కవర్ స్టోరీ : గోల్డ్​ ఈజ్​ గోల్డ్​

కవర్ స్టోరీ : గోల్డ్​ ఈజ్​ గోల్డ్​

శ్రీరాములు గవర్నమెంట్​ ఆఫీస్​లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయనకు భార్యా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రతి నెలా వచ్చిన జీతంలో నుంచి కొంత పొదుపు చేసి.. దగ్గర్లోని ఒక టౌన్​లో ప్లాట్​ కొన్నాడు. ఆ తర్వాత కొంత బంగారం కూడాకొని దాచాడు. అనుకోకుండా భార్య ఆరోగ్యం దెబ్బతిన్నది. డాక్టర్లు ఆపరేషన్​ చేయాలన్నారు. వస్తున్న జీతం పిల్లల కాలేజీ ఫీజులకు, ఇంటి ఖర్చులకే సరిపోయేది. 

అందుకే ప్లాట్​ అమ్మి ఆపరేషన్​ చేయించాలి అనుకున్నాడు. కానీ.. మంచి ధరకు కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. బంధువులను అడిగి చూశాడు. ఎక్కడా అప్పు పుట్టలేదు. అప్పటికే ఈఎంఐలు కడుతుండడంతో బ్యాంకులు కూడా లోన్​ ఇవ్వలేదు. వెంటనే ఇంట్లో ఉన్న బంగారం అమ్మాలని డిసైడ్​ అయ్యాడు. దగ్గర్లోని షాప్​కు వెళ్లి మార్కెట్ ధరకే పది నిమిషాల్లో అమ్మి వచ్చిన డబ్బుతో ఆపరేషన్​ చేయించాడు. అందుకే ‘గోల్డ్​ ఉంటే ఇంట్లో గాడ్​ ఉన్నట్టే’ అంటారు పెద్దలు.

కృష్ణమూర్తి​.. చిన్న కంపెనీలో క్లర్క్​. అతని భార్య శిరీష ఒక సూపర్​ మార్కెట్​లో ఉద్యోగం చేస్తోంది. ఒకరు సంపాదించే డబ్బుతో ఇంటి ఖర్చులు, అద్దె వెళ్లిపోతుంది. మరొకరి జీతాన్ని పొదుపు చేస్తున్నారు. సొంతిల్లు కొనుక్కోవాలనేది వాళ్ల పదేండ్ల కల. వాళ్లు అద్దెకు ఉంటున్న ఏరియాలోనే ఒక ఇల్లు అమ్మకానికి వచ్చింది. ఆ ఇంటికి వాస్తు బాగుంది. పైగా అలవాటైన ఏరియా కావడంతో కొనాలని నిర్ణయించుకున్నారు. కానీ.. వాళ్ల దగ్గర ఇల్లు కొనేందుకు సరిపడా డబ్బు లేదు. ఇంటి ధర 50 లక్షలు. అప్పటివరకు వాళ్లు సంపాదించింది పది లక్షలు. 35 లక్షలు లోన్​ వచ్చింది. 

అయినా.. రిజిస్ట్రేషన్​ ఖర్చులతో కలిపి మరో పది లక్షల వరకు కావాల్సి వచ్చింది. తెలిసినవాళ్ల దగ్గర అప్పు తీసుకుంటే.. వేల రూపాయల వడ్డీ కట్టాల్సి వస్తుంది. ఇంకొన్నాళ్ల తర్వాత కొందామంటే... మళ్లీ అలాంటి ఇల్లు దొరకదేమో అనే భయం. అప్పుడే శిరీషకు ఒక ఆలోచన వచ్చింది. తనను అత్తారింటికి పంపేటప్పుడు పుట్టింటివాళ్లు 20 తులాల బంగారం ఇచ్చారు. ఆ బంగారాన్ని బ్యాంక్​లో పెట్టి లోన్​ తీసుకున్నారు. గోల్డ్​ని సెక్యురిటీగా పెట్టడం వల్ల తక్కువ వడ్డీకే లోన్ వచ్చింది. అలా వాళ్ల సొంత ఇంటి కల సాకారం అయ్యింది. ఆ తర్వాత ఒకరి జీతం ఇంటి లోన్​ ఈఎంఐ కడుతూ.. ఇంటి పై పోర్షన్​ నుంచి వచ్చే అద్దెతో గోల్డ్​ లోన్​ కడుతూ అప్పులు తీర్చేశారు.

