కారులో నిద్రిస్తున్న దంపతులపై దాడి బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు

కారులో నిద్రిస్తున్న దంపతులపై దాడి బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు
  •     నల్గొండ జిల్లా చిట్యాల శివారు జాతీయ రహదారిపై ఘటన 
  •     బాధితులు ఏపీకి చెందిన వారు..  

నార్కట్​పల్లి, వెలుగు : నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ శివారులోని జాతీయ రహదారి పక్కన కారు ఆపి నిద్రిస్తున్న దంపతులపై దాడి చేసిన దుండగులు బంగారం ఎత్తుకెళ్లారు. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం..ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మండలంలోని తోట్ల పాలెం గ్రామానికి చెందిన పంచాక్షరి సాఫ్ట్​వేర్​ ఇంజినీర్. ఇతడు హైదరాబాద్​లో ఉంటున్నాడు. శనివారం అమలాపురం నుంచి భార్య, రెండేండ్ల కొడుకు, చెల్లెలితో కలిసి కారులో హైదరాబాద్ బయలుదేరారు.

 నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి శివారులోకి చేరుకోగానే నిద్ర రావడంతో నేషనల్ హైవే -65 పక్కనున్న సర్వీస్ ​రోడ్డుపై కారు ఆపి పడుకున్నారు. తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో ఇద్దరు దుండగులు కారు అద్దాలను పగలగొట్టి పంచాక్షరితో పాటు ఆయన చెల్లెలిపై దాడి చేశారు. పంచాక్షరి భార్య దగ్గర రెండేండ్ల బాబు ఉండడంతో ఏమీ అనలేదు. దీంతో ఆమె హైవేపైకి పరిగెత్తి ఎన్ని వాహనాలను ఆపేందుకు ప్రయత్నించినా ఒక్కరూ ఆపలేదు. 

చివరకు ఒక బస్సు ఆపగా విషయం చెప్పి కాపాడాలని వేడుకుంది. అయినా ఎవరూ ధైర్యం చేసి కిందకు దిగలేదు. ఇది జరుగుతున్నంత సేపు కారులో బాధితులపైన దుండగులు దాడి చేస్తూనే ఉన్నారు. చివరకు ఐదు తులాల బంగారాన్ని దోచుకుని పారిపోయారు. తర్వాత కూరగాయల లోడ్​తో వెళ్తున్న వాహనాన్ని ఆపిన బాధితులు చౌటుప్పల్ పీఎస్​కు వెళ్లి ఫిర్యాదు చేశారు. 

పోలీసులు తమ పరిధి కాదని చెప్పడంతో మళ్లీ చిట్యాల పీఎస్​కు వచ్చి కంప్లయింట్​ చేశారు. పోలీసులు గాయపడిన వారిని కామినేని దవాఖానకు తరలించారు. ఎస్ పీ చందన దీప్తి, డీఎస్పీ శివరాం రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. పల్లెపు శృతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సైదాబాబా తెలిపారు.