కవర్ స్టోరీ : మూడో ప్రళయం?

కవర్ స్టోరీ : మూడో ప్రళయం?

కొన్ని దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధాలు, కొన్ని దేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధాలు..  పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేండ్ల నుంచి జరుగుతున్న ఈ ప్రాంతీయ యుద్ధాలు కాస్తా మూడో ప్రపంచ యుద్ధంగా మారితే.. ప్రపంచంలో శక్తిమంతమైన రష్యా, అమెరికా, చైనా లాంటి దేశాలు ఆ యుద్ధంలో పాల్గొంటే.. అప్పుడు ప్రపంచం పరిస్థితి ఏంటి? ప్రజలు ఎటువంటి విపరీతమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది? అసలు అలాంటి భీకర యుద్ధం జరిగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? 

యుద్ధం ఓ దేశపు ఉనికిని చెరిపేస్తుంది. స్వేచ్ఛని హరిస్తుంది. రక్తపాతాన్ని సృష్టిస్తుంది. వీటన్నింటికీ మించి పేదరికాన్ని పెంచుతుంది. కరువుని మోసుకొస్తుంది. ఆకలి చావులకు కారణమవుతుంది. ఇలాంటి పరిస్థితులను చూడడం వల్లే అశోకుడు కళింగ యుద్ధం తర్వాత యుద్ధమే వద్దని శాంతి మార్గంలో నడిచాడు. ప్రపంచాన్ని జయించానని విర్రవీగిన అలెగ్జాండర్ కూడా చనిపోయేనాటికి పశ్చాత్తాపపడ్డాడు. తనతోపాటు ఏమీ తీసుకెళ్లడం లేదనే నిజం ప్రపంచానికి తెలిసేలా చేశాడు. గడిచిన వందేండ్లలో జరిగిన యుద్ధాలు కూడా ఇలాంటి పాఠాలనే నేర్పాయి. రెండు ప్రపంచ యుద్ధాలు హింసకు, అశాంతికి నిలువెత్తు సాక్ష్యాలుగా నిలిచాయి. ఆ నష్టాలు, కష్టాలు తెలిసినా.. ఇప్పటి దేశాధినేతలు ఎందుకు కయ్యానికి కాలు దువ్వుతున్నారు? ఈ యుద్ధ పరిస్థితులకు తెరదించే కాలం వస్తుందా? లేదంటే.. యుద్ధం తీసుకొచ్చే కష్టాలను ప్రపంచం ఎదుర్కోక తప్పదా?!


భూమ్మీద మనిషి మనుగడ మొదలైన నాటి నుంచి.. ఏవో ఒక రకమైన యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. కారణం ఏదైనా... ఇప్పటివరకు భూమ్మీద గుర్తించిన దాదాపు అన్ని నాగరికతల్లో యుద్ధాలు జరిగాయి. తిండి, అధికారం, విలువైన వస్తువు, జంతువులు, భూములు, ఆత్మగౌరవం, సార్వభౌమాధికారం.. ఇలా ఏదో ఒక కారణాన్ని చూపించి మనుషులు యుద్ధాలు చేస్తూనే ఉన్నారు. ఎంత పెద్ద సామ్రాజ్యమైనా యుద్ధ ముప్పు నుంచి తప్పించుకోలేకపోయింది. అందుకే ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యల్లో ‘యుద్ధం’ కూడా ఒకటి. ఇప్పటికీ ప్రపంచంలోని చాలా దేశాలు యుద్ధ భయంతోనే బతుకుతున్నాయి. ఆయా దేశాల మీదకి  ఎవరో దండెత్తి వస్తారనే భయం కాదు. ఏ దేశం... మరో దేశం మీద యుద్ధం ప్రకటించినా.. అది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల మీద ప్రభావం చూపిస్తుంది. అందుకే... ఆర్థిక స్థిరత్వం లేని చాలా దేశాలు ‘ఎప్పుడు? ఏం జరుగుతుందో?’ అని భయపడుతున్నాయి. 

ఎప్పటినుంచో... 

మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలు మానవ సమాజానికి మరిచిపోకూడని గుణపాఠాలు నేర్పించాయి. అందుకే రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక దాదాపు ప్రపంచం అంతటా శాంతి స్థాపన జరిగింది. కానీ.. తర్వాత ఐదేండ్లలోనే కొరియన్ యుద్ధం (1950–1953) జరిగింది. ఆ తర్వాత వియత్నాం, అఫ్గానిస్తాన్‌‌‌‌, భారత్‌‌‌‌– పాకిస్తాన్‌‌‌‌ యుద్ధాలు.. ఇలా ఎన్నో జరిగాయి. అయితే... 2012 తర్వాత మాత్రం ఈ యుద్ధ సంస్కృతి విపరీతంగా పెరుగుతోంది. లిబియా – సిరియా యుద్ధం, అరబ్ తిరుగుబాట్లు జరిగాయి. ఆ తర్వాత అజర్‌‌‌‌బైజాన్–అర్మేనియన్ యుద్ధం 2023లో జరిగిన పరిణామాలు... ఇప్పటికీ యుద్ధం నీడన ఉన్న మయన్మార్​, ఉక్రెయిన్‌‌‌‌పై రష్యా దాడి.. సుడాన్, గాజాల్లో జరుగుతున్న పరిణామాలు.. ఈ రెండు దశాబ్దాల్లో జరిగిన యుద్ధాల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. 


