తీర్పుల్లో భిన్నస్వరాలు

భారత రాజ్యాంగంలోని141 ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు వెలువరించే తీర్పులు దేశంలోని అన్ని న్యాయస్థానాలపై  బైండింగ్ స్వభావం కలిగి ఉంటాయి. అలాగే సుప్రీం మెజారిటీ సభ్యుల తీర్పును అక్కడి మైనారిటీ సభ్యుల ధర్మాసనం విధిగా పాటించాలి.  బైండింగ్ స్వభావం ధర్మాసనంలోని న్యాయమూర్తుల సంఖ్యను బట్టి ఉంటుంది తప్ప అందులోని మెజారిటీ సభ్యుల తీర్పును బట్టి ఉండదు. ఐదుగురి సభ్యుల ధర్మాసనంలోని ముగ్గురు సభ్యుల మెజారిటీ తీర్పు కూడా రాజ్యాంగ ధర్మాసనం తీర్పుగా భావిస్తారు. అది నలుగురు సభ్యుల బెంచ్​పై బైండింగ్ స్వభావం కలిగి ఉంటుంది. ఏదైనా కేసు విచారణ సందర్భంలో ఒకేలా ఉన్నటువంటి సుప్రీం తీర్పులోని అంశాలు, హేతుబద్ధమైన నిర్ణయం గురించి ప్రస్తావించి కూడా, దాన్ని అనుసరించకుండా దిగువ కోర్టులు వ్యతిరేక నిర్ణయం తీసుకుంటే అది క్రమశిక్షణా రాహిత్యమే కాకుండా కోర్టు ధిక్కరణ చర్యగా భావించే అవకాశముంది.

పంచనామాపై సంతకం..

జాకరణ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అనే కేసులో 20.-4-.1995 నాటి తీర్పులో సుప్రీం ద్విసభ్య ధర్మాసనం నిందితుడి సమక్షంలో జరిపే స్వాధీన పంచనామాపై తప్పనిసరిగా అతడి సంతకం ఉండాల్సిందేనని నిక్కచ్చిగా చెప్పింది. స్టేట్ ఆఫ్ రాజస్థాన్ వర్సెస్ తేజారాం అనే కేసులో 1.-2. -2000 తేదీన మరో సుప్రీం ద్విసభ్య ధర్మాసనం స్వాధీన పంచనామాపై  నిందితుడి సంతకం తప్పనిసరి కాదని చెప్పింది. వీకే జైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 1999లో సుప్రీం ద్విసభ్య ధర్మాసనం ముద్దాయి కోర్టు ముందు మొదటి సారి వ్యక్తిగతంగా హాజరైన తర్వాత మాత్రమే తదుపరి వాయిదాలకు వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరే అవకాశముందని పేర్కొనగా, భాస్కర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వర్సెస్ భివాని డెనిమ్ అనే కేసులో2001లో సుప్రీం ద్విసభ్య ధర్మాసనం తీర్పు ఇస్తూ.. స్పెషల్ వకాలత్ ద్వారా మొదటి సారి కూడా ముద్దాయి తరఫున అతడి న్యాయవాది కోర్టు ముందు హాజరు కావచ్చని తీర్పు ఇచ్చింది. ఖమరున్నీసా వర్సెస్ ఫజల్ హుస్సేన్ అనే కేసులో 1996లో ఆంధ్ర ప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంలోని సింగిల్  జడ్జి ఒక వ్యక్తి సంతకం లేదా చేతి రాతపై సంశయం ఉదయించినప్పుడు, పరిశీలన నిమిత్తం దాన్ని తప్పనిసరిగా చేతిరాత నిపుణిడికి పంపించటమే ఉత్తమమని ఘంటాపథంగా తీర్పు ఇచ్చింది. ఇలా ఉండగా మరో సింగిల్ జడ్జి గురు గోవిందు వర్సెస్ దేవారపు వెంకటరమణ అనే కేసు విచారణలో 2006లో ప్రశ్నించిన సంతకం లేదా చేతి రాతను తన ముందున్న అసలు వ్యక్తి చేసిన ఒప్పుకోబడిన సంతకం లేదా చేతిరాతతో కోర్టు సొంతంగా పోల్చి చూసి నిర్ణయం తీసుకోవచ్చని, నిపుణిడికి పంపకపోవటం తప్పేమీ కాదని తీర్పు చెప్పింది.

తీర్పులపై సంశయం

మొదటగా వచ్చిన తీర్పు తమ దృష్టికి రానందున ఒకే విధమైన కేసులో మరో భిన్నమైన తీర్పు రావటం సహజం. సమ సంఖ్యతో ఏర్పాటైన న్యాయమూర్తుల బెంచ్​లు వేర్వేరు సందర్భాల్లో ఒకే రకమైన కేసుల్లో ఇచ్చిన రెండు భిన్నమైన తీర్పులు తమ దృష్టికి వచ్చినట్లయితే, ఏ తీర్పును అనుసరించాలనే సంశయం దిగువ కోర్టుల న్యాయాధికారులకు కలిగే అవకాశం లేకపోలేదు. ఈ విషయంపై యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ గాడ్ ఫ్రే ఫిలిప్స్ లిమిటెడ్ అనే కేసులో సుప్రీం త్రిసభ్య ధర్మాసనం1985లో కిషన్ సింగ్ వర్సెస్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అనే కేసులో-1993లో రాజస్థాన్ హైకోర్టు, మొదటగా వచ్చిన తీర్పును ఆధారంగా తీసుకోవాలని చెప్తున్నాయి.  కొన్ని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాల అభిప్రాయం వేరే రకంగా ఉంది. ఈ విషయంపై న్యాయాధికారులు, న్యాయవాదులు, కక్షిదారులు ఎవరి వీలును బట్టి వారికి అనుగుణంగా భావించటంలో తప్పు లేదు.  ఏది ఏమైనా సర్వోన్నత న్యాయస్థానం తీర్పు అందరికీ శిరోధార్యం.

రెండో వివాహంపై..

సుప్రీంకోర్టు, వివిధ రాష్ట్ర హైకోర్టులు ఒకే విషయంపై గతంలో తాము ఇచ్చిన తీర్పులు తమ దృష్టికి రానందువల్ల భిన్నమైన తీర్పులు ఇచ్చిన సందర్భాలు లేకపోలేదు. శివచరణ్ లాల్ వర్మ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ అనే కేసులో సుప్రీం త్రిసభ్య ధర్మాసనం19-2-2002 నాడు మొదటి భార్య జీవిత కాలంలో రెండో భార్యతో వివాహం చట్ట విరుద్ధం కాబట్టి రెండో భార్యను హింసించటమనేది భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 498ఏ ప్రకారం నేరంగా పరిగణించరాదని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు తమ దృష్టికి రానందున రీమా అగర్వాల్ వర్సెస్ అనుపమ్ అనే కేసులో సుప్రీం ద్విసభ్య ధర్మాసనం 8-1-2004 నాడు రెండో వివాహం చట్ట విరుద్ధమైనా కూడా, భర్త సెక్షన్ 498ఏ కింద శిక్షార్హుడని తీర్పు ఇచ్చింది. ఇందులో మెజారిటీ సభ్యులున్న త్రిసభ్య ధర్మాసనం తీర్పు మాత్రమే దిగువ కోర్టులు అనుసరించాలి.

 

తడకమళ్ల మరళీధర్
విశ్రాంత జిల్లా జడ్జి