కవర్ స్టోరీ..ఎవర్ గ్రీన్​ లెజెండ్​: ఎం.ఎస్. స్వామినాథన్

కవర్ స్టోరీ..ఎవర్ గ్రీన్​ లెజెండ్​: ఎం.ఎస్. స్వామినాథన్

తల్లి మాటను గౌరవించి తండ్రి బాటలో నడవాలనుకున్నారు. తండ్రిలాగే నిస్వార్థంగా ప్రజలకు వైద్యం చేయాలనుకున్నారు. కానీ... ఒక విపత్తు ఆయన ఆలోచనను పూర్తిగా మార్చేసింది. బెంగాల్​లో వచ్చిన కరువు చూసి ఆయన హృదయం బరువెక్కింది. ఆకలి చావులను ఆపాలని ఆనాడే నిర్ణయించుకున్నారు. ఎవరెన్ని చెప్పినా తన లక్ష్యాన్ని మాత్రం వీడలేదు. తను అనుకున్నది సాధించేంత వరకు పట్టువదల్లేదు. దాని ఫలితంగా దేశ ప్రజల ఆకలి తీరింది. అంతేనా ప్రపంచానికే సాయమందించే స్థాయికి చేరింది. విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని హరిత విప్లవానికి నాంది పలికారు ఆయన. 98 ఏండ్ల పరిపూర్ణ జీవితాన్ని గడిపిన ఆయన చివరి శ్వాస వరకు వ్యవసాయ రంగంలో ఎనలేని సేవలు చేశారు డాక్టర్ ఎం. ఎస్​. స్వామినాథన్. హరిత విప్లవ పితామహుడు అయిన ఆయన పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆయన జీవితం నేటి యువతకు స్ఫూర్తి నింపే గొప్ప పాఠం అంటే అతిశయోక్తి కాదు.

‘‘నేను ప్రజల కష్టాల గురించి ఆలోచించానంటే అందుకు ఇన్​స్పిరేషన్​ నా తల్లిదండ్రులే. వాళ్ల ఆలోచనా విధానం, వాళ్లు నేర్పిన నడవడిక నన్ను ఇంత ఎత్తుకు ఎదిగేలా చేశాయి” అని చెప్పారాయన. మిమ్మల్ని అంతగా ఇన్​స్పైర్​ చేసిన విషయం ఏంటని ఒక ఇంటర్వ్యూలో అడిగితే.. ‘‘మా నాన్న సాంబశివన్‌ డాక్టర్. ఆయన ట్రీట్​మెంట్​ చేశాక పేషెంట్ డబ్బు ఇస్తే తీసుకునేవాడు. లేకపోతే లేదు. తనంతట తానుగా మాత్రం డబ్బు అడిగేవాడు కాదు. మాది తమిళనాడులోని కుంభకోణం. అక్కడ చాలామంది పైలేరియాసిస్​ (బోదకాల) వ్యాధితో బాధపడేవాళ్లు. అది దోమల ద్వారా వస్తుంది. దాని గురించి నాతో చెప్తూ ‘‘దోమల్ని దేవుడు సృష్టించలేదు. మనుషులే పుట్టించారు. అందుకని ఆ దోమలబారి నుంచి బయటపడే మార్గాన్ని దేవుడ్ని అడగకూడదు. మనమే ఆ సమస్యను పరిష్కరించాలి” అన్నారు. కుంభకోణంలో ఒకసారి మునిసిపల్ ఎన్నికలు 

జరుగుతుంటే అందులో ఛైర్మన్​గా పోటీ చేశారు. అందరూ ఓట్లు వేసి ఆయన్ని గెలిపించారు. ఒక్క ఏడాదిలోనే దోమల బెడద లేకుండా చేశారాయన. దానికి ఆయన చాలా సింపుల్​ ట్రిక్ చెప్పారు. నేను అప్పుడు స్కూల్లో చదువుకుంటున్నా. మా అందర్నీ పిలిచి స్కూల్​ గ్రౌండ్​లో దోమలు ఎక్కువగా పెరిగే ప్రదేశాలు చూపించి, ఇక్కడ నుంచే దోమలు పుట్టుకొస్తాయి. వాటిని ఇక్కడే చంపేస్తే వ్యాధులు రావు. అందుకని, క్రూడ్ ఆయిల్ ఎమల్షన్​ని స్ప్రే చేయమని చెప్పారు. ఆ తర్వాత అక్కడ దోమలే కనపడలేదు.