జర్మనీ పోలాండ్‌పై దాడి చేయడం రెండో ప్రపంచ యుద్ధానికి కారణమైనట్టు.. ఈ మధ్య జరిగిన కొన్ని పరిణామాలు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయని చాలామంది అంచనా వేశారు. కొన్నాళ్ల నుంచి ఉత్తరకొరియా–దక్షిణ కొరియా మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. వరుస క్షిపణి ప్రయోగాలతో ఉత్తర కొరియా కవ్విస్తోంది. పాలస్తీనాపై దాడి వివాదం ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలకు దారి తీసింది. ఇజ్రాయెల్‌‌‌‌పై ఇరాన్ డ్రోన్ దాడులు చేసింది. మరోవైపు ఉక్రెయిన్‌‌‌‌–రష్యా యుద్ధం జరుగుతోంది. 
 

హమాస్ సంఘర్షణతో ఇజ్రాయెల్‌‌‌‌ బలాన్ని పెంచుకుంటోంది. ఇరాన్ వెపన్‌‌‌‌ -గ్రేడ్ యురేనియం నిల్వలు పెంచుకుంటోంది. రష్యాకు వ్యతిరేకంగా నాటో ఉక్రెయిన్‌‌‌‌కు సపోర్ట్‌‌‌‌ చేస్తోంది. చైనాకు వ్యతిరేకంగా తైవాన్‌‌‌‌కు అమెరికా సపోర్ట్‌‌‌‌ చేస్తోంది. ఇవన్నీ ‘‘మూడో  ప్రపంచ యుద్ధం జరగబోతుందా?” అనే చర్చకు ప్రధాన కారణాలు. గతంలోనే సోవియట్ యూనియన్, యునైటెడ్ స్టేట్స్, నాటో దళాల మధ్య వైరం వల్ల ప్రపంచం అనేకసార్లు యుద్ధం అంచుకు వెళ్లి వచ్చింది. దౌత్య సహకారం, ఐక్యరాజ్యసమితి, తోటి దేశాలు కలగజేసుకోవడం వల్ల మూడో ప్రపంచ యుద్ధాన్ని నిరోధించడం వీలుపడింది.  

ఉక్రెయిన్‌‌‌‌ - రష్యా వివాదం 

ప్రపంచంలోని అత్యంత బలమైన సైనిక, ఆయుధ శక్తి ఉన్న దేశాల లిస్ట్‌‌‌‌లో రష్యా ముందు వరుసలో ఉంటుంది. అందుకే అమెరికా సహా ఎన్ని దేశాలు ఉక్రెయిన్‌‌‌‌కు సపోర్ట్‌‌‌‌ చేసినా భయపడడం లేదు. అలాగని ఉక్రెయిన్‌‌‌‌కి సపోర్ట్‌‌‌‌ చేసే దేశాలు కూడా నేరుగా రష్యాని టార్గెట్‌‌‌‌ చేయడంలేదు. అందుకే ఇప్పటివరకు పరిస్థితి అదుపు తప్పలేదు. అమెరికా లేదా నాటో రష్యాలో నేరుగా ఒక్క బాంబు పేల్చినా.. అక్కడ పుట్టిన నిప్పు దావానంలా వ్యాపించి ఈపాటికి ఎన్నో దేశాలను కాల్చేసేది.  


వాస్తవానికి ఉక్రెయిన్‌‌‌‌ యుద్ధం 2022 ఫిబ్రవరిలో మొదలైనా.. 2014 నుంచే ఈ రెండు దేశాల మధ్య వైరం మొదలైంది. ఒకటి రెండు కాదు... ఈ యుద్ధానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే.. ఉక్రెయిన్‌‌‌‌ నాటోలో చేరేందుకు తీవ్రంగా ప్రయత్నించడమే తక్షణ కారణం. ఈ యుద్ధం మొదలుపెట్టినప్పుడు పుతిన్ అనుకున్నది ఒకటి. ఇప్పుడు జరుగుతున్నది మరొకటి. రష్యా దళాలు ఉక్రెయిన్‌‌‌‌పై దాడి చేసినప్పుడు పుతిన్‌‌‌‌ ఉక్రేనియన్ దళాల సంకల్పాన్ని తప్పుగా అంచనా వేశాడు. కొన్ని రోజుల్లోనే ఉక్రెయిన్‌‌‌‌ లొంగిపోతుందని భావించాడు. కానీ.. చిన్న దేశమైనా నాటో, ఇతర దేశాల సాయంతో ఇప్పటికీ నిలదొక్కుకుని నిలబడుతోంది ఉక్రెయిన్‌‌‌‌. 

యుద్ధం మొదలయ్యాక 2022 మార్చిలో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఉక్రెయిన్‌‌‌‌పై రష్యా దాడిని నిరసిస్తూ తీర్మానం కోసం ఓటింగ్ చేశారు. దానికి141 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. అయిదు దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి. 47 దేశాలు గైర్హాజరయ్యాయి. రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి 37 దేశాలు ఆర్థిక ఆంక్షలు విధించాయి. యూరోపియన్‌‌‌‌ యూనియన్‌‌‌‌లోని 27 సభ్య దేశాలు, అమెరికా, బ్రిటన్‌‌‌‌, కెనడా, నార్వేలు ఉక్రెయిన్‌‌‌‌కు సాయం చేశాయి. 


రష్యాను అంతలా వ్యతిరేకించినా ఏ దేశమూ నేరుగా యుద్ధానికి దిగలేదు. అయితే.. కొన్నాళ్ల నుంచి కొన్ని దేశాలు రష్యాకు కూడా సపోర్ట్ చేస్తున్నాయి. చైనా ప్రభుత్వం రష్యాకు సాయం చేస్తోంది. బెలారస్ దేశం రష్యన్ దళాలకు స్టేజింగ్ పాయింట్‌‌‌‌గా ఉపయోగపడింది. ఇరాన్ తక్కువ ధరకు డ్రోన్‌‌‌‌లను సరఫరా చేస్తోంది. ఉత్తర కొరియా పుతిన్‌‌‌‌కు రాకెట్లు, ఫిరంగి షెల్స్‌‌‌‌ని సరఫరా చేస్తోంది. ఈ పనులన్నీ చూసేవాళ్లకు అమెరికాని కవ్విస్తున్నట్టుగానే కనిపిస్తుంది. 

