- క్లయింట్లు, లాయర్లకు సౌలతులు
వనపర్తి, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం న్యాయ నిర్మాణ్ ప్లాన్ కింద రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 10+2 కోర్టు కాంప్లెక్సుల(ఫ్యామిలీ, పొక్సో కోర్టులు కలిపి) కోసం రూ.972 కోట్లు మంజూరుచేసింది. ఇందులో ఉమ్మడి మహూబ్‌నగర్ జిల్లాలోని వనపర్తి, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల, మహబూబ్‌నగర్ ఉన్నాయి. వనపర్తిలోని మెడికల్ కాలేజీ ఎదురుగా ఉన్న స్థలంలో 20 ఎకరాలను కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి ఇచ్చారు. ఒక్కో కోర్టు నిర్మాణానికి రూ.81 కోట్లు అవసరముండగా, కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40శాతం నిధులను సమకూరుస్తాయి.
తొలగనున్న ఇబ్బందులు..
వనపర్తిలో జిల్లా కోర్టు ఉండడంతో జిల్లాతో పాటు నాగర్‌కర్నూల్, గద్వాల జిల్లాల నుంచి క్లయింట్లు, లాయర్లు ఇక్కడికి వస్తుంటారు. కోర్టు హాళ్లు విశాలంగా లేకపోవడంతో ఇబ్బంది పడాల్సి వస్తోంది. కొత్త కోర్టు కాంప్లెక్స్ ఏర్పాటుతో హై కోర్టును తలపించేలా పలు కోర్టులు ఒకే చోట ఉండనున్నాయి. ప్రస్తుతం ఆర్ అండ్ బీ శాఖకు చెందిన భవనంలోనే ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి కోర్టు, పొక్సో కోర్టు కొనసాగుతోంది. ఇతర భవనాల్లో సీనియర్ సివిల్ కోర్టు, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, జూనియర్ సివిల్ జడ్జి కమ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు కొనసాగుతున్నాయి. కోర్టు కాంప్లెక్స్‌తో పాటు బార్ అసోసియేషన్ హాల్ సమకూరే అవకాశం ఉంది.
కొత్త కోర్టులు వస్తయ్..
కోర్టు కాంప్లెక్స్ ఏర్పాటుతో లేబర్ కోర్టు, కన్జుమర్ కోర్టు, ఎస్సీ,-ఎస్టీ కోర్టులూ రానున్నాయి. ప్రస్తుతం ఐదుగురు జడ్జిలు పని చేస్తున్నారు. భవిష్యత్‌లో న్యాయమూర్తుల సంఖ్య కూడా పెరగనుంది. కోర్టు కాంప్లెక్స్‌లోనే జడ్జీలకు క్వార్టర్లు ఏర్పాటు కానున్నాయి. ఫ్యామిలీ, పోక్సో కేసులు రెగ్యులర్‌గా నడుస్తాయి.
అందరికీ లాభమే..
న్యాయ నిర్మాణ్ ప్లాన్ కింద 10+2 కోర్టు కాంప్లెక్స్ వనపర్తికి రావడం హర్షణీయం. ఎన్నో ఏండ్లుగా చేస్తున్న కృషి ఇన్నాళ్లకు ఫలించనుంది. ఎమ్మెల్యే మేఘారెడ్డి చొరవ తీసుకోవడం అభినందనీయం. కాంప్లెక్స్ ఏర్పాటుతో అందరికీ లాభం కలగనుంది.
- మోహన్‌కుమార్‌యాదవ్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్