- ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15న అరెస్ట్
- ఒకట్రెండు సార్లు కవితను కలిసిన కేటీఆర్
- ఈ నెల 6న బెయిల్ పిటిషన్లపై తుది తీర్పు
హైదరాబాద్, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. నెలన్నర రోజులుగా తీహార్ జైల్లోనే ఉంటున్నారు. సీబీఐ, ఈడీ తనను అక్రమంగా అరెస్టు చేశాయని, రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆమె కోర్టులో వేర్వేరుగా పిటిషన్ దాఖలు చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్‌గా పాల్గొనాల్సి ఉందని ఆమె తరఫు అడ్వకేట్లు కోర్టుకు వివరించారు. వాదనలు పూర్తి కావడంతో తీర్పు వెలువడాల్సి ఉన్నది. మార్చి 15న అరెస్ట్ అయిన కవిత.. 45 రోజులుగా తీహార్ జైల్లో ఉన్నారు. కాగా, కవితకు ఇటు ఈడీ, అటు సీబీఐ కేసుల నుంచి బెయిల్ దొరకడం లేదు.
ఈడీ అరెస్ట్ అక్రమమంటూ కవిత దాఖలు చేసిన తొలి బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ఆ కేసులో ఇప్పటి దాకా కవితకు బెయిల్ రాలేదు. తన కొడుకుకు ఇంటర్ ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్తూ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు దాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. ఏప్రిల్ 8న బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈడీ కస్టడీలో ఉండగానే అదే కేసులో సీబీఐ కూడా ఆమెను అరెస్ట్ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ ఆమె కోర్టు మెట్లెక్కినా ఊరట దక్కలేదు. తాజాగా సీబీఐ కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసినా తీర్పు వెలువడలేదు.
అరెస్ట్‌పై బీఆర్ఎస్ కేడర్ సైలెంట్
జైల్లో ఉన్న కవితను తండ్రి కేసీఆర్ ఇప్పటి దాకా కల్వలేదు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభలు, రోడ్‌షోల్లో ఆయన బిజీగా ఉన్నారు. తన బిడ్డ కడిగిన ముత్యంలా బయటికొస్తుందని మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక అన్న కేటీఆర్ మాత్రం ఒకట్రెండు సార్లు జైల్లో కవితను కలిశారు. అరెస్ట్ అయిన తర్వాత మార్చి 21న జైల్లో తొలిసారి కవితను కలిసిన కేటీఆర్.. ఆ తర్వాత బెయిల్ పిటిషన్ కోర్టు కొట్టేశాక మరోసారి ములాఖత్ అయ్యారు. సీబీఐ కస్టడీలో ఉన్నప్పుడు ఏప్రిల్ 14న కేటీఆర్, అనిల్ ఆమెను కలిశారు. ఆ తర్వాత ఎవరూ ఢిల్లీకి వెళ్లలేదు.
కాగా, కవిత అరెస్ట్‌పై బీఆర్ఎస్ కేడర్ కూడా సైలెంట్‌గా ఉన్నది. సీనియర్ నేతలు ఎవరూ ఆమె గురించి మాట్లాడటం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ కష్టాల్లో ఉందని, ఈ టైమ్‌లో లిక్కర్ కేసులో ఉన్న కవితకు అనుకూలంగా మాట్లాడితే అది లోక్‌సభ ఎన్నికల్లో నెగిటివ్ అవుతుందేమో అన్న ఆందోళన కొంత మంది లీడర్లలో ఉన్నట్టు తెలుస్తున్నది. కవిత అరెస్ట్ అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వ వైఖరిపై విరుచుకుపడిన ఆ పార్టీ నేతలు.. ఎంపీ ఎన్నికల క్యాంపెయిన్‌లో మాత్రం సైలెంట్ అయిపోయారు.
సీబీఐ కేసులో బెయిల్‌పై తుది తీర్పు వాయిదా
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్ సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పును రౌస్ అవెన్యూ కోర్టు (ట్రయల్ కోర్టు) ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసింది. గతనెల 22న విచారించిన కోర్టు తీర్పు మే 2కు రిజర్వ్ చేసింది. తర్వాత ఈడీ దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసులో మాత్రం బెయిల్ పిటిషన్‌పై తీర్పును మే 6వ తేదీన వెలువరిస్తామని ట్రయల్ కోర్టు వెల్లడించింది.
దీంతో సీబీఐ కేసులో గురువారం కవిత బెయిల్ పిటిషన్‌పై తుది తీర్పు వెలువడుతుందని భావించారు. అయితే ట్రయల్ కోర్టు ప్రారంభం కాగానే... తీర్పును వాయిదా వేస్తున్నట్లు స్పెషల్ జడ్జ్ కావేరి బవేజా వెల్లడించారు. ఈడీ కేసులో బెయిల్ పిటిషన్ తో కలిపి మే 6న తీర్పు వెలువరిస్తామని స్పష్టం చేశారు. కాగా, కవిత జ్యుడీషియల్ కస్టడీ ఈ నెల 7వ తేదీతో ముగియనుంది. కవితకు ట్రయల్ కోర్టు బెయిల్ తిరస్కరిస్తే.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని ఆమె తరఫు అడ్వకేట్లు భావిస్తున్నారు.