భయంతోనే...

ఉక్రెయిన్‌‌‌‌పై రష్యా దాడి చేసిన కొత్తలో తప్పదు అనుకుంటే అణ్వాయుధాలను  ఉపయోగిస్తానని పుతిన్ బెదిరించాడు. కానీ.. ఇప్పటివరకు ఆ పని చేయలేదు. ఎందుకంటే.. దాని వల్ల జరిగే విధ్వంసం గురించి పుతిన్‌‌‌‌కు బాగా తెలుసు. కాకపోతే.. ఉక్రెయిన్‌‌‌‌కు సాయం చేసే దేశాలను భయపెట్టాలనే ఉద్దేశంతోనే అలాంటి మాటలు మాట్లాడాడు. కానీ.. వెంటనే రష్యా అణ్వాయుధాలు ఉపయోగిస్తే.. సహించేది లేదని యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ యూనియన్, నాటో హెచ్చరించాయి. 

రష్యా ఎలాంటి అణ్వాయుధాలను ప్రయోగించినా దానికి గట్టి సమాధానం వస్తుందన్నాయి.  ముఖ్యంగా అమెరికా, నాటోలు రష్యా అణ్వాయుధ దాడికి దీటుగా తమ సొంత అణ్వాయుధాలను ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టంగా చెప్పాయి. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో. ఇప్పటికే రెండు లక్షలపైచిలుకు సైనికులు చనిపోయినట్టు అంచనాలు ఉన్నాయి. ఉక్రెయిన్‌‌‌‌లో కోటీ 80 లక్షల మందికి మానవతా సాయం అవసరమైంది. దాదాపు 80 లక్షల మంది ఇండ్లు విడిచిపెట్టి మరో ప్రాంతానికి, కొందరు వేరే దేశానికి వెళ్లిపోయారు.

ఇరాన్‌‌‌‌పై ఇజ్రాయెల్ దాడి 

ఇరాన్‌ అణ్వాయుధాలను తయారు చేసేందుకు కావాల్సిన వెపన్‌ గ్రేడ్‌ యురేనియం ప్రొడక్షన్‌ని పెంచింది. అందుకే ఇరాన్ మీద చాలా దేశాలు ఫోకస్‌‌‌‌ చేశాయి. ఇరాన్‌‌‌‌ దగ్గర అంతలా యురేనియం నిల్వలు ఉండడం దాని శత్రు దేశాలకు అంత సేఫ్‌‌‌‌ కాదు. 

2023 జనవరిలో ఇరాన్‌‌‌‌లోని ఇస్ఫాహాన్‌‌‌‌లోని ఆయుధ ఉత్పత్తి కేంద్రం దగ్గర్లో అర్ధరాత్రి దాటిన తర్వాత డ్రోన్లు కనిపించాయి. వాటిని ఇజ్రాయెల్ పంపిందనే ఆరోపణలు వచ్చాయి. వాటిని ఇరాన్‌ వాయు రక్షణ వ్యవస్థ నాశనం చేసింది. ఆ డ్రోన్లను ఇరాన్ అణుశక్తి గురించి తెలుసుకునేందుకు ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొస్సాద్ పంపిందని కూడా ఆరోపణలు వచ్చాయి. 

ఇజ్రాయెల్‌–పాలస్తీనా

ఇజ్రాయెల్‌ – పాలస్తీనా సమస్య ఈనాటిది కాదు. కొన్ని దశాబ్దాల నుంచి ఈ రెండు దేశాల మధ్య వైరం ఉంది. వీటి మధ్య గతంలో యుద్ధాలు కూడా జరిగాయి. చాలా ఏండ్ల నుంచి ఈ రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. ఇజ్రాయెల్‌కు నెతన్యాహు అధ్యక్షుడు అయ్యాక సరిహద్దుల్లో గొడవలు పెరిగాయి. దాంతో 2023 అక్టోబర్‌‌ 7న హమాస్ సంస్థకు చెందిన కొందరు తీవ్రవాదులు పాలస్తీనాలోని గాజా స్ట్రిప్ నుంచి వెళ్లి దక్షిణ ఇజ్రాయెల్‌పై ఆకస్మిక దాడి చేశారు. సుమారు1,200 మంది ఇజ్రాయెల్‌ పౌరులను చంపి, కొంతమందిని బందీలుగా తీసుకెళ్లారు. దాంతో హమాస్‌ తీవ్రవాదుల స్థావరంగా ఉన్న గాజాపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు చేసింది. దాంతో రెండింటి మధ్య యుద్ధం మొదలైంది. ఈ గొడవల్లో పదివేల కంటే ఎక్కువమంది పాలస్తీనియన్లు చనిపోయారు. దాదాపు రెండు మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కూడా ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ.. ఏవీ ఫలించడంలేదు.

డ్రోన్లతో దాడి

గత అక్టోబరు నుంచి గాజాపై ఇజ్రాయెల్ ప్రతీకారదాడులు చేస్తూనే ఉంది. ఈ సంక్షోభంలోకి ఇప్పుడు ఇరాన్ వచ్చి చేరింది. హమాస్‌‌‌‌కు ఇరాన్ ఆర్థిక, ఆయుధ సాయం అందిస్తోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. సిరియాలో ఇజ్రాయిల్ దాడిలో ఇరాన్ అధికారులు చనిపోవడంతో ప్రతీకారంగా ఇరాన్ డ్రోన్లతో ఇజ్రాయెల్‌‌‌‌పై దాడి చేసింది. దాంతో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. ఈ రెండు దేశాలకు మరికొన్ని దేశాల సాయం అందుతోంది. 