అమ్మానాన్న.. గాంధీజీ

మా అమ్మ విషయానికొస్తే... చిన్నప్పుడు నా చేతికి కడియం, చెవికి పోగు ఉండేవి. దక్షిణాదిలో ఆడ, మగపిల్లలకి వీటిని అలంకరిస్తారు. అమ్మానాన్నలిద్దరూ గాంధీజీని ఫాలో అయ్యేవారు. గాంధీజీ తమిళనాడులోని కుంభకోణంలో అప్పుడప్పుడు మా ఇంటికి కూడా వచ్చేవాళ్లు. నాకు ఎనిమిదేండ్ల వయసున్నప్పుడు మా అమ్మ చర్కాతో నూలు వడికి మాకు బట్టలు కుట్టేది. ఒకసారి మా అమ్మ నన్ను పిలిచి ‘ఈ రోజు మనింటికి ఒకాయన వస్తారు. ఆయన నీ ఒంటి మీద ఉన్న నగలు చూసి తనకు ఇవ్వమంటాడు. నువ్వు ఇవ్వద్దు’ అని చెప్పింది. ఆయన వచ్చి నన్ను అడిగారు. నేను మా అమ్మ వైపు చూసి.. ‘వీటిని ఆయనేం చేసుకుంటారు?’ అని అడిగా. అప్పుడు ఆయన నాతో ‘నీకు అన్నీ సరిపడా ఉన్నాయి. ఇవి నీకు అదనంగా వచ్చినవి. కాబట్టి అవి నాకు ఇస్తే లేని వాళ్లకు సాయం చేస్తా’ అన్నాడు. వెంటనే నేను తీసిచ్చేశా. అప్పటినుంచి నాకు అదనంగా వచ్చినవన్నీ అవసరమైన వాటికోసం ఖర్చు పెట్టడం మొదలుపెట్టా” అని తన చిన్ననాటి విషయాలు గుర్తుచేసుకున్నారు ఎం.ఎస్​.  

నాన్నే రోల్ మోడల్

పదకొండేండ్ల వయసులో స్వామినాథన్ తండ్రి చనిపోయారు. ఆ తర్వాత వాళ్ల అమ్మే తనని ఇంతవాడిని చేసిందని చెప్పేవారాయన. స్వామినాథన్ తండ్రికి పెద్ద హాస్పిటల్ ఉండేది. ఆయన తమ్ముడు రేడియాలజిస్ట్. తండ్రి తర్వాత స్వామి నాథన్​ని, వాళ్లమ్మని చిన్నాన్నే చూసుకున్నారు. స్వామినాథన్ తల్లి ‘‘నువ్వు కూడా డాక్టర్​ అవ్వు. నాన్న కట్టించిన హాస్పిటల్ చూసుకో” అని చెప్పింది. అప్పటికి ఆయన త్రివేండ్రంలో మహారాజా కాలేజీలో చదువుతున్నారు. అప్పుడు స్వామినాథన్​ వాళ్ల పెదనాన్న గవర్నమెంట్​ ఆఫ్​ ట్రావెన్​కోర్​లో చీఫ్​ సెక్రట్రీగా పనిచేసేవాళ్లు. ఆయన ‘‘మీ నాన్న లేడు కదా. నువ్వు ఇక్కడకి వచ్చి చదువుకో’’ అని చెప్పారట. అప్పుడే గాంధీజీ క్విట్​ ఇండియా మూమెంట్​కి పిలుపునిచ్చారు. అప్పుడు స్టూడెంట్స్ అందరికీ అదే హాట్​ టాపిక్. దాంతో స్వామినాథన్ ఫ్రెండ్స్​తో కలిసి ఇండిపెండెన్స్ గురించి డిస్కస్ చేసుకునేవాళ్లు. అదే టైంలో1943లో బెంగాల్​లో తిండికి కరువు వచ్చింది. అప్పుడు ఆకలి చావులు చూసి ఆయన మనసు చలించి పోయింది. అప్పుడే ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు. దేశంలో ఆహార ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలని నిర్ణయించుకున్నారు. ఇండిపెండెన్స్ కోసం ఒక్కొక్కరు ఏమేం చేయగలరు చెప్పమని అందరూ ఒక రౌండ్​ టేబుల్ మీటింగ్​ పెడితే... ‘నేను ఆకలి లేకుండా చేయాలనుకుంటున్నా’ అని చెప్పారు స్వామినాథన్ . అలా ఆయన మెడికల్​ స్టడీస్ నుంచి అగ్రికల్చర్​ వైపు వెళ్లారు. ఆ నిర్ణయానికి వాళ్ల అమ్మతో సహా అందరూ షాక్ అయ్యారు. ఆయన అవేం పట్టించుకోకుండా కోయంబత్తూర్ వెళ్లి అగ్రికల్చర్​ కాలేజీలో చేరారు. ‘‘ప్రజల బాగోగుల గురించి ఆలోచించడం అనేది నాకు మా నాన్న నుంచే అబ్బింది. నాకు మా నాన్నే రోల్​ మోడల్’’ అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. 

ఐపిఎస్​ వద్దని...

