
హైదరాబాద్, వెలుగు:
‘సంసారం ఒక చదరంగం’ అన్నాడో పెద్దాయన. ‘సంసారం ఒక సాగరం’ అన్నారు ఇంకెవరో. పెండ్లి చేసుకున్నాక ఫన్ ఉంటది.. ఫ్రస్ర్టేషన్ కూడా ఉంటది. భార్యభర్తలు అన్నాక గొడవలు వస్తాయి. అభిప్రాయ భేదాలు, వాదులాటలు మామూలే. ‘పాము చావకుండా, కర్ర విరక్కుండా’ పరిస్థితి చక్కబెట్టుకోవాలె. కష్టమొస్తే అండగా నిలవాలె. కోపమొస్తే సముదాయించాలె. అలిగితే బుజ్జగించాలె. సంతోషాన్ని పంచుకోవాలె. గొడవ మొదలైతే వెనక్కి తగ్గాలె. కొన్ని కొన్ని సార్లు సర్దుకుపోవాలె. కానీ జనరేషన్ మారిపోయింది. ఇప్పటి యువత గొడవ పెట్టుకునేందుకు, దూరంగా ఉండేందుకు, విడిపోయేందుకు కారణాలు వెతుక్కుంటోంది. ఇగో కావచ్చు.. అడ్జస్ట్ కాలేనితనం కావొచ్చు. ఇంకేదైనా కారణం కావచ్చు. పెళ్లిళ్లు పెటాకులవుతున్నాయి. మూణ్నాళ్ల ముచ్చటగా మారిపోతున్నాయి. కొత్తగా పెళ్లయిన జంటలు చిన్న చిన్న సమస్యలకే కౌన్సిలింగ్ కోసం సైకియాట్రిస్టుల చుట్టూ తిరుగుతున్నాయి. తమ వద్దకు రోజూ వస్తున్న కేసుల్లో 20 నుంచి 30% దంపతులవే ఉంటున్నాయని సైకియాట్రిస్టులు చెబుతున్నారు. కొన్ని చోట్ల ఈ సంఖ్య మరింత ఎక్కువగా
ఉంటోందని అంటున్నారు.
పేరెంటింగ్ ప్రాబ్లమ్ వల్లే
తమ వద్దకు వచ్చే కేసులను బట్టి సైకియాట్రిస్టులు ఏం చెబుతున్నారంటే.. ‘అధిక శాతం పేరెంట్స్ టీనేజ్‌లో పిల్లలకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నారు. చదువు తప్ప మరో పని చెప్పడం లేదు. స్కూలింగ్ పూర్తయిన వెంటనే రెసిడెన్షియల్ కాలేజీలకు వెళ్లడంతో తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ మరింత స్వేచ్ఛగా పెరుగుతున్నారు. ఇలా పెరిగిన అమ్మాయిల్లో చాలా మంది పెండ్లి తర్వాత అత్తమామలు, భర్తతో అడ్జస్ట్ కాలేకపోతున్నారు. చిన్న పని చెప్పినా విసుక్కోవడం, కొన్ని రోజులకు నేనెందుకు చేయాలని ప్రశ్నించడంతో గొడవలు స్టార్ట్ అవుతున్నాయి. ఈ గొడవల ఒత్తిడి తట్టుకోలేక చివరకు ఆత్మహత్యల వరకు వెళ్తున్నారు. భర్తగా తన మాటే నెగ్గాలన్న అహం అబ్బాయిల్లో ఎక్కువవుతోంది. ఈ ధోరణిని అమ్మాయిలు సహించడం లేదు. దీంతో ఇద్దరి మధ్య తగువులు” అని వివరిస్తున్నారు. చిన్నప్పట్నుంచే పిల్లలకు అడ్జస్ట్ అవడం నేర్పించాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
సమయమే సమస్య
ప్రస్తుత బిజీ లైఫ్‌లో చాలామంది భాగస్వామికి సమయం కేటాయించలేకపోతున్నారు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా భాగస్వామితో కాసేపు సరదాగా మాట్లాడుకోకుండా, మొబైల్ చూస్తూ సోషల్ మీడియాలో గడిపేస్తున్నారు. చాలా వరకూ ఫ్యామిలీకి దూరంగా వేరు కాపురం ఉంటున్న జంటలే కావడం, రోజూ ఇంట్లో ఒక్కరే గడపాల్సి వస్తుండటంతో అమ్మాయిలు లోన్లీగా ఫీలవుతున్నారు. ఈ సమస్యను అబ్బాయిలు అర్థం చేసుకోకపోవడంతో, ఇద్దరి మధ్య గొడవలు పెరుగుతున్నాయి. వారంలో దొరికే ఆ ఒక్కరోజు సెలవును ఇంట్లో హాయిగా గడుపుదామనుకునే భర్త… ఆ ఒక్కరోజైనా తనను సరదాగా బయటకు తీసుకెళ్లాలని కోరే భార్య.. ఈ తేడాతో లొల్లి మొదలవుతోందని సైకియాట్రిస్ట్, డాక్టర్ ఉషారాణి తెలిపారు. వీకెండ్ అంటే బయటికెళ్లడం సహజమేనని, కానీ దాన్నే కంపల్సరీగా భావిస్తుండటంతో పరిస్థితి గొడవలకు దారి తీస్తోందని ఆమె వివరించారు. రోజూ కనీసం ఓ గంటైనా భాగస్వామి కోసం సమయం కేటాయించాలని, దాపరికాలు లేకుండా మాట్లాడుకోవాలని సైకాలజిస్టులు సూచిస్తున్నారు.