అమెరికాతో కూడా కయ్యం

కొన్నేండ్ల క్రితం ఇరాన్‌‌‌‌ అమెరికాతో కయ్యం కొని తెచ్చుకుంది. 1979లో ఇరాన్‌‌‌‌లోని ఉగ్రవాదులు టెహ్రాన్‌‌‌‌లోని యుఎస్ ఎంబసీని ఆక్రమించి 52 మంది అమెరికన్లను బందీలుగా చేశారు. 444 రోజులు పైగా వాళ్లను  నిర్బంధంలో ఉంచారు. దాంతో1980లో అమెరికా ఇరాన్‌‌‌‌తో దౌత్య సంబంధాలను తెంచుకుంది. ఇప్పుడు కూడా ఈ రెండు దేశాల మధ్య అంత మంచి సంబంధాలు లేవు. కాబట్టి ఇరాన్–ఇజ్రాయెల్‌‌‌‌ మధ్య యుద్ధం వస్తే.. అమెరికా కలుగజేసుకునే అవకాశాలే ఎక్కువ. 

తైవాన్‌‌‌‌ యుద్ధం

అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) డైరెక్టర్ విలియం బర్న్స్.. ‘2027 నాటికి తైవాన్‌‌‌‌పై విజయవంతంగా దండయాత్ర చేయడానికి సిద్ధంగా ఉండాలని’ చైనా అధ్యక్షుడు జిన్‌‌‌‌పింగ్ ఆ దేశ సైన్యాన్ని ఆదేశించినట్లు చెప్పాడు. ఇది కాని నిజమైతే.. 2027లో యుద్ధం వచ్చే ముప్పు చాలానే ఉంది. తైవాన్ చిన్న దేశమే. కానీ.. దాని ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది. పైగా అమెరికాతో చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ (సీసీపీ) తైవాన్‌‌‌‌ను చైనాలో భాగమే అని వాదిస్తోంది. తైవాన్‌‌‌‌ను చైనాలో కలపడానికి అవసరమైతే సైనిక బలగాలను ఉపయోగిస్తామని కూడా చైనా ప్రభుత్వం చెప్పింది. తైవాన్‌‌‌‌పై దాడి జరిగితే.. ఆ ప్రభావం జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, పసిఫిక్‌‌‌‌లోని మెజారిటీ ఆసియా దేశాలపై పడు తుంది. కాబట్టి అవన్నీ తైవాన్‌‌‌‌కు అండగా నిలుస్తాయి. 

లిటిల్ రాకెట్ మ్యాన్

ఉత్తర కొరియా కొన్నేళ్లుగా అణ్వాయుధాలను, బాలిస్టిక్ క్షిపణులను డెవలప్​ చేస్తోంది. యునైటెడ్ స్టేట్స్, దాని మిత్రదేశాలకు వ్యతిరేకంగా వాటిని ఉపయోగిస్తామని పదేపదే బెదిరిస్తోంది. 2017లో ఉత్తర కొరియా, అమెరికా మధ్య ఉద్రిక్తతలు విపరీతంగా పెరిగాయి. ఆ తర్వాత కూడా ఉత్తర కొరియా అధినేత కిమ్ అమెరికాను రెచ్చగొడుతూనే ఉన్నాడు. 

విరోధం

భారత్‌‌‌‌, పాకిస్తాన్‌‌‌‌ల మధ్య చాలా కాలంగా విరోధం ఉంది. రెండు దేశాల దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి.1947 దేశ విభజన తర్వాత మనకు, పాకిస్తాన్‌‌‌‌కు మూడు యుద్ధాలు జరిగాయి. 2019లో కాశ్మీర్‌‌‌‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 40 మంది భారత సైనికులు చనిపోయారు. ఇది రెండు దేశాల మధ్య  ఘర్షణకు దారితీసింది. తర్వాత పరిస్థితులు చక్కబడ్డాయి. 

యుద్ధం వస్తే.. 

ప్రపంచ యుద్ధం అంటే ఆషామాషీ విషయం కాదు. ఆ విధ్వంసాన్ని భరించడం అంత ఈజీ కాదు. మొదటి ప్రపంచ యుద్ధంలో నాలుగు కోట్ల మంది పౌరులు, సైనికులు చనిపోయారు. రెండో ప్రపంచ యుద్ధంలో దాదాపు ఆరు కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. యుద్ధం వల్ల వచ్చిన అనారోగ్యం, కరువు వల్ల ఎంతోమంది ఇబ్బందిపడ్డారు. ఈ రెండు యుద్ధాల తర్వాత ప్రపంచం టెక్నాలజీలో చాలా డెవలప్‌‌‌‌ అయ్యింది. ముఖ్యంగా చాలా దేశాలు కొత్త కొత్త ఆయుధాలు సమకూర్చుకున్నాయి. ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం వస్తే.. ఆ ఆయుధాలన్నీ వాడితే.. ప్రపంచ మనుగడకు ముప్పు తప్పదు.

*   *   *

అణుయుద్ధంగా మారితే?

ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం వస్తే.. అది కచ్చితంగా అణుయుద్ధంగానే మారుతుంది. అంటే ప్రపంచమంతా హిరోషిమా, నాగసాకికి పట్టిన గతే పడుతుంది. ప్రకృతి కోలుకోలేని దెబ్బ తింటుంది. అసలు జీవి మనుగడే సాధ్యం కాకపోవచ్చు. ఇక ప్రాణ నష్టాన్ని అంచనా కూడా వేయలేం. ఎందుకంటే పెద్ద దేశాల యుద్ధ సామర్థ్యం మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలతో పోలిస్తే చాలా ఎక్కువ. చాలా దేశాల దగ్గర కావాల్సినంత అణుశక్తి ఉంది. 