కూతురు పుట్టినప్పటి నుంచే ఆమె భవిష్యత్తు కోసం కొంత డబ్బు పొదుపు చేయాలి అనుకున్నాడు సుధాకర్​. కానీ.. అతనికి మ్యూచువల్​ ఫండ్స్​, చిట్టీలు కట్టడం గురించి తెలియదు. పైగా వాటిలో డబ్బు పెడితే నష్టపోతాననే భయం కూడా ఉంది. అందుకే ప్రతి అక్షయ తృతీయ రోజున ఆ ఏడాదిలో దాచిన మొత్తం డబ్బుతో బంగారం కొనడం మొదలుపెట్టాడు. కూతురు పెండ్లీడుకి వచ్చేసరికి బంగారం ధరలు బాగా పెరిగాయి. అతను మొదటి ఏడాదిలో కొన్న బంగారం ధరతో పోలిస్తే.. ఇప్పుడున్న ధర నాలుగైదు రెట్లు ఎక్కువ. అంటే.. బంగారం మీద పెట్టిన పెట్టుబడి కూడా నాలుగైదు రెట్లు పెరిగింది. దాంతో.. కొంత బంగారం కూతురికి గిఫ్ట్​గా ఇచ్చాడు. పెండ్లి ఖర్చులకోసం మరికొంత బంగారం అమ్మాడు. ఇలా.. బంగారం దాచి పెండ్లిళ్లు చేసే తల్లిదండ్రులు చుట్టుపక్కల ఎంతోమంది కనిపిస్తారు.

మనకు బంగారంతో విడదీయలేని బంధం ఉంది. నాగరికతలో భాగమైంది. పురాణాల్లో కూడా దీని గురించిన ప్రస్తావన ఉంది. బంగారానికి భారతీయ​ హృదయాల్లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. అందుకే ప్రతి ఇంట్లో ఎంతో కొంత బంగారం ఉంటుంది. సేఫ్ ఇన్వెస్ట్‌‌మెంట్​గా భావించి కొనేవాళ్లు కొందరైతే.. స్టేటస్​ కోసం, నగలు వేసుకోవాలనే కోరికతో కొనేవాళ్లు మరికొందరు. అంతేకాదు.. బంగారం మన ఆచార సంప్రదాయాల్లో కూడా ఒక భాగమైంది. అందుకే బంగారం ధర పెరిగిన ప్రతిసారి సామాన్యుడి మీద పడే భారం కూడా పెరుగుతూనే ఉంటుంది. 

ధర పెరిగితే వస్తువుకు ఉండే డిమాండ్​ తగ్గడం.. ధర తగ్గితే డిమాండ్​ పెరగడం మామూలే. కానీ.. బంగారం విషయంలో చాలా సందర్భాల్లో ఈ రూల్​ పనిచేయదు. ముఖ్యంగా ఇండియాలో.. అందులోనూ గ్రామాల్లో బంగారం ధర పెరిగినా, తగ్గినా కొంటారు. ధర తగ్గినప్పుడు.. ఇదివరకటితో పోలిస్తే.. తక్కువకు  దొరుకుతుందని కొంటారు. అదే పెరిగితే.. ముందు ముందు ఇంకా పెరుగుతుందేమో అనే భయంతో కొంటారు. ఎలాగైతేనేం మొత్తానికి బంగారాన్ని మాత్రం కొంటారు.

ఎందుకంత ఇష్టం

మతపరంగా.. ఇక్కడ దాదాపు అన్ని మతాల వాళ్లు బంగారాన్ని ఇష్టపడతారు. కొన్ని మతాల వాళ్లు మతపరమైన వేడుకల్లో కూడా బంగారాన్ని వాడుతుంటారు. ధరలు ఎలా ఉన్నా.. ఆలయాలకు బంగారు బహుమతులు వస్తూనే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌‌‌‌లోని తిరుమల ఆలయమే ఇందుకు ఉదాహరణ. బంగారం ధరలతో సంబంధం లేకుండా ప్రతి ఏడాది బంగారం విరాళంగా వస్తుంటుంది. అంతేకాకుండా.. ప్రజలు మతపరమైన సమావేశాలు, ప్రత్యేక రోజులు, పండుగలప్పుడు  బంగారం కొంటూనే ఉన్నారు. 

వారసత్వం.. దాదాపు భారతదేశంలో ప్రతి  ఇంట్లో బంగారం ఉంటుంది. కొన్ని కుటుంబాలు బంగారాన్ని ఆస్తులుగా భావిస్తుంటాయి. అందుకే ఎన్ని కష్టనష్టాలు వచ్చినా.. అమ్మకుండా దాచి తర్వాతి తరాలకు వారసత్వ సంపదగా ఇస్తుంటారు. ఇలా.. చాలా కుటుంబాల్లో ఒక తరం నుంచి మరో తరానికి చేతులు మారుతుంటుంది. చాలా పెండ్లిళ్లలో తల్లి తన నగలను పెండ్లి కూతురికి కానుకగా ఇస్తుండడం చూస్తూనే ఉంటాం.  