త్రివేండ్రంలోని మహారాజా కాలేజీలో అండర్ డిగ్రీ జువాలజీ చదివారు. ఆ తర్వాత మద్రాస్ అగ్రికల్చర్ కాలేజీలో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఆపై ప్లాంట్​ బ్రీడింగ్, జెనెటిక్స్​లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి ఢిల్లీ వెళ్లారు. అక్కడ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్​ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్​లో చేరారు. స్వామినాథన్​ని అక్కడ ఉన్న వాళ్ల జిల్లా కలెక్టర్​ చూసి ‘‘అగ్రికల్చర్​ ఎందుకు తీసుకున్నావు? ఇందులో ఫ్యూచర్ ఉండదు. కాంపిటీటివ్​ ఎగ్జామ్స్ రాసి, సివిల్ సర్వీసెస్​లో చేరు’’ అన్నారట. ఆయనే అప్లికేషన్​ ఫామ్​ నింపి మరీ ఆయనకు ఇచ్చారట. అలా స్వామినాథన్​ ఆ  ఎగ్జామ్ రాశారు. ఐ.పి.ఎస్.​కి సెలక్ట్​ అయ్యారు. గవర్నమెంట్​ ఆర్డర్స్ కూడా వచ్చాయి. కానీ అప్పటికే ఆయన హాలెండ్ వెళ్లడానికి ఫెలోషిప్​ కోసం అప్లై చేసి ఉన్నారు. అక్కడ చిన్న చిన్న పొలాలుంటాయి. మంచి రైతులు ఉంటారు. అందుకని అక్కడికి వెళ్లి ఆలుగడ్డల మీద  రీసెర్చ్ చేస్తే బాగుంటుంది అని ఇనిస్టిట్యూట్​ తరపున ఆయన్ను పంపాలనుకుంది మేనేజ్​మెంట్. సడెన్​గా ఐ.పి.ఎస్​. అవకాశం రాగానే ఆయనకు ఏం పాలుపోలేదట. కానీ, ఆయన ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే దానిపైనే ఉంటారు స్వామినాథన్​. అందువల్ల ‘‘నేను ఐపిఎస్​లో చేరడం కుదరదు. ఒక ఏడాది పాటు రీసెర్చ్​ కోసం హాలెండ్​ వెళ్లాలి’’ అని హోం మినిస్టర్​కి లెటర్ రాశారు. అలాగే యునెస్కో ఫెలోషిప్​ వాళ్లకు కూడా ఒక ఏడాది వరకు రీసెర్చ్ ఉంటుందని లెటర్ పంపారు. అయితే, ఏడాది తర్వాత మళ్లీ ‘స్టడీ కోసం వెళ్లావు​ కదా. అది ఇప్పుడు అయిపోయింది. కాబట్టి ఇప్పటికీ ఆసక్తి ఉంటే అస్సాంలో డ్యూటీలో చేరొచ్చ’ని గవర్నమెంట్​ నుంచి ఆయనకు మెసేజ్ వచ్చింది. దానికి ఆయన ‘నన్ను మన్నించండి. అపార్థం చేసుకున్నారు. నేను సివిల్ సర్వీసెస్​లో చేరడం కుదరదు’ అని లెటర్ పంపారు. ఆ తర్వాత పీహెచ్​డీ చేయడం కోసం కేం బ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్లారు స్వామినాథన్​. అక్కడ కూడా ఆలుగడ్డల మీదే రీసెర్చ్​. ఆ టైంలో రీసెర్చ్​ మీద అంతర్జాతీయంగా దృష్టిపడాలని కొన్ని పేపర్స్ పబ్లిష్ చేశారాయన. స్వామినాథన్​కి ఉన్న ఆసక్తి, టాలెంట్​ చూసిన విస్కాన్సిన్‌ యూనివర్సిటీ ప్రెసిడెంట్‌ అక్కడే మంచి జీతంపై ప్రొఫెసర్ పోస్టు ఆఫర్‌ చేశారు. కానీ, ఆయన అందుకు ఒప్పుకోలేదు. ఇండియాకి వచ్చి1954లో కటక్‌లోని కేంద్ర వరి పరిశోధన సంస్థలో చేరారు. తర్వాత భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థకు మారారు. వివిధ హోదాల్లో పనిచేస్తూ వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్లారు. 


కేంబ్రిడ్జ్​లో చదివేటప్పుడు పరిచయమైన మీనాను పెళ్లి చేసుకున్నారు.1988లో ఎం.ఎస్. స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ స్థాపించి గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగాన్ని డెవలప్ చేసేందుకు కృషిచేశారు. ఈ సంస్థ దేశవ్యాప్తంగా14 రాష్ట్రాల్లోని రైతులకు సాయం చేస్తోంది. ఇది తన వ్యక్తిగత జీవితం. వృత్తిగతం గురించి చెప్పాలంటే అదొక  ప్రస్థానం అనే చెప్పొచ్చు.

*   *   *

హరిత విప్లవం...