పోలికలు వద్దు
‘పక్కింటాయన కారు కొన్నాడు.. మా ఫ్రెండ్ వాళ్లు ఫారిన్ ట్రిప్పుకెళ్లారు’ అంటూ భర్తను ఇతరులతో కంపేర్ చేయడం కూడా దంపతుల మధ్య గొడవలకు కారణమవుతోందని సైకాలజిస్టులు చెబుతున్నారు. ఆర్థిక అసమానతలను అర్థం చేసుకోకుండా, అమ్మాయిలు ఇతరులతో కంపేర్ చేయడం.. సర్ది చెప్పకుండా అబ్బాయిలు గొడవకు దిగే ధోరణి వల్ల చాలా జంటలు సంసారాన్ని పాడు చేసుకుంటున్నాయి. ‘మా ఫ్రెండ్‌కు వాళ్ల అత్తమామ కారు కొనిచ్చారు. తను జాబ్ చేస్తోంది’ అంటూ దెప్పిపొడిచే అబ్బాయిలు లేకపోలేదు. ఇలా ఒకరినొకరు ఇతరులతో కంపేర్ చేసుకోవడం మంచిది కాదని డాక్టర్లు సూచిస్తున్నారు. ఒకవేళ కంపేర్ చేసినా, తమ ఆర్థిక పరిస్థితిని అర్థమయ్యేలా భాగస్వామికి వివరించాలని వారు చెబుతున్నారు. గొడవలు పడటం వల్ల సమస్య పరిష్కారం కాదని సూచిస్తున్నారు.
పేరెంట్స్.. ఆవేశం వద్దు
అమ్మాయో, అబ్బాయో తమ భాగస్వామి గురించి నెగెటివ్‌గా చెప్పగానే.. విషయం పూర్తిగా తెలుసుకోకుండా తల్లిదండ్రులు ఇన్వాల్వ్ అవుతున్నారు. ఎందుకిలా చేస్తున్నావు అంటూ ప్రశ్నించడంతో ఆ గొడవ మరింత ముదురుతోంది. విడాకుల వరకు వెళ్తున్న కేసుల్లో.. ఫ్యామిలీ మెంబర్స్ సరిగా స్పందించకపోవడం కూడా కారణమేనని డాక్టర్ అజయ్‌కుమార్ అన్నారు. గొడవకు కారణం తెలుసుకుని సర్ది చెప్పాలని, అంతేకానీ అవతలి వ్యక్తిని ప్రశ్నించొద్దని, దాని వల్ల సమస్యకు పరిష్కారం దొరకదని వివరించారు. తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్న జంటలు విడిపోవడానికి, సర్దిచెప్పే వారు లేకపోవడమే కారణమని చెప్పారు.
ప్రతిదీ నన్నే అడుగుతడు
‘తనను అమ్మలా చూసుకుంటున్నా. ప్రతిదీ తను చెప్పినట్టే చేస్తున్నా. అయినా డైవోర్స్ కావాలంటోంది’ అంటూ సైకియాట్రిస్ట్‌ను ఆశ్రయించాడు ఓ కుర్రాడు. ఇద్దరినీ కౌన్సిలింగ్‌కు పిలిచారు డాక్టర్. ‘అవును. తను నన్ను బాగానే చూసుకుంటున్నాడు. నేను చెప్పినట్టే చేస్తున్నాడు. అదే సమస్య. మార్కెట్‌కి వెళ్లి ఏం కూరగాయలు కొనాలి? షాపింగ్‌కు వెళ్లి ఏ కలర్ షర్ట్ తీసుకోవాలి? అంటూ ప్రతిదీ నన్నే అడుగుతాడు. సొంతగా ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేని వాడు భవిష్యత్‌లో పిల్లలను, సంసారాన్ని ఎలా లీడ్ చేస్తాడు? అందుకే నాకు డైవోర్స్ కావాలి’ అని చెప్పింది అతడి భార్య.