గోల్డెన్ గిఫ్ట్స్​.. బంగారాన్ని బహుమానంగా ఇచ్చే సంస్కృతి​ ఇండియాలో చాలా ఎక్కువ. దాదాపు అన్ని రకాల వేడుకల్లో బంధువులు గోల్డ్​ని  ఇస్తుంటారు. ముఖ్యంగా పెండ్లిళ్ల టైంలో బంగారాన్ని బహుమతిగా ఇవ్వడం చాలా కామన్. అత్తారింటికి వెళ్లేటప్పుడు కోడలు బంగారం తీసుకెళ్లడం అదృష్టంగా భావిస్తారు. అందుకే ఎంత పేదవాళ్లయినా ఎంతోకొంత బంగారం పెట్టి కూతురిని అత్తారింటికి పంపుతారు. టౌన్లలో అయితే.. పుట్టినరోజులు, అన్నప్రాసన లాంటి చిన్న చిన్న వేడుకలకి కూడా బంగారం గిఫ్ట్​గా ఇస్తుంటారు. 

స్టేటస్ సింబల్.. బంగారం కంటే పెద్ద స్టేటస్ సింబల్ మరొకటి ఉండదేమో! వేడుకలు, ఫంక్షన్లలో ఎంత బంగారం వేసుకుంటే అంత స్థితిమంతులు అనుకుంటారు. అందుకే రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, యాక్టర్లు, ఆర్థికంగా ఉన్నతంగా ఉన్న వాళ్లు మగ, ఆడ ఇద్దరూ బంగారు ఆభరణాలు ఎక్కువగా వేసుకుంటారు. 

కస్టమ్స్​ డ్యూటీ తగ్గింపు

బంగారం అంటే ఎంత ఇష్టమో దాన్ని కొనడం అంత భారం. ముఖ్యంగా మొన్నటిదాకా.. భారీ కస్టమ్స్​ డ్యూటీ ఉండడం వల్ల బంగారం ధర ఇంకాస్త ఎక్కువగా ఉండేది. గతంలో ఇంటర్నేషనల్​ మార్కెట్​లో ఉండే బంగారం ధర మీద15 శాతం అదనంగా పన్ను కట్టాల్సి వచ్చేది. దాంతో.. కొన్ని దేశాలతో పోలిస్తే.. ఇండియాలో బంగారం ధరలు ఎక్కువగానే ఉండేవి. 

అందుకే ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండితోపాటు ప్లాటినం లాంటి విలువైన లోహాలపై ఇంపోర్ట్​ డ్యూటీ తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దాంతో బంగారం, వెండి ధరలు కొంత తగ్గాయి. ఆ తర్వాత కూడా రెండు మూడు రోజులు వరుసగా తగ్గుతూ వచ్చాయి. మొత్తంగా 10 గ్రాముల (24 క్యారెట్లు) బంగారం మీద దాదాపు 5,000 రూపాయల వరకు తగ్గింది. గోల్డ్, సిల్వర్​పై కస్టమ్స్ సుంకాన్ని 10 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధి సుంకాన్ని 5 శాతం నుంచి 1 శాతానికి తగ్గించారు. దీంతో ఇప్పుడు మొత్తం ఇంపోర్ట్​ డ్యూటీ 6 శాతానికి తగ్గింది. 

స్మగ్లింగ్​ తగ్గించేందుకు.. 

బంగారం మీద ఇంపోర్ట్​ డ్యూటీ ఎక్కువగా ఉండడంతో విపరీతంగా స్మగ్లింగ్​ జరిగేది. అంటే ధర తక్కువగా ఉన్న దేశాల్లో బంగారం కొని..  దాన్ని ఇండియాకు అక్రమంగా తీసుకొచ్చేవాళ్లు. దానివల్ల ప్రభుత్వానికి చాలా నష్టం జరిగేది. ఇంపోర్ట్​ డ్యూటీని తగ్గించడానికి ఇది కూడా ఒక కారణమే. కరెంట్ అకౌంట్​ డెఫిసిట్​(ఎక్స్​పోర్ట్స్​ వల్ల వచ్చే డబ్బు, ఇంపోర్ట్స్​ కోసం ఖర్చు చేసే డబ్బుకు మధ్య ఉండే తేడా)ని తగ్గించడానికి, రూపాయి విలువ పెరిగేలా చేయడానికి 2013లో బంగారంపై ఇంపోర్ట్​ డ్యూటీని10 శాతానికి పెంచారు. ఆ తర్వాత 2019 జులైలో ఇది 12.5 శాతానికి పెరిగింది. 

డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డాటా ప్రకారం.. 2016 నుంచి 2020 మధ్య కొన్ని సంవత్సరాల్లో దాదాపు ఏటా 3 వేల కిలోల కంటే ఎక్కువ బంగారాన్ని దేశవ్యాప్తంగా కస్టమ్స్​ ఆఫీసర్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత 2021 చివరి నాటికి డ్యూటీని10 శాతానికి తగ్గించారు. 2022లో బంగారాన్ని అక్రమంగా దేశంలోకి తీసుకురావడం కాస్త తగ్గింది. 2023లో కస్టమ్స్ డ్యూటీని10 శాతం నుంచి15 శాతానికి పెంచడంతో మళ్లీ అదే తంతు మొదలైంది. అధికారులు స్వాధీనం చేసుకునే బంగారం క్వాంటిటీ పెరుగుతూ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇంపోర్ట్​ డ్యూటీని తగ్గించడం వల్ల మళ్లీ అక్రమ రవాణా తగ్గే అవకాశాలు ఉన్నాయని ఎక్స్​పర్ట్స్​ చెప్తున్నారు. 

