తిరువనంతపురం : కోవిడ్ 19 వ్యాక్సిన్ సర్టిఫికేట్పై ప్రధాని నరేంద్రమోడీ ఫొటోను తొలగించేలా ఆదేశించాలంటూ కోర్టును ఆశ్రయించిన పిటీషనర్ కు కేరళ హైకోర్టు షాక్ ఇచ్చింది. పిటీషన్ ను కొట్టి వేయడంతో పాటు లక్ష రూపాయల జరిమానా విధించింది. వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ పై ప్రధాని ఫొటోను ఉపయోగించడం వల్ల ఉపయోగంలేదంటూ పిటీషినర్ పీటర్ మైల్ పరంబిల్ అక్టోబర్ లో కేరళ హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం పిటీషన్లో ప్రజా ప్రయోజనమేమీలేదని పేర్కొంటూ దాన్ని కొట్టివేసింది. విచారణ సందర్భంగా హైకోర్టు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ అభ్యర్థన వెనుక రాజకీయ ఉద్దేశం దాగి ఉందని, ఇది ప్రజా ప్రయోజనం కోసం కాకుండా ప్రచారం కోసమేనని కోర్టు అభిప్రాయపడింది.
ఆయన దేశానికి ప్రధాని
'ప్రధానమంత్రిని కాంగ్రెస్ ప్రధాని అని గానీ, బీజేపీ ప్రధాని అని గానీ లేదా ఏ రాజకీయ పార్టీకి ప్రధాని అని గానూ ఎవరూ అనలేరు. రాజ్యాంగం ప్రకారం ఒకసారి ప్రధానిగా ఎన్నికైతే ఆయన దేశానికి ప్రధాన మంత్రి' అని పిటీషన్ ను విచారించిన జస్టిస్ పీవీ కున్హికృష్ణన్ స్పష్టం చేశారు. ప్రభుత్వ విధానాలు, ప్రధాని రాజకీయ వైఖరిపై విబేధించవచ్చే తప్ప పౌరుల్లో ధైర్యాన్ని పెంపొందించే సందేశంతో కూడిన వ్యాక్సిన్ సర్టిఫికేట్ పై ప్రధాని ఫోటో ఉండటం సిగ్గుపడాల్సిన విషయం కాదని అన్నారు. ప్రజా తీర్పుతోనే ఆయన ప్రధాని అయ్యారన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు.
పిటీషనర్కు లక్ష ఫైన్
కోర్టులో అనేక కేసులు పెండింగ్ లో ఉన్న సమయంలో ఇలాంటి పిటీషన్లను ప్రోత్సహించలేమని న్యాయమూర్తి స్పష్టం చేశారు. పిటీషనర్ రాజకీయ దురుద్దేశంతో పబ్లిసిటీ కోసమే ఇదంతా చేసినట్లు ఉందని అభిప్రాయపడ్డారు. కోర్టు సమయం వృథా చేసినందుకుగానూ న్యాయమూర్తి పిటీషనర్ కు లక్ష రూపాయల జరిమానా విధించారు. ఆరు వారాల్లోగా ఆ మొత్తాన్ని కేరళ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి డిపాజిట్ చేయాలని ఆదేశించారు. గడువులోగా సొమ్ము జమ చేయని పక్షంలో అతని ఆస్తులను విక్రయించి ఆ మొత్తాన్ని రికవర్ చేయాలని తేల్చి చెప్పారు.
For more news