విధ్వంసమే

అణ్వాయుధాలు మనుషులు కనిపెట్టిన అత్యంత శక్తివంతమైన, విధ్వంసక ఆయుధాలు. ఇవి అంతులేని శక్తిని విడుదల చేస్తాయి. దాంతో భారీ పేలుళ్లు జరగడంతోపాటు రేడియేషన్‌‌‌‌ ఏర్పడుతుంది. అమెరికా1945లో జపాన్‌‌‌‌ మీద ఈ అణ్వాయుధాలను రెండుసార్లు ప్రయోగించింది. ఆ తరువాత మళ్లీ ఏ దేశమూ ప్రయోగించే ధైర్యం చేయలేదు. కానీ.. అప్పటినుండి కొన్ని దేశాలు వందల సార్లు పరీక్షించాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కేవలం తొమ్మిది దేశాల దగ్గరే అణ్వాయుధాలు ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్, రష్యా, చైనా, ఫ్రాన్స్, యూకే, ఇండియా, పాకిస్తాన్, ఇజ్రాయెల్, ఉత్తర కొరియా వీటిలో కొన్ని దేశాలు అధికారికంగా అణు ఆయుధాల వ్యాప్తి నిరోధక ఒప్పందం (న్యూక్లియర్‌‌‌‌‌‌‌‌ నాన్‌‌‌‌ ప్రొలిఫరేషన్‌‌‌‌ ట్రీటీ(ఎన్‌‌‌‌పీటీ)) ద్వారా అణ్వాయుధ దేశాలుగా గుర్తింపు పొందాయి. ఎన్‌‌‌‌పీటీ అనేది అణ్వాయుధాల వ్యాప్తిని నిరోధించడానికి, అణుశక్తిని శాంతియుత ప్రయోజనాలకు వాడేలా ప్రోత్సహించడానికి చేసుకున్న అంతర్జాతీయ ఒప్పందం. అయితే, కొన్ని దేశాలు ఈ ఒప్పందంపై సంతకం చేయలేదు. 

అణ్వాయుధాల రకాలు

అణ్వాయుధాలను నగరాలు లేదా సైనిక స్థావరాలను టార్గెట్‌‌‌‌ చేసుకుని ప్రయోగిస్తుంటారు. ఎక్కడినుంచైనా ప్రయోగించవచ్చు. ఇవి సైజులో కూడా చిన్నగా ఉంటాయి. అణ్వాయుధాల్లో ప్రాథమికంగా రెండు రకాలు ఉన్నాయి. మొదటిది ఫిషన్ బాంబులు (వీటిని అణు బాంబులు అని కూడా పిలుస్తారు). రెండోది ఫ్యూజన్ బాంబులు (హైడ్రోజన్ బాంబులు లేదా థర్మోన్యూక్లియర్ బాంబులు అని కూడా పిలుస్తారు). మొదటి రకం బాంబులు శక్తిని విడుదల చేయడానికి అణు విచ్ఛిత్తి ప్రక్రియపై ఆధారపడతాయి. ఫ్యూజన్ బాంబులు న్యూక్లియర్ ఫ్యూజన్, లేదా న్యూక్లియర్ ఫిషన్ రియాక్షన్లను కలిపి మరింత శక్తివంతమైన పేలుళ్లకు దారి తీస్తాయి. 

లీసెస్టర్ యూనివర్సిటీ రికార్డుల ప్రకారం.. 1945లో హిరోషిమా, నాగసాకిపై వేసిన రెండు అణు బాంబులు దాదాపు రెండు లక్షల మందిని చంపాయి. ఇప్పుడు అందుబాటులో ఉన్న బాంబులు వాటికంటే ప్రమాదకరమైనవి. 1961లో సోవియట్ యూనియన్‌‌‌‌ అత్యంత శక్తివంతమైన అణ్వాయుధాన్ని పరీక్షించింది. హిరోషిమా, నాగసాకిపై వేసిన బాంబు కంటే ఇది 3000 రెట్లు ఎక్కువ శక్తివంతమైనది.

నాశనం చేస్తాయి

అమెరికా, రష్యాల దగ్గర ఉన్న అణ్వాయుధాలతోనే కొన్ని కోట్ల మందిని చంపేయొచ్చు. అణ్వాయుధాలు ఉపయోగించినప్పుడు పది సెకండ్లలోనే విధ్వంసం జరుగుతుంది. వేడి, రేడియేషన్ అప్పటికప్పుడు ప్రాణాలు తీసేస్తాయి. గంటకు కొన్ని వందల కిలోమీటర్ల వేగంతో షాక్ వేవ్ వస్తుంది. ఒకవేళ పేలుడు నుంచి ప్రాణాలతో బయటపడినా.. ఊపిరితిత్తులు, చెవులు దెబ్బతింటాయి. ఇంటర్నల్‌‌‌‌ బ్లీడింగ్‌‌‌‌ అవుతుంది. థర్మల్ రేడియేషన్ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. విపరీతమైన వేడి వల్ల జీవం ఉన్న ప్రతి ప్రాణి చనిపోతుంది. వాతావరణంలో ఆక్సిజన్ తగ్గిపోతుంది. 

ఆ తర్వాత కూడా...

 అణ్వాయుధాలు ప్రయోగించిన తర్వాత చాలా ఏండ్ల పాటు దాని ప్రభావం ఉంటుంది. అయోనైజింగ్ రేడియేషన్‌‌‌‌ ఉత్పత్తి అవుతుంది. దీని వల్ల అనారోగ్య సమస్యలు చాలా వస్తాయి. పర్యావరణం కలుషితం అవుతుంది. క్యాన్సర్, జన్యుపరమైన ఇబ్బందులు ఉంటాయి. 1945 నుంచి చేసిన అణు పరీక్షల వల్లే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.4 మిలియన్ల మంది  క్యాన్సర్‌‌‌‌ బారిన పడతారని డాక్టర్లు అంచనా వేశారు. అంతేకాదు.. ప్రపంచంలో ఇప్పటివరకు రెడీ చేసిన అణ్వాయుధాల్లో ఒక శాతం వాడినా వాతావరణానికి చాలా పెద్ద ముప్పు కలుగుతుంది. దాదాపు రెండు బిలియన్ల మంది ప్రజలు ఆకలితో అలమటించే ప్రమాదం ఉంది. పర్యావరణ వ్యవస్థ నాశనం అవుతుంది. అణుబాంబు పడిన ప్రదేశం చాలా ఏండ్ల వరకు మనుషులు ఉండేందుకు పనికిరాదు. కాబట్టి లక్షల మంది ప్రజలు శరణార్థులు అవుతారు. ఘోరమైన కరువు, గ్లోబల్ వార్మింగ్‌‌‌‌ తప్పదు. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు, పేద దేశాలు ఈ యుద్ధం వల్ల ఎక్కువ నష్టపోతాయి. 

