వెడ్డింగ్ కార్డ్స్‌ను వెరైటీగా ఆధార్, ఏటీఎం, ఎకో ఫ్రెండ్లీ కార్డులుగా ప్రింట్ చేయడం చూసే ఉంటారు. మొన్నీమధ్య ఒక టీచర్ తన వెడ్డింగ్ కార్డ్‌ను క్వశ్చన్ పేపర్లా డిజైన్ చేయించాడు. ఈ జంట ఏమో ఇంకా వెరైటీగా తమ వెడ్డింగ్ కార్డ్‌ను రీసెర్చ్ థీమ్‌తో ప్రింట్ చేయించింది.
బంగ్లాదేశ్‌కి చెందిన ఓ జంట వెడ్డింగ్ కార్డ్‌ను రీసెర్చ్ థీమ్‌తో తయారుచేయించుకున్నారు. ఆ కార్డులో పెండ్లి కొడుకు, పెండ్లి కూతురి పేర్లు, ఊరు, పెండ్లి జరిగే చోటు.. వంటి వివరాలన్నీ అచ్చం రీసెర్చ్ పేపర్లో ఉన్నట్టే ఉంటాయి.
పెండ్లి కూతురి పేరు సంజన తబస్సుమ్ స్నేహ, పెండ్లి కొడుకు పేరు మహ్జిబ్ హుస్సేన్ ఇమాన్. పెండ్లి కొడుకు, కూతురి తల్లిదండ్రుల పేర్లు తెలుసుకోవాలంటే మాత్రం వాళ్ల పేర్ల మీద ఉన్న నెంబర్ల ఆధారంగా వాటికింద ఇచ్చిన వివరాలు చదవాలి. రీసెర్చ్ పేపర్లో మొదటి పేరా అబ్స్ట్రాక్ట్ అనే హెడ్డింగ్‌తో ఉంటుంది. అందులో రీసెర్చ్‌కు సంబంధించిన విషయం బ్రీఫ్‌గా ఉంటుంది. అలాగే వెడ్డింగ్ కార్డ్‌లో కూడా అబ్స్ట్రాక్ట్ పేరాలో పెండ్లి గురించి కొన్ని విషయాలు రాశారు.
ఇంట్రడక్షన్లో ఖురాన్‌లోని మాటలు, మెథడాలజీలతో సాయంకాలం అల్లా దీవెనలతో జరుగుతుందని రాశారు. లొకేషన్లో పెండ్లి జరిగే చోటు వివరాలతోపాటు మ్యాప్ కూడా ఇచ్చారు. అంతేకాదు.. ఢాకాలో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి త్వరగా బయల్దేరమనే రిక్వెస్ట్ కూడా అందులో పబ్లిష్ చేశారు. రీసెర్చ్ పేపర్లో టేబుల్స్ వేస్తుంటారు కదా. అలాగే ఇందులో కూడా ఒక టేబుల్ వేశారు. వెడ్డింగ్ ఈవెంట్‌కి సంబంధించిన టైమ్, డేట్, వెన్యూ వివరాలు ఉన్నాయి అందులో. ఆఖరున పెండ్లికి సపోర్ట్ చేసి, ఎంకరేజ్ చేసి వాళ్ల మీద ప్రేమను చూపిస్తున్నందుకు కృతజ్ఞతలు చెప్పారు. చివరిగా రిఫరెన్స్‌లో ఖురాన్‌లోని రెండు మాటల రిఫరెన్స్ నెంబర్లు ఇచ్చారు. మొత్తంమీద ఇది రీసెర్చ్ వెడ్డింగ్ కార్డ్ ఇన్విటేషన్ సారాంశం.
ఈ వెడ్డింగ్ కార్డ్‌ను ఎక్స్‌లో (ట్విటర్) పోస్ట్ చేయగా 33 లక్షల మంది చూశారు. 69 వేల మంది లైక్ చేశారు. ఇక కామెంట్లయితే బోలెడు. ‘ఇద్దరు రీసెర్చర్లు పెండ్లి చేసుకుంటున్నారని అర్థమైంది’ అని ఒకరు కామెంట్ చేస్తే, మరొకరు.. ‘గూగుల్ మ్యాప్స్ కోసం క్యూఆర్ కోడ్ ఇచ్చి ఉంటే ఈజీగా ఓపెన్ అయ్యేది కదా’ అంటూ కామెంట్ చేశారు.