భార్యకు క్యాన్సర్.. ఒంటరిగా ఉండలేనని భర్త .. నిద్ర గోలీలు వేసుకొని దంపతుల సూసైడ్

భార్యకు క్యాన్సర్.. ఒంటరిగా ఉండలేనని భర్త .. నిద్ర  గోలీలు వేసుకొని దంపతుల సూసైడ్
  • ఉప్పల్ పీఎస్​ పరిధిలో ఘటన
  • ఇంటి నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు
  • తలుపులు పగలగొట్టి చూడగా, అప్పటికే మృతి

ఉప్పల్, వెలుగు: కొడుకు దూరంగా ఉంటున్నా.. ధైర్యంగా ఒంటరిగా జీవిస్తున్న ఆ దంపతులను మాయదారి రోగం కబళించింది. క్యాన్సర్ నిర్ధారణ కావడంతో ఇక తాను బతకలేనని భార్య.. భార్య లేకుండా ఉండలేనని భర్త.. స్లీపింగ్ టాబ్లెట్లు వేసుకొని సూసైడ్ చేసుకున్నారు. ఉప్పల్ ఎస్సై మాధవరెడ్డి వివరాల ప్రకారం.. ఉప్పల్ సాయిరాం నగర్ కాలనీకి చెందిన దుర్వాసుల సూర్యనారాయణ శాస్త్రి, (60), జగదీశ్వరి (56) దంపతులు. సూర్యనారాయణ శాస్త్రి ఎన్టీపీసీలో ఉద్యోగం చేసి రిటైర్డ్ అవ్వగా, వీరి కొడుకు సుశాంత్ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ గచ్చిబౌలిలో నివాసం ఉంటున్నాడు. ఇటీవల జగదీశ్వరి అనారోగ్యానికి గురికావడంతో సూర్యనారాయణ హాస్పిటల్​కు తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. క్యాన్సర్ అని తేలడంతో వృద్ధ దంపతులు ఎంతో మనోవేదనకు గురయ్యారు. 

క్యాన్సర్​తో తన భార్య చనిపోతే తాను ఒంటరిగా ఉండలేనని భర్త నిర్ణయించుకున్నాడు. దీంతో ఇద్దరు కలిసి రెండు రోజుల క్రితం స్లీపింగ్ టాబ్లెట్లు వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు బుధవారం ఉప్పల్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న వారు తలుపులు పగలగొట్టి చూడగా, దంపతులిద్దరు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. తమ ఆత్మహత్యకు అనారోగ్య సమస్యలే కారణమని సూసైడ్ ​నోట్ రాసి పెట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఉప్పల్ ఎస్సై తెలిపారు.