బషీర్ బాగ్, వెలుగు: ఫారెన్ వెళ్లేందుకు వీసాలు ఇప్పిస్తామంటూ పలువురిని దంపతులు మోసం చేశారు. నారాయణగూడ ఎస్ఐ షఫీ తెలిపిన ప్రకారం... శేరిలింగంపల్లికి చెందిన సీహెచ్ సురేష్ , హరిత దంపతులు ఫేస్ బుక్ లో కెరీర్ సొల్యూషన్స్ సంస్థ హెచ్1బి వీసా ఇప్పిస్తామనే ప్రకటన చూశారు. సంస్థను సంప్రదించగా హిమాయత్ నగర్ లోని ఆఫీసుకు రావాలని సూచించారు. అక్కడికి వెళ్లాక సంస్థ ఎండీ ప్రశాంత్ శర్మ, చైర్మన్ శిల్పా దేశ్ పాండే దంపతులు హెచ్1బి వీసా ఇప్పించాలంటే రూ. 7 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పగా డబ్బులు చెల్లించారు.
ఇచ్చిన గడువు ముగిసినా వీసా ఇంకా పెండింగ్ లో ఉందని నమ్మించారు. తమ డబ్బు తిరిగి ఇవ్వాలని నిలదీయగా.. ఇస్తామని హామీ ఇచ్చి ఆ తర్వాత నుంచి స్పందించడంలేదు. దీంతో సీహెచ్ సురేశ్ గత నెల 22న నారాయణగూడ పోలీసులకు కంప్లయింట్ చేయగా.. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేయగా పలువురి వద్ద రూ. 78 లక్షలు వసూలు చేసినట్లు తేలింది. దీంతో కెరీర్ సొల్యూషన్స్ సంస్థ ఎండీ ప్రశాంత్ శర్మను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అతని భార్య సంస్థ చైర్మన్ శిల్పా దేశ్ పాండే పరారీలో ఉన్నట్లు ఎస్ఐ షరీఫ్ తెలిపారు.