మార్పు ఎందుకు? 

బంగారం, వెండి లాంటి మెటల్స్​ ధరల్లో మార్పులకు అనేక కారణాలు ఉంటాయి. వాటి మీద రకరకాల ఫ్యాక్టర్స్​ నెగెటివ్​ లేదా పాజిటివ్​ ఇంపాక్ట్స్​ చూపించి ధరల్లో మార్పులకు కారణం అవుతాయి. ముఖ్యంగా మైనింగ్​ చేసేటప్పుడు మెటల్స్​ నిల్వలు తగ్గడం, పెరగడం లాంటివి ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తాయి. అవేకాకుండా ప్రపంచవ్యాప్తంగా సంభవించే ప్యాండెమిక్​లు, వివిధ దేశాల్లో పరిస్థితులు, మెటల్స్​ వినియోగం, సీజన్స్​, డాలర్​ విలువ.. ఇలా ఒక్కటేమిటి ఎన్నో కారణాలు ఉంటాయి. 

బంగారం లాంటి విలువైన మెటల్స్​ విషయంలో అయితే.. ప్రత్యేకంగా స్థానిక పరిస్థితులు కూడా తోడవుతాయి. బంగారం ధరను అంచనా వేయడం అంత ఈజీ కాదు. దానికి చాలా లెక్కలు ఉన్నాయి. స్వల్ప కాలంలో హెచ్చు తగ్గులు భారీగా ఉన్నా.. దీర్ఘకాలంలో మాత్రం బంగారం ధర పెరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా డాలర్​ -డినామినేషన్​, ద్రవ్యోల్బణం రేట్లు, సెంట్రల్ బ్యాంకుల బంగారం రిజర్వ్​లు లాంటివి బంగారం ధరను ఎక్కువగా ఎఫెక్ట్​ చేస్తాయి.  

ఇండియాలో గ్లోబల్ మార్కెట్ ట్రెండ్స్

ఇండియాలో బంగారం ధరను నిర్ణయించడంలో వరల్డ్​ గోల్డ్​ మార్కెట్​కీలక పాత్ర పోషిస్తుంది. బంగారం వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. దాని అంతర్జాతీయ సరఫరా, డిమాండ్ డైనమిక్స్ ధరను నిర్ణయిస్తాయి. భౌగోళిక, రాజకీయ సంఘటనలు, ఆర్థిక పరిస్థితులు, కరెన్సీ హెచ్చుతగ్గులు లాంటి ఎన్నో అంశాలు బంగారం ధరపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తాయి. అంతర్జాతీయ మార్కెట్లు అనిశ్చితిని చూసినప్పుడు, పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన ఆస్తిగా భావిస్తారు. కాబట్టి అన్ని గ్లోబల్ ఈవెంట్లు బంగారం ధరను నిర్ణయించడంలో తమ వంతు పోత్ర పోషిస్తాయి. ​ 

లోకల్​ డిమాండ్ 

మన దేశంలో అనేక ఆచారాల్లో బంగారాన్ని వాడతారు. ముఖ్యంగా గ్రామీణ జనాభాకు బంగారం మీద అనుబంధం ఎక్కువగా ఉంటుంది. అందుకే..  పండుగలు, పెళ్లిళ్ల సమయంలో బంగారు ఆభరణాలకు డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి ధరలో హెచ్చుతగ్గులు వస్తుంటాయి. అదేవిధంగా సరఫరాలో ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా స్థానిక బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. అంటే.. ప్రభుత్వ విధానాలు కూడా బంగారం ధరపై చాలా ఎఫెక్ట్​ చూపిస్తాయి.

రూపాయి - డాలర్ 

ప్రపంచవ్యాప్తంగా బంగారం ధర అమెరికన్​ డాలర్లలో ఉంటుందనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే.. ఇండియన్​ రూపాయి, అమెరికన్​ డాలర్ మారకం రేటులో హెచ్చుతగ్గులు వచ్చినప్పుడు బంగారం ధర ఎఫెక్ట్​ అవుతుంది. ఈ వ్యత్యాసం.. ప్రపంచ బంగారం ధరల మీద ఎఫెక్ట్​ చూపించనప్పటికీ ఇండియాలో మాత్రం ఎఫెక్ట్​ చూపిస్తుంది. డాలర్​తో పోలిస్తే.. రూపాయి విలువ తగ్గినప్పుడు బంగారం ధరలు పెరుగుతాయి. బలమైన రూపాయి మాత్రం నెగెటివ్​ ఎఫెక్ట్​ని చూపిస్తుంది. కానీ.. రూపాయి–డాలర్ రేట్లలో మార్పు డాలర్లలో సూచించే బంగారం ధరలపై మాత్రం ఎలాంటి ప్రభావం చూపించదు.