అమెరికా

రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అణ్వాయుధాలను డెవలప్‌‌‌‌ చేసి, ఉపయోగించిన మొదటి దేశం అమెరికా. ఇది1945 జూలై 16న న్యూ మెక్సికోలో మొదటి అణు పరీక్ష చేసింది. ఆ తర్వాత నెలలోనే హిరోషిమా, నాగసాకిపై అణుబాంబులు వేసింది.ఇప్పుడు అణ్వాయుధాలను ప్రయోగిస్తే.. ఏం జరుగుతుందో అన్ని దేశాలకు తెలుసు. కాబట్టి అలాంటి పనులు చేయడానికి ఏ దేశమూ అంత ఈజీగా ముందుకు రాదు. కానీ.. అన్ని దేశాలు అణ్వాయుధాల సామర్థ్యాన్ని పెంచుకోవాలి అనుకుంటున్నాయి. దానికి కారణం.. మిగతా దేశాలు ఆ దేశం జోలికి వెళ్లకుండా ఉంటాయనే. ఇలా ఆలోచించే దేశాల్లో అమెరికా ముందు వరుసలో ఉంటుంది. అందుకే ఈ రేసులో అదే ముందుంది. ఆ బలంతోనే దాడులు లేదా బెదిరింపుల్లాంటివి చేయకుండా ఇతర దేశాలను కట్టడి చేస్తోంది.  

స్టాక్‌‌‌‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ప్రకారం.. 2023 నాటికి అమెరికా దగ్గర 5,244 అణు వార్‌‌‌‌హెడ్‌‌‌‌లు ఉన్నాయని అంచనా. అందులో 1,750 ఆపరేషనల్‌‌‌‌ ఫోర్సెస్‌‌‌‌ దగ్గర ఉన్నాయి. వాటిలో ల్యాండ్‌‌‌‌ బేస్‌‌‌‌డ్‌‌‌‌ ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్స్‌‌‌‌(ఐసీబీఎం), సబ్‌‌‌‌మెరైన్‌‌‌‌ లాంచ్‌‌‌‌డ్‌‌‌‌ బాలిస్టిక్ మిస్సైల్స్‌‌‌‌(ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌బీఎం), స్ట్రాటిజిక్ బాంబర్లు ఉన్నాయి. అణు భాగస్వామ్య ఒప్పందం కింద బెల్జియం, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, టర్కీ లాంటి కొన్ని నాటో మిత్రదేశాలతో అమెరికా అణ్వాయుధాలను పంచుకుంటుంది. 

రష్యా

అణ్వాయుధాలను డెవలప్‌‌‌‌ చేసి పరీక్షించిన రెండో దేశం సోవియట్ యూనియన్. రష్యా1949లోనే ఈ ఆయుధాలని పరీక్షించింది. అప్పటినుంచే ఇది అమెరికాకు ప్రధాన ప్రత్యర్థిగా మారింది. రెండు అగ్రరాజ్యాలు అణు ఆధిపత్యం కోసం విపరీతంగా పోటీపడ్డాయి. భారీ ఆయుధాలను నిర్మించడం, పరీక్షించడం లాంటివి చేశాయి. సోవియట్ యూనియన్ 1959లో మొదటి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ఆర్‌‌‌‌‌‌‌‌–7ను డెవలప్‌‌‌‌ చేసింది. 


స్టాక్‌‌‌‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ప్రకారం.. రష్యా దగ్గర 2023 నాటికి 5,889 అణు వార్‌‌‌‌హెడ్‌‌‌‌లు ఉన్నాయని అంచనా. వాటిలో 1,572 ఆపరేషనల్ ఫోర్సెస్‌‌‌‌ దగ్గర ఉన్నాయి. ల్యాండ్‌‌‌‌ బేస్‌‌‌‌డ్‌‌‌‌, సీ బేస్‌‌‌‌డ్‌‌‌‌, ఎయిర్‌‌‌‌‌‌‌‌ బేస్డ్‌‌‌‌ డెలివరీ వ్యవస్థలు ఉన్నాయి. రష్యా న్యూక్లియర్‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీని కూడా బాగా పెంచుకుంటోంది. హైపర్‌‌‌‌సోనిక్ క్షిపణులు, అణుశక్తితో నడిచే క్రూయిజ్ క్షిపణులు, న్యూక్లియర్ టార్పెడోలు లాంటి కొత్త తరం ఆయుధాలను డెవలప్‌‌‌‌ చేస్తోంది.

చైనా

1964లో అణ్వాయుధాలను డెవలప్‌‌‌‌ చేసి, పరీక్షించింది. తర్వాత థర్మోన్యూక్లియర్ వెపన్‌‌‌‌ని, హైడ్రోజన్ బాంబును కూడా డెవలప్ చేసింది. అన్ని దేశాల్లాగే చైనా కూడా ‘నో ఫస్ట్ యూజ్’ పాలసీని ప్రకటించింది. అంటే ముందుగా తమపై దాడి చేస్తే తప్ప అణ్వాయుధాలను ఉపయోగించదు. కానీ.. ఎప్పుడూ దాని పొరుగు దేశాలైన ఇండియా, జపాన్, తైవాన్‌‌‌‌తోపాటు అమెరికాతో కయ్యానికి కాలు దువ్వుతోంది. 