నీటి పారుదల సౌకర్యం, యాంత్రీకరణ, రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందుల్ని వాడి, సంకరజాతి వంగడాలు పండించడం, దానికి అనుగుణంగా పనులు చేపట్టడం మొదలుపెట్టడాన్ని హరిత విప్లవం అంటారు. ఇది మొదటిసారి1945లో మెక్సికోలో ప్రారంభమైంది. పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని మెక్సికో ప్రభుత్వం వివిధ రకాల గోధుమ వంగడాలు డెవలప్ చేసింది. నార్మన్ బోర్లాగ్ టీం చేసిన రీసెర్చ్ సక్సెస్ అయింది. అదే టైంలో ఇండియా కరువు ఎదుర్కొంటోంది. బ్రిటిష్ వాళ్లు వ్యవసాయ రంగాన్ని నాశనం చేసి వెళ్లారు. స్వాతంత్య్రం వచ్చే టైంకి దేశంలో ఏటా 60 లక్షల టన్నుల గోధుమలు మాత్రమే పండేవి. అప్పటి జనాభాకు అవి సరిపోక ఆకలితో అలమటించేవారు. విదేశాల నుంచి సరుకు వస్తే గానీ పూటగడవని పరిస్థితి. అమెరికా నుంచి గోధుమలను భారీగా దిగుమతి చేసుకునేవాళ్లు. ప్రపంచంలో ఎక్కడా లేనంత మంచి వాతావరణ పరిస్థితులు, జీవనదులు, సారవంతమైన నేలలు, పుష్కలంగా మానవ వనరులు ఉండి కూడా మన దేశంలో తక్కువ దిగుబడులే ఉండేవి. భారత సంప్రదాయ వంగడాలు ఏపుగా, సన్నగా పెరిగి గాలికి వాలిపోయేవి. అలాంటి పరిస్థితుల్లో కాస్త తక్కువ ఎత్తుతో దృఢంగా నిలిచి ఎక్కువ దిగుబడి నిచ్చే వరి వంగడాలపై స్వామినాథన్‌ బృందం చేసిన పరిశోధనలు కొంత మేరకు సక్సెస్ అయ్యాయి. ఆ ఉత్సాహంతో అధిక దిగుబడులను ఇచ్చే గోధుమలపై దృష్టి పెట్టారు. అదే టైంలో స్వామినాథన్‌కు అమెరికన్‌ అగ్రికల్చర్ సైంటిస్ట్ ఒర్‌విలె వోగెల్‌ పరిచయమయ్యారు. ఆయన అప్పటికే మరుగుజ్జు గోధుమ వంగడాన్ని ఒకదాన్ని డెవలప్ చేశారు. కానీ ఆ వంగడం భారత వాతావరణ పరిస్థితుల్లో పనిచేయకపోవచ్చని, నార్మన్‌ బోర్లాగ్‌ను కలవమని స్వామినాథన్‌కు సలహా ఇచ్చారు. కరువు నుంచి బయటపడాలంటే  మెక్సికో హరిత విప్లవ పితామహుడైన నార్మన్​ బోర్లాగ్​ను ఇండియాకు తీసుకురావాలి అనుకున్నారు స్వామినాథన్. ఆయన వచ్చాక జపాన్, మెక్సికో రకాల గోధుమల నుంచి సంకరజాతి గోధుమ రకాన్ని తయారుచేసి, దాని డెవలప్​మెంట్​ను నార్మన్ బోర్లాగ్​తో కలిసి పర్యవేక్షించారు. ఢిల్లీలోని వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో మెక్సికన్ సూక్ష్మ విత్తనాలను చల్లించారు. దాని ఫలితం... హెక్టార్​కు ఐదు టన్నుల గోధుమల దిగుబడి వచ్చింది.

అలా అడుగు పడింది

అప్పుడు లాల్​బహదూర్ శాస్త్రి పాలన నడుస్తోంది. ఆయన చొరవతో విదేశాల నుంచి18 టన్నుల గోధుమ విత్తనాలను తెప్పించారు. ఆ తర్వాత గోధుమల ఉత్పత్తి బాగా పెరిగింది. గోధుమలను దిగుమతి చేసుకుని ప్రయోగాత్మకంగా పంజాబ్​లో పండించారు. అవి మంచి దిగుబడినివ్వడంతో హరిత విప్లవానికి ముందడుగు వేసినట్లయింది. అలా హరిత విప్లవం1965లో ప్రారంభమైంది. నార్త్ ఇండియాలో రైతులకు అధిక దిగుబడినిచ్చే మరుగుజ్జు గోధుమ రకాలను పరిచయం చేయడంపై ఫోకస్ చేశారు. అధిక దిగుబడినిచ్చే వంగడాల తయారీ, ట్రాక్టర్లలాంటి ఆధునిక పరికరాలను వాడడం మొదలుపెట్టారు. సాగునీటి సదుపాయాలు మెరుగుపర్చటం, ఎరువులు, పురుగుమందుల వాడకం, సాగు విస్తీర్ణం పెంచేశారు.1967–-68 నుంచి 1977-–78 టైంలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులొచ్చాయి. వరిలోనూ అధిక దిగుబడి తీసుకురావడం కోసం ఐఆర్–8 హైబ్రీడ్ రకం వరిని పండించారు. అనుకున్నదానికంటే రెట్టింపు దిగుబడి వచ్చింది.1978–79లలో 131 మిలియన్​ టన్నుల ఆహారధాన్యాలను ఉత్పత్తి చేసి రికార్డ్​ క్రియేట్ చేసింది. ప్రపంచంలో మరే దేశం ఇంత త్వరగా అంత ఎక్కువ దిగుబడిని ఇవ్వలేదు. అలాగే ఉత్తరాదిలోని రాజస్తాన్, గుజరాత్​లలో ఆలుగడ్డల సాగు విపరీతంగా పెరిగింది. దక్షిణాదిలో రైస్ ఎక్కువగా పండింది. 