ఇన్వెస్టర్ సెంటిమెంట్ 

మార్కెట్​లో పెట్టుబడిదారులు, స్పెక్యులేటర్ల ప్రవర్తన కూడా బంగారం ధరపై ప్రభావం చూపుతుంది. మార్కెట్ సెంటిమెంట్, ట్రేడింగ్ వాల్యూమ్‌‌‌‌లు, ఇతర ఆర్థిక మార్కెట్లలో ట్రెండ్‌‌‌‌లు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు.. బంగారం మార్కెట్‌‌‌‌లో ట్రేడింగ్​ పెరిగినా.. బంగారం విలువ పెరుగుతుందనే ఊహాగానాలు పెరిగినా ఇన్వెస్టర్లు విపరీతంగా బంగారం కొంటారు. ఇలాంటివి కూడా స్వల్పకాలిక ధరల హెచ్చుతగ్గులకు దారి తీస్తాయి. ఇది మార్కెట్ సైకాలజీకి సంబంధించినది. కాబట్టి ధరల్లో హెచ్చుతగ్గులను ఊహించడం కష్టం. కానీ.. ఇది కూడా బంగారం ధరను నిర్ణయించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.

బంగారం– వడ్డీ రేట్లు

కొంతమంది ఇండస్ట్రీ ఎక్స్​పర్ట్స్​ అభిప్రాయం ప్రకారం.. సాధారణ పరిస్థితుల్లో బంగారం, వడ్డీ రేట్ల మధ్య ప్రతికూల సంబంధం ఉంటుంది. దేశంలో ప్రొడక్షన్​ పెరిగితే.. బలమైన ఎకానమీని సూచిస్తుంది. చాలాసార్లు బలమైన ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. కాబట్టి ఇన్వెస్టర్లు సేఫ్​గా ఉండేందుకు బంగారం మీద పెట్టుబడి పెడతారు. పైగా.. వడ్డీ రేట్లు పెరిగినప్పుడు పెట్టుబడిదారులు బంగారం లాంటి స్థిరాదాయ పెట్టుబడుల వైపు మొగ్గు చూపిస్తారు. 

వానాకాలం సీజన్​

దేశంలో బంగారం వినియోగంలో 60 శాతం వాటా గ్రామీణ ప్రాంతాలదే. కాబట్టి గ్రామాల్లో పరిస్థితులు కూడా బంగారం ధరల్లో మార్పులకు కారణం అవుతాయి. మనది ప్రధానంగా రుతుపవనాలపై ఆధారపడి సాగు చేసే  దేశం. కాబట్టి వాటి ఎఫెక్ట్​ కూడా బంగారం డిమాండ్‌‌‌‌ మీద ఉంటుంది. అంటే.. రుతుపవనాలు బాగుండి.. వర్షాలు పడితే పంటలు పండుతాయి. కాబట్టి బంగారం అమ్మకాలు పెరుగుతాయి. 

లేదంటే కరువు సంభవించి పంటలు నష్టపోతే బంగారానికి డిమాండ్​ తగ్గుతుంది. పైగా నారు మడులు సిద్ధం చేసుకునే టైంలో రైతులు పెట్టుబడులు ఎక్కువగా పెట్టాల్సి ఉంటుంది. అలాంటి టైంలో కూడా బంగారానికి డిమాండ్​ తగ్గి ధర తగ్గుతుంది. ఒకవేళ నష్టాలు మరీ ఎక్కువగా వస్తే.. ఉన్న బంగారాన్ని కూడా అమ్మి అప్పులు తీరుస్తారు. కాబట్టి అలాంటి టైంలో కూడా డిమాండ్​ బాగా తగ్గిపోతుంది. 

బంగారం వర్సెస్​ స్టాక్​ మార్కెట్

స్టాక్​ మార్కెట్​ ఇండెక్స్​ పనితీరు మెరుగ్గా లేనప్పుడు బంగారం ధర పెరుగుతుండడం గమనిస్తుంటాం. దానికి కారణం.. బంగారం, స్టాక్ మార్కెట్ మధ్య విలోమ సంబంధం ఉంటుంది. స్టాక్​ మార్కెట్లు మంచి రిటర్న్స్​ ఇవ్వని టైంలో బంగారం మీద పెట్టుబడి పెట్టడం సేఫ్​ ఇన్వెస్ట్​మెంట్​గా భావిస్తుంటారు. స్టాక్ మార్కెట్ పడిపోయినప్పుడు బంగారం ధర పెరగడం చరిత్రలో చాలాసార్లు చూశాం. ఈ సూత్రం ప్రపంచ అన్ని ఆర్థిక వ్యవస్థలకు పనిచేస్తుంది. అందుకే ఏ దేశ స్టాక్ మార్కెట్ పేలవంగా ఉన్నప్పుడు బంగారు నాణేలు, కడ్డీలు, ఈటీఎఫ్​ల అమ్మకాలు పెరుగుతాయి. దేశ జీడీపీ వృద్ధి రేటు తగ్గుతున్నప్పుడు కూడా బంగారం డిమాండ్ పెరుగుతుంది. 

