ముదురుతున్న కోర్టు కాంప్లెక్స్ స్థల వివాదం..రెండు వర్గాలుగా విడిపోయిన లాయర్లు

ముదురుతున్న కోర్టు కాంప్లెక్స్ స్థల వివాదం..రెండు వర్గాలుగా విడిపోయిన లాయర్లు
  • విధులు బహిష్కరించి నిరసన దీక్షలు

గద్వాల, వెలుగు : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్  కోర్ట్​ కాంప్లెక్స్  స్థలం విషయంలో వివాదం ముదురుతోంది. కోర్టు కాంప్లెక్స్  నిర్మాణం జరిగే స్థలం ఎక్కడో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. గద్వాల బార్  అసోసియేషన్ లోని లాయర్లు రెండు వర్గాలుగా విడిపోయి, ఎవరికి వారు తమకు నచ్చిన స్థలంలో కాంప్లెక్స్​ కట్టాలంటూ పట్టుబడుతూ ఆఫీసర్లపై ఒత్తిడి తెస్తున్నారు. గద్వాల టౌన్ లోనే ఇంటిగ్రేటెడ్  కోర్ట్  కాంప్లెక్స్  నిర్మాణాన్ని చేపట్టాలని డిమాండ్  చేస్తూ పది రోజులుగా విధులు బహిష్కరించిన లాయర్లు, రెండు రోజుల నుంచి రిలే నిరసన దీక్షలు ప్రారంభించారు.

కలెక్టర్  సంతోష్, అడిషనల్  కలెక్టర్  లక్ష్మీనారాయణ రెండు రోజుల కింద అనంతపురం గుట్టలో స్థలాన్ని పరిశీలించారు. అందరికీ ఆమోదయోగ్యమైన స్థలంలోనే కోర్టు కాంప్లెక్స్  నిర్మాణాన్ని చేపడతామని కలెక్టర్  చెప్పినప్పటికీ, వివాదానికి తెరపడడం లేదు. కలెక్టర్  వచ్చి వెళ్లాక, ఇరువర్గాల లాయర్లు తాము సూచించిన స్థలంలో కట్టాలంటే, తాము సూచించిన స్థలంలో కట్టాలంటూ పట్టుబడుతున్నారు. 

రెండు వర్గాలుగా లాయర్లు..

కోర్టు కాంప్లెక్స్  స్థలం విషయంలో గద్వాల బార్  అసోసియేషన్ లోని లాయర్లు రెండు వర్గాలుగా విడిపోయారు. ఒక వర్గం గద్వాల మండలం పూడూరు శివారులోని అనంతపురం గుట్టల్లో కట్టాలని పట్టుబడుతూ, వారికి అనుకూలంగా సోషల్  మీడియాలో పోస్టులు పెట్టుకొని ఆఫీసర్లకు వినతిపత్రాలు ఇస్తున్నారు. మరోపక్క మెజార్టీ లాయర్లు బార్  అసోసియేషన్  అధ్యక్ష, కార్యదర్శులు, సీనియర్  లాయర్ల ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్  కోర్టు కాంప్లెక్స్ బిల్డింగ్​ను పట్టణంలోని కలెక్టరేట్  సమీపంలో లేదంటే ప్రజలకు అనువైన స్థలంలో కట్టాలని డిమాండ్  చేస్తూ రిలే నిరసన దీక్షలు చేస్తున్నారు. వీరికి పట్టణంలోని పలు సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీ లీడర్లు మద్దతు ప్రకటిస్తున్నారు. 

అన్ని ఎకరాలు ఎందుకు?

ప్రభుత్వ స్థలాలను కొందరు ఆఫీసర్లు సొంత జాగీర్ లా చూడడం తగదని సీనియర్  లాయర్లు అంటున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా గద్వాల జిల్లాలో కలెక్టరేట్ కు 20 ఎకరాలు, ఎస్పీ ఆఫీసుకు 26 ఎకరాలు ఎందుకు తీసుకున్నారని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీనే 29 ఎకరాల్లో కట్టారని.. కానీ, గద్వాలలో మాత్రం రెండు ఆఫీసులకు 59 ఎకరాలు తీసుకోవడంపై సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు. కలెక్టరేట్ లో ఉన్న స్థలాన్ని ఇంటిగ్రేటెడ్  కోర్టు కాంప్లెక్స్  నిర్మించాలని సీనియర్ లాయర్లు డిమాండ్ చేస్తున్నారు.

మొండిపట్టు ఎందుకు?

గద్వాల ఇంటిగ్రేటెడ్  కోర్టు కాంప్లెక్స్  నిర్మాణం కోసం గతంలోనే అనంతపురం గుట్టల్లో 10 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ జీవో నంబర్ 597ను 14/11/2024న జారీ అయింది. అలాగే ఆర్సీ నంబర్  499ని 13/12/2024న జారీ చేశారు. అప్పుడు అనంతపురం గుట్టల్లో కోర్టు కాంప్లెక్స్  నిర్మాణం చేపట్టేందుకు అంగీకరించి, ఇప్పుడు వేరే చోటికి మార్చాలని మొండిపట్టు ఎందుకు పడుతున్నారని ఒక వర్గం లాయర్లు ప్రశ్నిస్తున్నారు.

ఇదిలాఉంటే పూడూరు శివారులోని అనంతపురం గుట్టల్లో సర్వే నంబర్ 368లో స్థలం కేటాయించారని.. కానీ, ప్రస్తుతం కలెక్టర్, అడిషనల్  కలెక్టర్, లాయర్లు పరిశీలించిన స్థలం ఆ సర్వే నంబర్ లో లేదని లాయర్లు చెబుతున్నారు. తమకే ఆఫీసర్లు తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోర్టు కాంప్లెక్స్​ స్థలం విషయంలో ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకొని పనులు ప్రారంభించి, ఈ వివాదానికి తెర దించాలని కోరుతున్నారు.