ఇందిరా గాంధీ మెచ్చుకున్నారు

ఇందిరా గాంధీ ప్రధాన మంత్రి అయ్యాక వ్యవసాయరంగంలో కీలక మార్పులు వచ్చాయి. 1966లో తీవ్రమైన కరువును ఎదుర్కొన్న భారత్ కోటి టన్నుల గోధుమలను దిగుమతి చేసుకుంది. అలాంటి సీన్ మళ్లీ రిపీట్ కావొద్దనే దృఢ సంకల్పంతో స్వామినాథన్​ని పిలిచి ‘స్వామినాథన్​.. ఇక నుంచి పది మిలియన్ టన్నుల ధాన్యాన్ని మనమే పండించుకోవాలి. దానికోసం మీరేదైనా చేయండి’ అని చెప్పారు ఇందిరాగాంధీ. అప్పుడాయన ‘అన్నీ అనుకూలిస్తే ఐదేండ్లలో పది మిలియన్ టన్నులు పండించగలం’ అని హామీ కూడా ఇచ్చారు. అనుకున్నట్టుగానే ఆ దిశగా అడుగులు వేశారు. గోధుమలు, వరి పండించడానికి శ్రీకారం చుట్టారు.1968 నాటికి10 మిలియన్​ టన్నులకు పైగా గోధుమలు పండించి చరిత్ర సృష్టించారు. దాంతో ‘వీట్​ రివల్యూషన్’ మొదలైందన్నారు ఇందిరాగాంధీ. దీనిపై ఒక స్టాంప్​ కూడా వేశారు. ఆ పరిశోధనల్లో విజయం సాధించి, గోధుమ, వరి ఉత్పత్తిని తక్కువ టైంలో రెట్టింపు చేయడంలో కీ రోల్​ పోషించారు స్వామినాథన్​. ఆహారం కోసం అమెరికాపై ఆధారపడకుండా.. దేశాన్ని కరువు నుంచి రక్షించారు. దాంతో1968 నుంచి1978 వరకు వ్యవసాయరంగంలో విప్లవాత్మక దశ అని ప్రపంచదేశాలు కొనియాడాయి. 
అయితే ఇదంతా జరగడానికి తానొక్కడినే కారణం కాదని, అందుకు సహకరించిన ప్రధాని ఇందిరాగాంధీ, అడ్మినిస్ట్రేటివ్ లీడర్, ఐసిఎస్ ఆఫీసర్ అయిన బి.శివరామన్ వంటి వాళ్లు ఉండబట్టే ఇది సాధ్యమైందని స్వామినాథన్ చెప్పారు. ‘‘బి.శివరామన్, చాలా తెలివైనవాడు. ఆయనది బుక్ నాలెడ్జ్​ కాదు. ఫీల్డ్​ నాలెడ్జ్. నేను, ఆయన కలిసి పొద్దున్నే పంటపొలాల దగ్గరకి వెళ్లి, ఒక రౌండ్ తిరిగి వచ్చేవాళ్లం. ఈ రోజు కొత్తగా ఏం జరిగింది అని చూసేవాళ్లం. అంత ఇంట్రెస్ట్​తో పనిచేశాం’’ అని ఒక సందర్భంలో ఆయన్ని గుర్తు చేసుకున్నారు ఎం.ఎస్. స్వామినాథన్.  

విప్లవం వెనుక సవాళ్లు

నార్మన్ బోర్లాగ్​ని ఇండియాకు తీసుకురావడానికి రెండేండ్లు పట్టింది. ఎందుకంటే ‘అతను మెక్సికోకి చెందినవాడు. అతను ఇక్కడికి వచ్చి ఏం చేస్తాడు? మనం అతని దగ్గర్నించి ఏం నేర్చుకోవాలి?’ అని స్వామినాథన్​ మనసులో చాలా ప్రశ్నలు ఎదురయ్యాయి. ఆ టైంలో చిదంబరం సుబ్రమణ్యం కేంద్ర ప్రభుత్వంలో వ్యవసాయశాఖ మంత్రి. ఆయన కలగజేసుకుని పని జరిగేలా చేశారు.  బోర్లాగ్‌ను కలిసిన స్వామినాథన్‌ ఇక్కడి పరిస్థితి వివరించారు.1963లో నార్మన్‌ బోర్లాగ్‌ తయారుచేసిన పొట్టి గోధుమ వంగడాలను భారత్‌లో తయారు చేయటం స్టార్ట్ చేశారు. స్వామినాథన్‌ నాయకత్వం​లో మన శాస్త్రవేత్తలు మేలైన వంగడాలను సృష్టించారు. అలా ‘హరిత విప్లవా’నికి అంకురార్పణ జరిగింది. అప్పటి నుంచి ‘హరిత విప్లవ పితామహుడి’గా స్వామినాథన్​ పేరు మారుమోగిపోయింది. ఆ తర్వాత సి. సుబ్రమణ్యాన్ని భారతరత్న పురస్కారంతో సత్కరించింది ప్రభుత్వం. అలాగే  భారతదేశపు భౌతిక శాస్త్రవేత్త, భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థకు ముఖ్యుడైన విక్రమ్​ సారాభాయ్ కూడా ఇందులో పాలుపంచుకున్నారు. ‘కృషిదర్శన్​’ అనే టీవీ ప్రోగ్రాంలో అగ్రికల్చర్​ టెక్నాలజీని కూడా టెలికాస్ట్​ చేసేందుకు ఆయన సాయం చేశారని స్వామినాథన్ చెప్పారు. 