స్టాక్‌‌‌‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ప్రకారం.. 2023 నాటికి చైనా దగ్గర 410 న్యూక్లియర్ వార్‌‌‌‌హెడ్‌‌‌‌లు ఉన్నాయని అంచనా. వాటిలో ఏవీ ఆపరేషనల్‌‌‌‌ దళాల దగ్గర లేవు. చైనాలో కూడా ల్యాండ్‌‌‌‌, సీ బేస్డ్‌‌‌‌ వెపన్స్ ఉన్నాయి. న్యూక్లియర్​ టెక్నాలజీని బాగా పెంచుకుంటోంది. మల్టిపుల్‌‌‌‌ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్‌‌‌‌ రీఎంట్రీ వెహికల్స్, రోడ్–మొబైల్ మిస్సైల్స్‌‌‌‌, బాలిస్టిక్ మిస్సైల్స్‌‌‌‌ని బాగా డెవలప్‌‌‌‌ చేయడంతోపాటు డెలివరీ వ్యవస్థలను బలంగా మార్చుకుంటోంది. 

ఫ్రాన్స్

ఫ్రాన్స్ తన జాతీయ సార్వభౌమాధికారం, స్వాతంత్య్రాన్ని కాపాడుకునేందుకే అణ్వాయుధాలను  తయారుచేస్తోంది.1968లో  ఫ్రాన్స్ థర్మోన్యూక్లియర్ వెపన్‌‌‌‌ని కూడా డెవలప్‌‌‌‌ చేసింది. జీవ, రసాయన ఆయుధాల విషయంలో మినహాయించి.. ఫ్రాన్స్ కూడా ‘నో ఫస్ట్ యూజ్ పాలసీ’ని ప్రకటించింది. ఫ్రాన్స్ అమెరికాకు మంచి మిత్రదేశంగా, యూరోపియన్ యూనియన్‌‌‌‌లో అగ్రగామిగా ఉంది. 


స్టాక్‌‌‌‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ప్రకారం.. 2023 నాటికి ఫ్రాన్స్ దగ్గర 290 న్యూక్లియర్ వార్‌‌‌‌హెడ్‌‌‌‌లు ఉన్నాయని అంచనా. వాటిలో 200 ఆపరేషనల్‌‌‌‌ దళాల దగ్గర ఉన్నాయి. ఫ్రాన్స్‌‌‌‌లో న్యూక్లియర్ డయాడ్ ఉంది. అంటే ఇది సీ బేస్డ్‌‌‌‌, ఎయిర్‌‌‌‌‌‌‌‌ బేస్డ్‌‌‌‌ వ్యవస్థల ద్వారా అణ్వాయుధాలను ప్రయోగించగలదు. ప్రస్తుతం ఫ్రాన్స్ కొత్త తరం సబ్‌‌‌‌మెరైన్స్‌‌‌‌, క్షిపణులను డెవలప్‌‌‌‌ చేస్తోంది.

యూకే

యునైటెడ్ కింగ్‌‌‌‌డమ్ 1952లో అణ్వాయుధాలను డెవలప్‌‌‌‌ చేసింది. 1957లో మొదటి థర్మోన్యూక్లియర్ ఆయుధాన్ని డెవలప్‌‌‌‌ చేసింది. ఇది కూడా ‘నో ఫస్ట్–యూజ్ పాలసీ’ని ప్రకటించింది. అమెరికాతో  సన్నిహితంగా ఉంటోంది.  నాటో, యూరోపియన్ యూనియన్‌‌‌‌లో ప్రధాన సభ్యదేశంగా ఉంది. ఇరాక్, అఫ్గానిస్తాన్, సిరియా లాంటి అనేక అంతర్జాతీయ సంఘర్షణల్లో పాలుపంచుకుంది. 

స్టాక్‌‌‌‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ప్రకారం.. యూకేలో 2023 నాటికి 225 అణు వార్‌‌‌‌హెడ్లు ఉన్నాయని అంచనా. వాటిలో 120 ఆపరేషనల్‌‌‌‌ దళాల దగ్గర ఉన్నాయి. ఈ దేశంలో న్యూక్లియర్ మొనాడ్ ఉంది. అంటే సముద్ర ఆధారిత వ్యవస్థల ద్వారా మాత్రమే అణ్వాయుధాలను ప్రయోగించగలదు. 

ఇండియా

భారత దేశం1974లో అణ్వాయుధాలను డెవలప్‌‌‌‌ చేసింది. ముఖ్యంగా 1962లో చైనాతో, 1965, 1971లో పాకిస్తాన్‌‌‌‌తో యుద్ధాల తర్వాత మొదటి థర్మోన్యూక్లియర్‌‌‌‌ను డెవలప్‌‌‌‌ చేసింది. ఇండియా పొరుగు దేశాల దూకుడుని కంట్రోల్‌‌‌‌ చేయడానికి మాత్రమే అణుశక్తిని మెయింటెయిన్‌‌‌‌ చేస్తోంది. అంతేకానీ.. ఏ దేశం మీద ప్రయోగించే ఉద్దేశం ఇండియాకు లేదు. మనదేశం కూడా నో ఫస్ట్ యూజ్ పాలసీ ప్రకటించింది. కానీ.. జీవ లేదా రసాయన ఆయుధాల విషయంలో కొన్ని మినహాయింపులు ఉన్నాయి. దక్షిణాసియా ప్రాంతంలో భారతదేశం ఆర్థిక, సైనిక శక్తిగా ఎదుగుతుండడంతో చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి పొరుగు దేశాలతో అనేక వివాదాలు వస్తున్నాయి. 


