- అప్పులే కారణమని అనుమానం
- నిర్మల్ జిల్లాలో ఘటన
సారంగాపూర్, వెలుగు : హాస్పిటల్‌కు వెళ్తున్నామని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన దంపతులు మార్గమధ్యలో ఓ చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. వీరి సూసైడ్‌కు అప్పులే కారణమని తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే... నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం చించోలి (బి) గ్రామానికి చెందిన భాస్కర్‌రెడ్డి (60) ఆర్టీసీలో కండక్టర్‌గా పనిచేసి ఇటీవల రిటైర్ అయ్యారు.
ముథోల్‌లోని కంటి హాస్పిటల్‌కు వెళ్తున్నామని ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పి గురువారం భార్య అనసూయ (56)తో కలిసి బయటకు వచ్చాడు. సాయంత్రమైనా తిరిగి రాకపోవడం, ఎంత వెదికినా వివరాలు తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం సారంగాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని ఎంక్వైరీ చేపట్టారు. ఇదిలా ఉండగా దిలావర్‌పూర్ మండలం కాల్వ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వెళ్లే మార్గంలో చెట్టుకు దంపతులు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
వారు వచ్చి వివరాలు సేకరించగా చించోలికి చెందిన భాస్కర్‌రెడ్డి, అనసూయగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే దంపతుల ఆత్మహత్యకు అప్పులే కారణమని, వీరు ఇటీవలే ఇల్లు కట్టుకున్నారని, దీంతో అప్పులు పెరిగిపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.