
దుబాయ్: తన ట్రేడ్ మార్క్ కవర్ డ్రైవ్ షాట్ బలహీనత అని బ్యాటింగ్ మాస్ట్రో విరాట్ కోహ్లీ అంటున్నాడు. కానీ ఆ షాట్ ఆడటం వల్ల ఇన్నింగ్స్‌పై నియంత్రణ వచ్చిందని పాకిస్తాన్‌పై సెంచరీ అనంతరం విరాట్ చెప్పాడు. ‘కవర్ డ్రైవ్ కొన్నేళ్లుగా నా బలహీనతగా మారింది. ఆ షాట్ విషయంలో డైలమా కొనసాగుతూనే ఉంది. గతంలో ఆ షాట్స్‌తోనే చాలా రన్స్ చేశా. ఈ మ్యాచ్‌లో మాత్రం నా షాట్లపై నమ్మకం ఉంచా.
తొలి రెండు బౌండ్రీలు కవర్ డ్రైవ్స్‌తోనే వచ్చాయి. ఆ షాట్ల వల్ల ఇన్నింగ్స్‌లో నియంత్రణ వస్తుంది. వ్యక్తిగతంగా నాకు ఇది చాలా మంచి ఇన్నింగ్స్. టీమ్‌కు గొప్ప విజయం కూడా’ అని విరాట్ పేర్కొన్నాడు. పాక్‌తో మ్యాచ్ అంటేనే చాలా ఉత్సాహంగా ఉంటుందన్నాడు. రెండు దేశాల నుంచి సమాన సంఖ్యలో అభిమానులు ఉంటారు కాబట్టి వాళ్ల ముందు మ్యాచ్ గెలవడం జట్టుకు, తనకు గొప్పగా అనిపిస్తోందని విరాట్ చెప్పాడు.