రైతు సమస్యలపై ధ్వజం

కేవలం వంగడాల సృష్టి, పంట దిగుబడి పెంచడమే కాకుండా ఇండియన్ అగ్రికల్చర్ రంగం అభివృద్ధికి, రైతుల జీవితాలు మెరుగవ్వటానికి సామాజిక శాస్త్రవేత్తగా ఆలోచించారు ఎం.ఎస్. స్వామినాథన్. 2004లో దేశంలోని రైతుల ఆత్మహత్యలు, ఇబ్బందులను అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన నేషనల్ కమిషన్‌కు ఛైర్మన్‌గా ఉన్నారు స్వామినాథన్. ఆ కమిటీ దేశంలోని రైతుల ఆర్థిక స్థితిగతులు, ఆత్మహత్యలు, ఒత్తిళ్లపై అధ్యయనం చేసి 2006లో రిపోర్ట్ రెడీ చేసింది. సాగు సగటు ఉత్పత్తి వ్యయంలో కనీసం50 శాతం ఉండేలా పంటకు కనీస మద్దతు ధర నిర్ణయించాలని కమిటీ సూచించింది. దేశంలో  రైతుల సంక్షోభాన్ని పరిష్కరించేందుకు తమ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని చివరి వరకు కృషి చేశారు. ప్రస్తుత వ్యవసాయ రంగానికి రెండు సమస్యలు ఉన్నాయి. అవి రుతుపవనాలు, మార్కెట్లు. పెట్టుబడి వ్యయం కంటే ఎక్కువ మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలి. రుణాలు మాఫీ చేస్తే సరిపోదు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేవారు. అలాగే 2007 నుంచి 2013 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2010 నుంచి 2013 మధ్య ఆహార భద్రతపై ప్రపంచస్థాయి ఎక్స్​పర్ట్స్​ కమిటీకి ఛైర్మన్‌గా ఉన్నారు. 

వ్యతిరేకత.. 

‘గ్రీన్ రివల్యూషన్ వచ్చాక పెస్టిసైడ్స్ వాడకం పెరిగింది. అవసరం కంటే ఎక్కువగా భూగర్భం నుంచి నీళ్లు తోడుతున్నారు’ అని కొందరు ఎన్విరాన్​మెంటలిస్ట్​లు దాన్ని వ్యతిరేకించారు. ఆ టైంలోనే వారణాసిలో సైన్స్ కాంగ్రెస్ జరిగింది. అక్కడ ఇచ్చిన స్పీచ్​లో ‘గ్రీన్ రివల్యూషన్.. గ్రేట్ రివల్యూషన్’ అనే చెప్పారు స్వామినాథన్. దానికి వివరణ ఇస్తూ ‘మాకు ఒక పని అప్పగించారు. మేం అన్ని రకాలుగా ఆలోచించే ముందడుగు వేశాం. వాటికి కావాల్సినవన్నీ మోడరేట్​గానే వాడాం. ఇప్పుడు వ్యతిరేకించే వాళ్లంతా ఇన్​పుట్స్ గురించే ఆలోచిస్తున్నారు. కానీ, అవుట్​ పుట్ గురించి పట్టించుకోవట్లేదు. ఒక మొక్క పెరగాలంటే దానికి కొన్ని నూట్రియెంట్స్ అవసరం. పర్యావరణానికి ఎలాంటి నష్టం జరగకుండా పనిచేయాలి అనుకున్నాం. చేశాం. అప్పుడున్న పరిస్థితుల్లో ధాన్యాన్ని ఎక్కువ మొత్తంలో పండించాలి. పంట నష్టం రాకూడదు. వీలైనంత తర్వగా పంట చేతికి రావాలి. ఇవే అప్పుడు మా ముందున్న లక్ష్యాలు. వాటిని మేం సాధించి చూపించాం. అయితే, ఏండ్లు గడిచిపోయాయి. తర్వాత  టెక్నాలజీ కూడా పెరిగింది. ఎకలాజికల్ ఛేంజెస్​ వచ్చాయి. ఫెర్టిలైజర్స్ ఎక్కువగా వాడడం వల్లే సమస్యలు వస్తున్నాయని ఇప్పుడంతా ఆర్గానిక్ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. దానికోసం కూడా ఎన్నో ఏండ్లుగా సైంటిస్ట్​లు శ్రమపడితేనే ఫలితం ఇప్పుడు వచ్చింది. కాబట్టి ఏదైనా జరగాలంటే దానికి కొంత టైం పడుతుంది. ఆ టైంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే.. సైన్స్​ ఏం చేసినా పొగడ్తలు, వ్యతిరేకతలు రెండూ వస్తుంటాయి’ అని ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు స్వామినాథన్. 

రుణాలు అవసరం!

