్, మెకానిక్స్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, మోడరన్ ఫిజిక్స్ చాప్టర్లపై ఫోకస్ చేయాలి. రొటేషనల్ డైనమిక్స్, సిగ్మా పార్టికల్స్‌పై ఎక్కువగా దృష్టిపెట్టాలి. ఎలక్ట్రోమ్యాగ్నటిజం, ఇండక్షన్, కరెంట్ ఎలక్ట్రిసిటీ వంటి చాప్టర్లను చదవడంతోపాటు ప్రాక్టీస్‌పై ఫోకస్ చేయాలి.
* కెమిస్ట్రీలో విద్యార్థులు జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, మోల్ కాన్సెప్ట్, కెమికల్ బాండింగ్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కోఆర్డినేషన్ కాంపౌండ్, ఈక్విలిబ్రియమ్, పాలిమర్‌లు, బయో మాలిక్యూల్స్, పరమాణు నిర్మాణం, సాలిడ్ స్టేట్, ద్రావణాలు, సర్ఫేజ్ కెమిస్ట్రీ; ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఐసోమెరిసమ్, సమ్మేళనాల తయారీలకు కొంత వెయిటేజీ ఎక్కువగా ఉంటుంది. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో వివిధ మూలకాలు, వాటి సమ్మేళనాల ధర్మాలను అధ్యయనం చేయాలి. ఫిజికల్, ఆర్గానిక్, ఇనార్గానిక్ కెమిస్ట్రీలను వాటి వాటి స్వభావాల ఆధారంగా ప్రిపేరవ్వాలి.
* బోటనీలో ఫిజియాలజీ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, మార్ఫాలజీ, జెనిటిక్స్ అండ్ ఎవల్యూషన్, సెల్ బయాలజీ, బయోటెక్నాలజీ, హ్యూమన్ ఫిజియాలజీ, డైవర్సిటీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్‌లను ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఎకాలజీ, బయోడైవర్సిటీ, ఎన్విరాన్‌మెంట్ ఇష్యూస్ టాపిక్స్‌పై ఫోకస్ చేయాలి. ప్లాంట్ ఫిజియాలజీలో ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్, మొక్కల హార్మోనులు, ట్రాన్స్‌పోర్ట్ ఇన్ ప్లాంట్స్, మినరల్ న్యూట్రిషన్ చాప్టర్లను ప్రిపేరవ్వాలి. సెల్ స్ట్రక్చర్స్ అండ్ ఫంక్షన్స్‌లో కణవిభజన(సమ విభజన, క్షయకరణ విభజన)లోని వివిధ దశల్లో జరిగే మార్పులు, కణచక్రం తదితరాలను అధ్యయనం చేయాలి. బయోమాలిక్యూల్స్ నుంచి కంటెంట్ సంబంధిత ప్రశ్నలు వస్తాయి. రీప్రొడక్షన్ నుంచి దాదాపు 10 ప్రశ్నల వరకు అడుగుతున్నారు. మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్‌హెరిటన్స్‌లో రెప్లికేషన్, ట్రాన్‌స్క్రిప్షన్, ట్రాన్స్‌లేషన్, రెగ్యులేషన్‌పై దృష్టిపెట్టాలి.
* జువాలజీ సబ్జెక్ట్‌లో రాణించేందుకు విద్యార్థులు హ్యూమన్ ఫిజియాలజీ, ఎకాలజీ, జెనిటిక్స్, ఎవల్యూషన్ టాపిక్స్‌పై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ప్రీవియస్ పేపర్స్, మాక్ టెస్టుల ప్రాక్టీస్‌తో మెరుగైన ర్యాంక్ సాధించవచ్చు.
నోటిఫికేషన్
అర్హత : ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ/ బయోటెక్నాలజీతో సైన్స్‌లో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు17 ఏళ్లు నిండాలి.
అప్లికేషన్స్ : అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో ఏప్రిల్ 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఫీజు : జనరల్ కేటగిరీ అభ్యర్థులకు రూ.1700 కాగా, జనరల్ ఈడబ్ల్యూఎస్/ఓబీసీ-ఎన్‌సీఎల్ అభ్యర్థులకు రూ.1600, ఎస్సీ, ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ థర్డ్ జండర్ అభ్యర్థులకు రూ.100 చొప్పున చెల్లించాలి. ఇతర దేశాలకు చెందిన అభ్యర్థులైతే దరఖాస్తు రుసుం రూ.9500లుగా నిర్ణయించారు. పరీక్ష మే 7న మధ్యాహ్నం 2గంటల నుంచి 5.20 గంటల మధ్య నిర్వహిస్తారు.
- వెలుగు ఎడ్యుకేషన్ డెస్క్