సెంట్రల్​ బ్యాంక్​ రిజర్వ్​​...

దేశాల సెంట్రల్​ బ్యాంక్​లు సాధారణంగా పేపర్​ కరెన్సీతోపాటు కొంత బంగారాన్ని కూడా రిజర్వ్​ చేసుకుంటాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఎగుమతులు, దిగుమతులకు ఎక్కువగా అమెరికన్​  డాలర్లను వాడుతుండడంతో వాటినే ఎక్కువ దేశాలు రిజర్వ్​ చేసుకుంటున్నాయి. కానీ.. సెంట్రల్​ బ్యాంక్​లు ఎప్పుడైనా డాలర్​ విలువ తగ్గుతుంది అనుకుంటే... పేపర్​ కరెన్సీని బంగారంగా మార్చేస్తాయి. 

అంటే ఆ డాలర్లతో బంగారం కొని నిల్వ చేస్తాయి. అలాంటి సందర్భాల్లో బంగారం ధర పెరుగుతుంది. ప్రస్తుతం ప్రపంచంలోని అనేక దేశాల దగ్గర బంగారం నిల్వలు ఉన్నాయి. 2021లో సెంట్రల్ బ్యాంక్​లు బంగారం కొనుగోళ్లు బాగా పెంచాయి. 2022లో 50 ఏళ్ల రికార్డును అధిగమించి ఎక్కువగా బంగారం కొన్నాయి. 2022లో టాప్ గోల్డ్ కొనుగోలుదారుగా టర్కీ(తుర్కియే) సెంట్రల్ బ్యాంక్ ఉంది. తర్వాత వరుసలో ఉజ్బెకిస్తాన్, ఇండియా, ఖతార్ నిలిచాయి. 

డాలర్ విలువ

బంగారం ధర, అమెరికన్​ డాలర్​ మధ్య విలోమ సంబంధం ఉంటుంది. అంటే డాలర్​ విలువ పెరిగితే.. బంగారం ధర తగ్గుతుంది. డాలర్​ విలువ తగ్గితే.. బంగారం ధర పెరుగుతుంది. డాలర్ పడిపోవడంతో ఇతర దేశాల కరెన్సీల విలువ పెరుగుతుంది. దాంతో.. బంగారంతో సహా అన్ని వస్తువుల డిమాండ్‌‌‌‌ పెరుగుతుంది. దానివల్ల బంగారం ధరలు కూడా పెరుగుతాయి. డాలర్​ విలువ తగ్గినప్పుడు ఇన్వెస్టర్లు నష్టపోతామనే భయంతో బంగారం మీద పెట్టుబడులు పెడుతుంటారు. దాంతో.. బంగారం డిమాండ్​ పెరుగుతుంది. దాంతోపాటు ధర కూడా పెరుగుతుంది. అందుకే కొన్నాళ్లుగా అమెరికన్​ డాలర్ విలువ తగ్గే అవకాశాలు కనిపిస్తుండడంతో బంగారం ధర పెరుగుతూ వస్తోంది. 

బోలెడంత రక్షణ​

ఎకానమీ దెబ్బతిన్నప్పుడు (ఆర్ధిక అస్థిరత), ఆర్థిక మాంద్యం టైంలో కూడా బంగారం ధరల్లో పెద్దగా మార్పులు రావు. అందుకే ఎక్కువమంది దాని శాశ్వత విలువ వల్ల బంగారం మీద పెట్టుబడి పెడుతుంటారు. ఎకానమీ అల్లకల్లోలం అయిన టైంలో పెట్టుబడిదారులకు బంగారం సేఫ్​ హెవెన్​గా ఉంటుంది. బాండ్లు , ఈక్విటీలు, రియల్ ఎస్టేట్.. లాంటి వాటి మీద రాబడి తగ్గినప్పుడు బంగారం మీద పెట్టుబడులు పెరుగుతాయి. కాబట్టి ధర పెరుగుతుంది. బంగారం ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా పనిచేసే ఒక హెడ్జింగ్ టూల్​. దాని ధర ద్రవ్యోల్బణం నెంబర్లకు రియాక్ట్​ అవుతుంటుంది. 

సాధారణంగా జీవన వ్యయం (కాస్ట్​ ఆఫ్​ లివింగ్)​ పెరిగినప్పుడు బంగారం విలువ పెరుగుతుంది. ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు కరెన్సీ విలువ తగ్గుతుంది. కాబట్టి ప్రజలు తమ డబ్బుని బంగారం రూపంలోకి మార్చుకుంటుంటారు. అలాంటప్పుడు కూడా ధరలు పెరుగుతాయి. గోల్డ్​ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్​) వల్ల కూడా బంగారం డిమాండ్​ పెరుగుతుంది. ఇవి మెటల్స్​ని హోల్డ్​ చేసే సెక్యూరిటీలు. పెట్టుబడిదారులు ఈ షేర్లను స్టాక్స్​లాగే అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు. కాబట్టి ఇవి కూడా బంగారం ధరల్లో మార్పులకు కారణం అవుతాయి.  