ఒకసారి రుణం ఇస్తే, అది పూర్తయ్యేవరకు మరో రుణం తీసుకోవడం కుదరదు. కాబట్టి రుణాలు తీసుకుని వ్యవసాయం చేయడం అనేది రైతుల ఆర్థిక సమస్యలకు పరిష్కారం కాదు. కానీ వ్యవసాయాన్ని కొనసాగించడానికి రుణాలు అవసరం అంటారు స్వామినాథన్​. ఈ విషయం గురించి ఓ టీవీ ఛానెల్​ ఆయన్ను అడిగితే ‘‘ఉదాహరణకు ఖరీఫ్​ సీజన్ వచ్చిందంటే రైతులు విత్తనాలు, పురుగుమందులు కొనాలి. నీళ్లు, కరెంట్​ వంటి సౌకర్యాలు చూసుకోవాలి. ఎందుకంటే ఈ సీజన్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి వాళ్లు పంట పండించాలంటే ఇవన్నీ ఉండాలి. అలాగే పంట కోతకు వచ్చే టైంకి కొన్నిసార్లు అనుకూల వాతావరణ పరిస్థితులు లేకపోతే దెబ్బతింటుంది. మరికొన్ని సార్లు మానవ తప్పిదాల వల్ల కూడా నష్టం జరుగుతుంది. ఎక్కువగా వాతావరణ ప్రభావం ఉంటుంది. 
మహారాష్ట్రనే తీసుకుంటే అక్కడ కరువు వచ్చింది. కానీ, తిరిగి వ్యవసాయం మొదలుపెట్టాలి. మరి అందుకు తగిన సౌకర్యాలు ఉండాలి. అలాంటప్పుడు ఫామ్ లోన్స్ ఉపయోగపడతాయి. ఒక్క మహారాష్ట్ర అనే కాదు.. అన్ని చోట్ల ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి అప్పటికే తీసుకున్న రుణం పూర్తిగా చెల్లించలేదనే కారణంతో మరోసారి రుణం ఇవ్వకపోతే రైతు నష్టపోతాడు. పంట వేయకపోతే ఆహార కొరత ఏర్పడుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు అన్ని రకాలుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే దేశం బాగుంటుంది” అని చెప్పారాయన.

నాన్నతో కలిసి పొలాలకు

మా చిన్నప్పుడే మా నాన్న ప్రపంచానికి తెలిసిన పెద్ద అగ్రికల్చర్ సైంటిస్ట్. అందువల్ల మేం కూడా మా నాన్నతో కలిసి పనిచేస్తున్న చాలామంది సైంటిస్ట్​లను చూశాం. సర్​ సి.వి. రామన్​ మా ఇంటికి వచ్చి, బస చేసేవాళ్లు. వాళ్లు మాకు చెప్పే మాటలు వింటూ పెరిగాం. మా నాన్న ఫీల్డ్​కి వెళ్లినప్పుడు అక్కడ జరిగిన విషయాలను మాతో పంచుకునేవారు. అంతేకాకుండా మమ్మల్ని కూడా ఆయనతోపాటు తీసుకెళ్లేవాళ్లు. వీకెండ్ వస్తే నాన్నతో కలిసి పంజాబ్​, హర్యానాల్లో గ్రామాల రైతులను కలవడానికి వెళ్లేవాళ్లం. మేం కూడా అక్కడే పొలాల్లో కూర్చుని ఆ రైతులతో మాట్లాడేవాళ్లం. అప్పుడే నాకు ప్రజలతో మాట్లాడటం అనేది ఎంత అవసరమో తెలిసింది. వాళ్లకు కొత్త విత్తనాలు లేదా ఇతర ప్రొడక్ట్స్ ఇవ్వాలన్నా, వాటిని వాడేందుకు ఒప్పించాలన్నా వాళ్లతో మాట్లాడి తీరాలి. ఇక మా అమ్మ మొబైల్ క్రషెస్​ అనే సంస్థ నడిపేది. చిన్నపిల్లల కోసం దీన్ని ఏర్పాటు చేసింది. వలస కార్మికులతో కలిసి పనిచేసేది. అలా మా తల్లిదండ్రులు ఇద్దరూ ఎంతో ఆదర్శంగా జీవించారు. మాకు అంతే గొప్ప జీవితాన్ని అందించారు. అదే టైంలో ప్రజల కష్టాలు, అవసరాల గురించి మాకు అర్థమయ్యేలా చేశారు. ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ మనం బాగానే ఉన్నాం. ఏం కావాలన్నా మనకు దొరుకుతుంది అనే విషయం మాకు తెలిసినప్పటికీ, బయట ప్రజల పరిస్థితి మా కళ్లముందుకొచ్చేది. 

- సౌమ్య స్వామినాథన్, చీఫ్​ సైంటిస్ట్, డబ్ల్యూహెచ్​వో (ఎం.ఎస్.స్వామినాథన్ కూతురు)

విప్లవాత్మక నిర్ణయాలు

ఎం.ఎస్ స్వామినాథన్ అంటే ఆయన ఒక అగ్రికల్చర్ సైంటిస్ట్​ మాత్రమే కాదు. మహామేధావి. కరువు కాలంలో ఎక్కువ దిగుబడి వచ్చే ధాన్యాన్ని పండించి దేశానికి వెన్నెముకలా నిలిచారు. గ్రీన్​ రివల్యూషన్ పేరుతో వ్యవసాయ రంగంలో ఒక విప్లవాన్నే సృష్టించారు. అందుకే ఆయన్ను ‘ఫాదర్ ఆఫ్​ గ్రీన్ రివల్యూషన్​’గా పిలుస్తారు. మరి ఆ రివల్యూషన్ వెనుక ఉన్న కథ ఏంటి? దానికి కారకులెవరు? అనేది తెలుసుకోవాలంటే చరిత్రలో కొన్ని పేజీలు తిరగేయాల్సిందే. 

