ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం నగరంలోని కవిరాజ్ నగర్ కు చెందిన వ్యాపారిని ఈ నెల 1న కొణిజర్ల మండలం పల్లిపాడు విలేజ్ కు చెందిన కూలీ పని చేసుకునే దంపతులు రాయల వెంకటేశ్వర్లు, శ్రీలత నకిలీ పిస్టల్‌తో బెదిరించినట్లు హవేలి సీఐ భానుప్రకాష్ తెలిపారు. ఇంట్లోకి చొరబడి నక్సలైట్లమని చెప్పి లక్ష రూపాయలు ఇవ్వకపోతే చంపుతామని బెదిరించి, రూ.5 వేలు తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.
వ్యాపారి ఫిర్యాదు మేరకు టౌన్ ఏసీపీ రమణమూర్తి ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. మంగళవారం శ్రీశ్రీ సర్కిల్ లో వెహికల్ చెకింగ్‌లో అనుమానాస్పదంగా కనిపించిన వీరిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ చెప్పారు. టైలరింగ్, కూరగాయల వ్యాపారం చేస్తున్న వీరు సులువుగా డబ్బు సంపాదించాలని నకిలీ పిస్టల్‌తో బెదిరించినట్లు పేర్కొన్నారు. వీరిపై ఇప్పటికే 12 కేసులు ఉన్నట్లు సీఐ తెలిపారు. నిందితుల నుంచి రూ. 3 వేల నగదు, బొమ్మ పిస్టల్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.