గోల్డ్​ ప్రొడక్షన్​

ప్రపంచవ్యాప్త బంగారం మైనింగ్‌‌‌‌లో చైనా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా, రష్యా, పెరూ ముందున్నాయి. అన్ని వస్తువుల్లాగే.. బంగారం ధరలు కూడా మైనింగ్​ ఎక్కువగా జరిగినప్పుడు పెరుగుతాయి. మైన్లలో బంగారం ఎక్కువగా దొరక్కపోతే డిమాండ్​ పెరిగి ధరలు పెరుగుతాయి. ఉదాహరణకు.. బంగారం ప్రొడక్షన్​ 2018 –2019లో సంవత్సరంలో 3,300 మెట్రిక్ టన్నులుగా ఉంది. కానీ.. 2020–2021లో 3,000 మెట్రిక్ టన్నులకు తగ్గింది. కొన్నేండ్ల నుంచి మైనింగ్​ పెంచినా ప్రొడక్షన్​లో గణనీయంగా మార్పలు రావడం లేదు. దానికి కారణం... ఈజీగా బంగారం దొరికే ప్రతి చోట ఇప్పటికే తవ్వకాలు పూర్తయ్యాయి. 

అందుకే బంగారాన్ని వెలికి తీసేందుకు మైనింగ్ గురించి ఇప్పుడు లోతుగా తవ్వుతున్నారు. దాంతో ప్రమాదాలకు గురవుతున్నారు. పైగా పర్యావరణం మీద ప్రభావం​ పడుతోంది. కాబట్టి భవిష్యత్తులో బంగారం మైనింగ్​ తగ్గే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. పైగా తవ్వడానికి అయ్యే ఖర్చు కూడా పెరుగుతోంది. ఇవన్నీ బంగారం ధరల మీద ప్రభావం చూపిస్తాయి. భౌగోళిక, రాజకీయ సంక్షోభ సమయంలో కూడా బంగారం ధరలు పెరుగుతాయి. విపత్కర పరిస్థితులు, యుద్ధాలు ఆస్తుల ధరలపై నెగెటివ్​ ఇంపాక్ట్​ చూపిస్తాయి. కాబట్టి బంగారం ధరలు పెరుగుతాయి.  

ఇన్వెస్ట్​మెంట్​ సేఫేనా?

ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు , కరెన్సీ విలువ తగ్గుతుంది. ప్రపంచంలోని దాదాపు అన్ని ప్రధాన కరెన్సీలు క్షీణించినా.. బంగారం విలువ తగ్గదు. కాబట్టి దీర్ఘకాలంలో ఇన్వెస్ట్​ చేయాలి అనుకునే వాళ్లు బంగారం మీద పెట్టుబడి పెట్టడం సేఫ్​ అనే చెప్తున్నారు ఎక్స్​పర్ట్స్. అందుకే ప్రజలు డబ్బును బంగారం రూపంలో దాచుకుంటారు. 

కొనడం ఈజీ

ఒక మధ్య తరగతి కుటుంబం చాలా కష్టపడి ఓ పది లక్షలు సంపాదించుకుంది అనుకుందాం.. ఆ డబ్బుని స్టాక్​ మార్కెట్​లో పెడదామంటే అందుకు కావాల్సిన నాలెడ్జ్​ లేకపోవచ్చు.. ఉన్నా మార్కెట్​ క్రాష్​ అయ్యే ప్రమాదం ఉండొచ్చు. లేదంటే.. ఎక్కడైనా ప్లాట్​ లాంటిది కొందామంటే.. దానికి కూడా రకరకాలుగా చెక్​ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లిటికేషన్లు, గొడవలు, కబ్జాలు, కోర్టు కేసులు అన్నీ.. చూసుకుని కొనాలి. 

పైగా రియల్ ఎస్టేట్ లాంటి ప్రత్యక్ష ఆస్తుల కొనుగోలుతో పోలిస్తే బంగారం కొనడం చాలా ఈజీ. కొన్నిసార్లు డిజిటల్​గా దాచుకున్న డబ్బులు కూడా సైబర్​ ఫ్రాడ్స్​, హ్యాకింగ్స్​ లాంటి వల్ల కోల్పోయే ప్రమాదం ఉంది. కానీ.. బంగారం విషయంలో అలాంటి సమస్యే ఉండదు. కాకపోతే.. దాన్ని జాగ్రత్తగా దాచుకోవాలి. పైగా చరిత్రలో చూసుకుంటే.. దీర్ఘకాలంలో బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కానీ.. తగ్గలేదు. ధరల్లో హెచ్చుతగ్గులు అనేవి స్వల్పకాలికమే.  