ఎస్‌‌‌‌ఐపీఆర్‌‌‌‌‌‌‌‌ఐ ప్రకారం.. 2023 నాటికి మన దగ్గర164 అణు వార్‌‌‌‌హెడ్లు ఉన్నాయని అంచనా. వాటిలో ఏవీ ఆపరేషనల్‌‌‌‌ బలగాల దగ్గర లేవు. మన దగ్గర కూడా భూమ్మీద, సముద్రం, గాల్లో పనిచేసే వ్యవస్థలు ఉన్నాయి. మల్టీ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్‌‌‌‌ రీ ఎంట్రీ వెహికల్స్‌‌‌‌, రోడ్ మొబైల్ మిస్సైల్స్‌‌‌‌, బాలిస్టిక్ మిస్సైల్స్‌‌‌‌ ఉన్నాయి. 

*   *   *

బయో వార్ భయం

మూడో ప్రపంచ యుద్ధం జరిగితే.. అది బాంబులు, వెపన్‌‌‌‌లతోనే ఆగిపోదు. ‘బయోవార్‌‌‌‌’‌‌‌‌ జరిగే ప్రమాదం కూడా ఉంది. బయోవార్‌‌‌‌‌‌‌‌ అంటే.. బ్యాక్టీరియా, వైరస్‌‌‌‌లు, రికెట్సియా, శిలీంధ్రాలు, టాక్సిన్స్ లేదా ఇతర జీవసంబంధ ఏజెంట్లు, వ్యాధి కారకాలను ఒక దేశం మరో దేశం మీద ప్రయోగించి అక్కడి ప్రజలు లేదా మొక్కలు, జంతువులు లాంటి వాటికి హాని కలిగించడం. వాస్తవానికి నేరుగా సైనికులు తలపడి యుద్ధం చేసిన దాని కంటే.. బయోవార్ చాలా ప్రమాదకరం. దీనివల్లే ఎక్కువమంది చనిపోయే ప్రమాదం ఉంది. అణ్వాయుధాల్లా భవనాలు, ఆస్తులను నాశనం చేయలేకపోయినా.. ఎన్నో చావులకు కారణం అవుతాయి ఈ బయోవార్​లు. 

ఎప్పటినుంచో.. 

బయోలాజికల్ వార్‌‌‌‌‌‌‌‌ జరిగినట్టు మొట్టమొదటిసారిగా1347లో గుర్తించారు. మంగోల్ బలగాలను చంపేందుకు ప్లేగుతో చనిపోయిన కొందరి శవాలను ఓడల్లో తీసుకొచ్చి వాళ్ల సరిహద్దుల్లో విసిరేశారు. ఆ తర్వాత నాలుగేండ్లలో ప్లేగు విపరీతంగా వ్యాపించింది. అప్పట్లోనే లక్షల మంది చనిపోయారు. 1710లో ఎరివాల్‌‌‌‌లో స్వీడిష్ దళాలతో పోరాడుతున్న రష్యన్ సైన్యం కూడా ప్లేగు సోకిన శవాలను సిటీ గోడలపై నుంచి విసిరేసింది.1763లో బ్రిటిష్ దళాలు ఫోర్ట్ పిట్ (ఇప్పుడు పిట్స్‌‌‌‌బర్గ్) దగ్గర పాంటియాక్ తిరుగుబాటుని అణచివేస్తున్నప్పుడు ఇండియన్స్‌‌‌‌కి మశూచి వైరస్ సోకిన దుప్పట్లు ఇచ్చారు.  పశ్చిమ, తూర్పు సరిహద్దుల్లో మిత్రరాజ్యాల సైన్యాల గుర్రాలు, పశువులకు సోకేలా చేయడానికి జర్మనీ అంటువ్యాధి ఏజెంట్ గ్లాండర్స్‌‌‌‌ని వాడింది. 1915లో రష్యాను దెబ్బతీయడానికి సెయింట్ పీటర్స్‌‌‌‌బర్గ్‌‌‌‌లో ప్లేగు వ్యాధి వ్యాప్తి చేయడానికి జర్మనీ ప్రయత్నం చేసిందని చెప్తుంటారు. రెండో ప్రపంచయుద్ధం టైంలో కూడా ఇలాంటి బయోవార్‌‌‌‌‌‌‌‌ జరిగిందట. అలా చూస్తే చరిత్రలో చాలాసార్లు బయోవార్స్ జరిగాయి. 


అందుకే యుద్ధాల్లో బయోలాజికల్‌‌‌‌ వెపన్స్‌‌‌‌ వాడకూడదని చాలా దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. ముఖ్యంగా 1925 జెనీవా ప్రొటోకాల్, అనేక అంతర్జాతీయ న్యాయ ఒప్పందాల ప్రకారం దీన్ని యుద్ధ నేరంగా గుర్తించారు. తర్వాత1972లో జరిగిన బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్ (బీడబ్ల్యూసీ)లో జీవాయుధాల అభివృద్ధి, ఉత్పత్తి, కొనుగోలు, బదిలీ, నిల్వలు, వినియోగాన్ని నిషేధించారు.  
నియంతలు పాలించే రాజ్యాలు పోయి ప్రజాస్వామ్య దేశాలు వచ్చాయి. టెక్నాలజీ పెరిగింది. దేశాల మధ్య ఒప్పందాలు కుదిరాయి. పరస్పర సహకారం, వాణిజ్యం పెరిగాయి. ఇలా దేశాల మధ్య సంబంధాలు ఎంతో బలపడ్డాయి. అయినా.. యుద్ధాల విషయంలో అంత మార్పులేదు. కొన్ని దేశాలు కయ్యాలను కొని తెచ్చుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితులు ఉన్నన్ని రోజులు ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయం ఉంటుంది.  


- దర్వాజ డెస్క్