నిద్రపోనికీ టైమ్ ఉంటలేదు
‘ప్రతి ఆదివారం ఆయన మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు తీసుకొస్తడు. నన్ను మాత్రం తీసుకపోడు’ భార్య ఫిర్యాదు. ‘నేనేమైనా ఎంటర్‌టైన్‌మెంట్ కోసం పోతున్ననా? మార్కెట్‌కు తనని తీసుకెళ్తే, పాపను కూడా తీసుకెళ్లాలి. దుమ్ము, పొల్యూషన్ వల్ల పాపకేమైనా అయితే?’ భర్త రుసరుసలు. ‘వారం రోజులు ఆఫీసు పనిలోనే ఉంటవ్.. వారానికి ఒక్క రోజు కూడా నాకోసం కేటాయించకపోతే, ఇక పెండ్లి, పిల్లలు ఎందుకు’ భార్య కన్నీళ్లు. ‘వీకెండ్ వస్తే పొద్దున్నే కూరగాయలు తేవాలి, మధ్యాహ్నం సినిమాకు తీసుకెళ్లాలి. సాయంత్రం హోటల్‌కు తీసుకెళ్లాలి.. వారంలో నాకు దొరికేది ఒకటే రోజు. కాసేపు మనసారా పడుకుందామన్నా టైమ్ ఉండదు’ భర్త ఆవేశం.
కండీషన్లు పెడ్తుండు
‘దేవుడికి పూజ ఎలా చేయాలో కూడా వాళ్ల అమ్మకో, అక్కకో ఫోన్ చేసి అడుగుతడు. పెద్ద వాళ్లు వచ్చినప్పుడు ఇలా బిహేవ్ చేయాలె, అలా బిహేవ్ చేయాలె అని చెప్తడు. భార్యగా నాకు ఎక్కువ ప్రియారిటీ ఇవ్వకుండా, కండీషన్లు పెడ్తున్నడు. అందుకే అతనితో నేను సంసారం చేయలేను విడాకులు కావాల్సిందే’ అని మరో అమ్మాయి చెబుతోంది.
వీకెండ్ గొడవ
ప్రతి వీకెండ్ తనను బయటికి తీసుకెళ్లాలంటుంది భార్య. బయటికెళ్లినప్పుడు సినిమాల్లో చూపినట్టు చేతులు పట్టుకోవడం, బైక్‌పైన వెళ్తుంటే వాటేసుకోవడం ఆమెకు సరదా. భర్తకు ఇలాంటివి ఇష్టముండదు. చూసే నలుగురు ఏమనుకుంటారోనని భయం. ప్రతి వీకెండూ బయటకు పోవుడేందంటాడు అతను. దీనిపై ఇద్దరికీ గొడవ. అమ్మాయి పుట్టింటికి అలిగి పోవడం.. అబ్బాయి డిస్టర్బ్ అవడం.. చివరకు ఇద్దరూ కలిసి సైకియాట్రిస్ట్‌ను ఆశ్రయించారు.
మల్లెపూల లొల్లి
ఇద్దరూ మస్త్ బిజీగా ఉండే ఉద్యోగులు. భర్త తనను మురిపెం చేస్తలేడని ఆమె ఫ్రస్ర్టేషన్. ‘ముచ్చటగా మూర మల్లెపూలు కూడా తేవడం లేదు. ఇక నాపై ప్రేమ ఎక్కడుంది’ అని ప్రశ్న. ‘తను రోజూ బయటికెళ్తది. నాకెంత సాలరీ వస్తదో తనకూ అంతే వస్తది. ఆ మల్లెపూలేవో తనే కొనుక్కోవచ్చుగా’ భర్త సమాధానం. ఈ గొడవ చినికి చినికి గాలి వానగా మారింది. చివరికి సైకియాట్రిస్ట్ దగ్గరికి కౌన్సెలింగ్‌కు వెళ్లారా దంపతులు.