
- ఒక్కొక్కరికి రూ.3,800 చార్జ్ అంటూ ఇన్విటేషన్
ఫ్లోరెన్స్(ఇటలీ): పెండ్లికి రాబోయే గెస్ట్‌లకు కాబోయే దంపతులు అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు. గ్రాండ్‌గా జరగబోయే తమ పెండ్లికి రావాలంటూ పంపిన ఇన్విటేషన్‌లోనే భోజనం ఖర్చు మీరే పెట్టుకోవాల్సి ఉంటుందని రాసి పంపారు. ఇది చూసి షాకయిన ఓ గెస్ట్.. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలియజేశాడు. ఇటలీలోని ఫ్లోరెన్స్‌లో జరిగే డెస్టినేషన్ వెడ్డింగ్‌కు రావాలంటూ తనకు ఆహ్వానం అందిందని ఆ గెస్ట్ పేర్కొన్నాడు.
భోజనం డబ్బులు మాత్రం రూ.3,800 చెల్లించాలని ఇన్విటేషన్లో ఉందని తెలిపాడు. తాను ఉంటున్న కెనడాలోని వాన్కోవర్ నుంచి ఆ పెండ్లికి ఫ్లైట్ లో వెళ్తే అయ్యే ఖర్చే తడిసిమోపెడవుతుందని, ఆపై భోజనానికి ఖర్చులు కూడా తానే భరించాలంటే ఎలా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
ఇదేం మర్యాద అంటూ అసహనాన్ని బయటపెట్టాడు. ఈ పోస్ట్ ను చూసిన నెటిజన్లు ‘టిఫిన్ బాక్స్ తీస్కొని పోతే ఖర్చు తప్పుతది’ అంటూ సెటైర్లు వేశారు. పెండ్లికి పోయి డిన్నర్ మాత్రం బయట హోటల్లో చేయాలంటూ మరికొందరు సలహా ఇచ్చారు.