
- 84 కోళ్లకు 16 లక్షల 65 వేలు
- వేలంలో పాల్గొన్న 73 మంది
- పది నిమిషాల్లో కట్టాలన్న రూల్‌తో డబ్బుల సంచులతో కోర్టుకు
గండిపేట, వెలుగు: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం తోలుకట్ట గ్రామ పరిధిలోని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి చెందినదిగా చెప్తున్న ఫాంహౌస్‌లో ఈ నెల 11న పట్టుకున్న పందెం కోళ్లకు సోమవారం రాజేంద్రనగర్ కోర్టు ఆవరణలో వేలం నిర్వహించారు. కోళ్లను దక్కించుకోవడానికి సుమారు 73 మంది వచ్చారు. మొత్తం 84 కోళ్లను తొమ్మిది రౌండ్లలో వేలం వేయగా.. రూ.16 లక్షల 65 వేలు ధర పలికాయి. సగటున ఒక్కో కోడి రూ.19 వేల 821 ధర పలికింది. వేలం పాట ముగిసిన పది నిమిషాల్లోనే డబ్బులు కట్టాలన్న నిబంధన ఉండడంతో అందరూ డబ్బుల సంచులు పట్టుకుని కోర్టుకు వచ్చారు.
ఏపీ నుంచి భారీగా వేలం..
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ కోర్టు జడ్జి సమక్షంలో కోళ్లను వేలం వేశారు. 16 మంది అడ్వకేట్లు, స్థానికులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి 57 మంది వచ్చి వేలంలో పాల్గొన్నారు. గతంలో ఒక్కో కోడి రూ.2 వేల నుంచి 3 వేలలోపే పోవడంతో ఈసారి దక్కుతాయేమోనని అడ్వకేట్లు భావించి వేలంలో పాల్గొన్నారు. అయితే, ఏపీ నుంచి వచ్చిన వారు తమకే కోళ్లు దక్కాలని
భారీగా వేలం పాట పాడారు. ఇందులో కొందరు మొయినాబాద్ఫాంహౌస్లో కోడి పందాలు నిర్వహించిన వారి బినామీలూ ఉన్నట్టు సమాచారం. అలాగే, మరికొందరు ఫాం హౌస్ యజమానులు, వ్యాపారవేత్తలు, స్థానిక రైతులు కూడా వేలంలో పాల్గొన్నారు.
పది కోళ్లు ఒక స్లాట్‌గా..
మొత్తం 84 కోళ్లలో 10 కోళ్లను ఒక స్లాట్ గా వేలం వేశారు. మొదటి10 కోళ్లకు సర్కార్ వారి పాట రూ.50 వేలతో మొదలుకాగా.. 2.5 లక్షలకు శ్రీనివాస్ దక్కించుకున్నాడు. రెండో స్లాట్ లో 10 కోళ్లను రూ.3 లక్షల 75 వేలకు పాడుకున్నారు. ఇలా చివరి రౌండ్లో 4 కోళ్లకు ఆక్షన్పెట్టగా రూ. లక్షా 42 వేలకు దక్కించుకున్నారు. ఇలా తొమ్మిది రౌండ్లలో 84 కోళ్లు.. రూ.16 లక్షల65 వేలు ధర పలికాయి. కాగా, తోలుకట్ట ఫాంహౌస్‌లో ఈ నెల 11న పోలీసులు రైడ్స్నిర్వహించి.. 84 పందెం కోళ్లు, రూ.30 లక్షల క్యాష్, 50 లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఏపీకి చెందిన నిర్వాహకుడు శివకుమార్, పందెం రాయుళ్లతో పాటు 64 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఫాంహౌస్బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి సంబంధించినది కావడంతో ఆయనకు పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణ కూడా జరిపారు.