కోర్టు ఉత్తర్వులు ఎందుకు అమలు చేయలేదు?
ఐఐఐటీ వీసీ, రిజిస్ట్రార్లకు హైకోర్టు ధిక్కార నోటీసులు
హైదరాబాద్, వెలుగు : హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హైదరాబాద్ (ఐఐఐటీహెచ్) వీసీ, రిజిస్ట్రార్లకు కోర్టు ధిక్కారణ కింద నోటీసులు జారీ చేసింది. జులై 14న జరిగే విచారణకు స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ముంబైకి చెందిన ధైర్య ఓం ప్రకాశ్ ఝున్‌ఝున్‌వాలాకు 2020లో ఐఐఐటీ హైదరాబాద్‌లో బీటెక్ సీటు రావడంతో రూ.1,60,000 కట్టి కాలేజీలో చేరాడు. ఆ తర్వాత అతనికి ముంబై ఐఐటీలో సీటు రావడంతో అక్కడ చేరాడు. ఈ క్రమంలో తాను కట్టిన ఫీజులో రూ.1,59,000 తిరిగి ఇవ్వాలని పలుమార్లు ఐఐఐటీహెచ్‌ను కోరినా చెల్లించడం లేదని బాధితుడు హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. 2020 నుంచి 1,59,000 రూపాయలకు 12 శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని, కోర్టు ఖర్చుల కింద మరో రూ.10 వేలు అదనం ఇవ్వాలని ఈ ఏడాది ఏప్రిల్‌లో తీర్పు చెప్పింది. అయితే ఇప్పటికీ హైకోర్టు తీర్పు అమలు చేయకపోవడంతో ఓం ప్రకాశ్ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశాడు. దీనిని చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ సోమవారం విచారించింది. కోర్టు ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని ప్రతివాదులైన కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, ఐఐఐటీ వీసీ, రిజిస్ట్రార్లను ప్రశ్నించింది. అనంతరం విచారణను జులై 14కి వాయిదా వేసింది.
ALSO READ:గోవధ నిషేధ చట్టాలను కఠినంగా అమలు చేయాలి : విశ్వహిందూ పరిషత్