
ఆదిలాబాద్, వెలుగు: ఏసీబీ కేసులో ఓ అధికారిని పట్టించిన బాధితులే ఆ తర్వాత తప్పుడు సాక్ష్యం చెప్పడంతో ముగ్గురిపై కేసు నమోదు చేయాలని కరీంనగర్ మూడో జూనియర్ సివిల్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ విషయాన్ని ఆదిలాబాద్ ఏసీబీ డీఏస్పీ విజయ్ కుమార్ వివరించారు. ఇచ్చోడ ఎన్టీడీసీఎల్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ రేగుంట స్వామి 2010లో రూ.15 వేల లంచం తీసుకుంటూ పట్టుబ డ్డాడు. ఎలక్ట్రికల్ మీటర్ల కోసం కన్నమయ్య, నారాయణ, మల్లయ్య అనే వ్యక్తులు ఏడీఈని సంప్రదించగా ఆయన రూ.15 వేలు లంచం డిమాండ్ చేయడంతో వారు ఏసీబీని ఆశ్రయించారు.
దీంతో ఏసీబీ రైడ్ చేసి స్వామిని పట్టుకుంది. ఈ కేసు విషయంలో ముందుగా ఇచ్చిన సాక్ష్యం తాము చెప్పలేదని ఆ ముగ్గురు కోర్టులో మాటమార్చడంతో జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై దర్యాప్తు చేపట్టాలని జడ్జి ఆదేశించినట్లు డీఎస్పీ తెలిపారు. ఇన్ని రోజులుగా దర్యాప్తు జరుగుతుండగా గురువారం తప్పుడు సాక్ష్యం చెప్పినట్లు తేలడంతో ఆ ముగ్గురిపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.