అదే పెద్ద అవార్డ్

స్వామినాథన్‌ పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు. కానీ ఆయన అవార్డ్​లను పట్టించుకోరు. 1971లో రామన్‌ మెగసెసే అవార్డ్​,1986 రాబర్ట్‌ ఐన్‌స్టీన్‌ వరల్డ్‌ సైన్స్‌, 1991లో ఎన్విరాన్‌మెంటల్‌ అఛీవ్‌మెంట్‌ వంటి వందకుపైగా పురస్కారాలు పొందారు. దేశంలో అత్యున్నత పురస్కారాలైన పద్మశ్రీ, పద్మభూషణ్‌, పద్మవిభూషణ్‌ అందుకున్నారు. దేశంలో హరిత విప్లవంతో కోట్ల మందికి ఆహార భద్రత కల్పించినందుకు 1987లో ‘వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌’ దక్కింది. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ యూనివర్సిటీల నుంచి 84 గౌరవ డాక్టరేట్‌లను అందుకున్నారు. టైమ్ మ్యాగజైన్ ఆసియాలోని 20 మంది మోస్ట్​ ఎఫెక్టివ్​ పర్సన్స్​ లిస్ట్​లో స్వామినాథన్ ఒకరు. 


ఇవన్నీ పక్కన పెడితే... గ్రీన్ రివల్యూషన్​ని అనౌన్స్ చేసేటప్పుడు చాలామంది రైతులు ఆ సభకు వచ్చారు. అప్పుడు సీడ్ కో–ఆపరేటివ్ ఛైర్మన్, నాకు మెడల్​ వేయాలని ఇందిరా గాంధీని అడిగితే... అప్పుడామె చిరునవ్వుతో ‘దీనంతటికి ఇతనే కదా కారణం’ అన్నారట. ‘ఆ మాట అవార్డ్​ల కంటే ఎక్కువ అనిపించింది’ అంటారాయన. 

ఎన్డీటీవీ 25 వ వార్షికోత్సవ సభలో..

ఆగస్ట్ 15, 1947న మన పేపర్లలో ‘స్వాతంత్ర్యం సాధించాం’ అని నెహ్రూ ఇచ్చిన మొదటి స్పీచ్​ గురించి రాశారు. మొదటి పేజీ తిప్పగానే రెండో పేజీలో దేశం ఆహార సంక్షోభంలో ఉందనే వార్త ఉంది. పోలెన్ ఎర్లిక్ అనే ఫేమస్ పాపులేషన్ ఎక్స్​పర్ట్​ ‘ఇండియన్స్​కి ఫ్యూచర్​ లేదు’ అని చెప్పాడు. థర్మో న్యూక్లియర్ బాంబ్ వేయాల్సిన అవసరం కూడా లేదు అన్నాడు. మరొక ఎక్స్​పర్ట్ ‘స్లాటర్ హౌజ్​లో గొర్రెలు చచ్చినట్లు ఇండియన్స్ కూడా చనిపోతారు’ అని చెప్పాడు. అప్పుడు ‘మేం పొలిటికల్​ సపోర్ట్​తో సైంటిఫిక్​ ట్రాన్స్​ఫర్మేషన్​ తీసుకురావాలి’ అని నిర్ణయించుకున్నాం. ఇప్పుడు ఫుడ్​ సెక్యూరిటీ, నేషనల్ సావర్నిటీ రెండు ఒకదానికొకటి అంతర్భాగంగా పనిచేస్తున్నాయి. కాబట్టే బంగ్లాదేశ్, వియత్నాం వంటి దేశాలకు ఆహారం అందించడంలో సాయం చేయగలిగాం. ఇందిరా గాంధీ, వాజ్​పేయి టైంలో కూడా ఫుడ్ క్రైసిస్ వచ్చినప్పుడు ‘మీరు ఏ పథకాలైనా అమలు చేసే ముందు ఫుడ్ గురించి ఆలోచించండి’ అని చెప్పేవాళ్లం. నేటి యువతరం అగ్రికల్చర్​ మీద ఇంట్రెస్ట్​ చూపించట్లేదనే వెలితి ఉంది. అది చాలా కష్టమైన పని, తక్కువ సంపాదన వస్తుందనే ఆలోచనతో అగ్రికల్చర్​ వైపు ఆసక్తి చూపట్లేదు. భవిష్యత్తులో అయినా దేశాలు గ్రెయిన్స్ (ధాన్యం)తో ఉండాలి గానీ గన్స్​తో కాదని ఆశిస్తున్నా. ఎందుకంటే గన్స్​ కొనుక్కోవచ్చు. కానీ, ధాన్యాన్ని కొనలేం. 

ఎం.ఎస్ స్వామినాథన్