ఇంజనీరింగ్ సీట్ల పెంపుపై కోర్టు తీర్పు అమలు చేయాల్సిందే:హైకోర్టు

ఇంజనీరింగ్ సీట్ల పెంపుపై కోర్టు తీర్పు అమలు చేయాల్సిందే:హైకోర్టు
  • లేదంటే కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవ్
  • రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు హెచ్చరిక 

హైదరాబాద్, వెలుగు: ప్రైవేట్‌‌ఇంజనీరింగ్‌‌ కాలేజీల్లో సీట్ల పెంపుపై గత ఉత్తర్వులను అమలు చేసి తీరాలని హైకోర్టు తేల్చి చెప్పింది. ఏఐసీటీఈ, జేఎన్టీయూ ఆమోదించిన మేరకు సీట్ల పెంపునకు అనుమతించాలని, ఆ సీట్ల భర్తీకి మాప్‌‌ అప్‌‌ కౌన్సెలింగ్‌‌ నిర్వహించాలని స్పష్టం చేసింది. ఈ నెల 21కల్లా కోర్టు ఉత్తర్వులను అమలు చేసినట్లు నివేదిక సమర్పించాలని, లేనిపక్షంలో కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవని హెచ్చరించింది. 

ఈ మేరకు చీఫ్‌‌ జస్టిస్‌‌ అలోక్ అరాధే, జస్టిస్‌‌ జె. శ్రీనివాసరావుతో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేట్‌‌ ఇంజనీరింగ్‌‌ కాలేజీల్లో ఏఐసీటీఈ, జెఎన్టీయూ ఆమోదించిన ప్రకారం కంప్యూటర్‌‌ సైన్స్, ఐటీ, సైబర్‌‌ సెక్యూటీస్‌‌ వంటి కోర్సుల్లో సీట్ల సంఖ్య పెంచి, మాప్‌‌–అప్ కౌన్సెలింగ్‌‌ ద్వారా వాటిని భర్తీ చేయాలని హైకోర్టు గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేయగా, కొట్టివేసింది. 

సుప్రీంకోర్టులో పిటిషన్ కొట్టేసిన తర్వాత కూడా ప్రభుత్వం సీట్ల పెంపును అనుమతించలేదంటూ హైకోర్టులో పలు ఇంజనీరింగ్‌‌ కాలేజీలు పిటిషన్లు వేశాయి. దీనిపై విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్.. తీర్పును 21కల్లా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. 

కోఆపరేటివ్‌‌ కమిషనర్‌‌పై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్‌‌ కోఆపరేటివ్‌‌ హౌసింగ్‌‌ సొసైటీ మేనేజింగ్‌‌ కమిటీ అక్రమాలపై విచారణ రిపోర్టు ఇవ్వాలన్న ఆదేశాల్ని అమలు చేయని కోఆపరేటివ్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ కమిషనర్, రిజిస్ట్రార్‌‌ హరితపై హైకోర్టు మరోసారి ఫైర్ అయ్యింది. విచారణకు ఆమె స్వయంగా హైకోర్టుకు హాజరై, రిపోర్టు అందజేశారు. గత ఆదేశాల మేరకు రిపోర్టు ఇవ్వకపోవడం కోర్టు ధిక్కారమే అవుతుందని జస్టిస్‌‌ సీవీ భాస్కర్‌‌రెడ్డి అన్నారు. 

సొసైటీ మాజీ కార్యదర్శి మురళీ ముకుంద్‌‌ కోర్టు ధిక్కరణ పిటిషన్‌‌పై విచారణను 2 వారాలకు వాయిదా వేశారు. కోర్టు ఆదేశించాక రిపోర్టు ఇవ్వడం కోర్టు ధిక్కరణే అవుతుందని కోర్టుకు పిటిషనర్‌‌ లాయర్‌‌ చెప్పారు. హరిత రిలీవ్‌‌ అవ్వడం వల్ల రిపోర్టు ఇవ్వలేకపోయారని ప్రభుత్వ ప్లీడర్‌‌ వాదించారు. వీటిపై తదుపరి విచారణలో తేల్చుతామన్న హైకోర్టు విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.