సేఫ్​ అండ్​ రిస్క్​

చాలామంది ఆర్థికవేత్తలు ఒకే రంగంలో పెట్టుబడి పెట్టడం సేఫ్​ కాదని చెప్తుంటారు. పోర్ట్‌‌‌‌ఫోలియో డైవర్సిఫికేషన్ తప్పనిసరిగా పాటించాలి అంటుంటారు. అంటే.. మొత్తం సంపాదనలో కొంతవరకు సేఫ్​ ఇన్వెస్ట్​మెంట్​, మరికొంత రిస్క్ తీసుకుని పెట్టుబడులు పెట్టాలి. అలాంటప్పుడే నష్టపోకుండా ఉంటారు. ఉదాహరణకు.. స్టాక్స్​ మీద కొంత, బంగారం మీద కొంత పెట్టుబడి పెడితే.. స్టాక్స్​ బాగా పడిపోయినప్పుడు, బంగారం ధర పెరుగుతుంది. స్టాక్స్​లో వచ్చిన నష్టాన్ని బంగారం భర్తీ చేస్తుంది.  

ఆదుకుంటుంది

ఎప్పుడు ఏ ఆపద వచ్చినా బంగారం రక్షిస్తుందని చాలామంది నమ్ముతారు. ఎందుకంటే.. చేతిలో ఉన్న డబ్బుతో పొలాలు, ప్లాట్స్​.. లేదా ఇంకేవైనా స్థిరాస్తులు కొంటే వెంటనే లిక్విడిటీ చేసుకునే అవకాశాలు చాలా తక్కువ. ఏదైనా అవసరం వచ్చినప్పుడు వాటిని అప్పటికప్పుడు అమ్మలేం. కానీ.. బంగారాన్ని మాత్రం వెంటనే అమ్ముకోవచ్చు. పైగా.. ఎక్కడ కుదువ పెట్టినా కావాల్సిన డబ్బు వెంటనే వచ్చేస్తుంది. గోల్డ్​ మీద చాలా తక్కువ వడ్డీకే లోన్​ కూడా తీసుకోవచ్చు. అందుకే భౌతిక ఆస్తులతో పోలిస్తే.. బంగారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. బంగారంలో పెట్టుబడులను కూడా చాలా తక్కువ టైంలో లిక్విడేట్ చేసుకోవచ్చు. సావరిన్ గోల్డ్ బాండ్లు మినహా బంగారం పెట్టుబడులకు లాక్–ఇన్ పీరియడ్ ఉండదు. 

ఇండస్ట్రియల్​ డిమాండ్​

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం.. 2022లో మొదటి ఆరు నెలల్లో అమ్ముడైన మొత్తం బంగారంలో దాదాపు 44 శాతం ఆభరణాలు చేసుకోవడానికే వాడారు. ఎందుకంటే..  ఇండియాతోపాటు చైనా, యునైటెడ్ స్టేట్స్​లో నగలు వేసుకునేవాళ్ల సంఖ్య కాస్త ఎక్కువ. మొత్తం బంగారంలో 7.5శాతం టెక్నాలజీ, ఇండస్ట్రియల్​ ఉపయోగాలకు వాడతారు. వైద్య పరికరాలు, జీపీఎస్​ యూనిట్లు లాంటి ఎలక్ట్రానిక్స్​ తయారీలో వాడుతుంటారు. కాబట్టి  వినియోగ వస్తువులకు (నగలు, ఎలక్ట్రానిక్స్ వంటివి) డిమాండ్ పెరిగేకొద్దీ బంగారం ధర పెరుగుతుంది. 

సామాన్యుల మీద ఎఫెక్ట్

బంగారం ధరల్లో పెరుగుదల భారం సామాన్యుడి మీదే ఎక్కువ. గ్రామీణ ప్రాంతాల్లో  పెండ్లిళ్లలో కూతురికి బంగారం ఇవ్వడం ఆనవాయితీ. అలాంటప్పుడు ధరలతో సంబంధం లేకుండా బంగారం కొనాల్సి వస్తుంది. కాబట్టి సీజన్లలో ధరలు పెరిగితే.. ఆ భారం సామాన్యుడి మీదే ఎక్కువ.

ఒకప్పటినుంచి.. ఇప్పటివరకు.. 

వేదాలు బంగారాన్ని విలువైన లోహాల్లో  ఒకటిగా చెప్పాయి.  గుప్త, మౌర్య సామ్రాజ్యాల్లో బంగారం వర్తకం బాగా సాగింది. మౌర్య సామ్రాజ్యంలో బంగారాన్ని నాణేలుగా కూడా వాడేవాళ్లు. ఈ కాలంలో రకరకాల డిజైన్లలో నాణేలు తెచ్చారు. కానీ.. తర్వాత వచ్చిన మొఘల్ సామ్రాజ్యంలో  రాజభవనాలు, కోటలు, స్మారక చిహ్నాలు, మొఘల్ వాస్తుశిల్పం లాంటి వాటిలో బంగారం వాడకం పెరిగింది. 

దినార్స్’ అని పిలిచే కొత్త నాణేల వ్యవస్థ వచ్చింది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా రాకతో.. భారతదేశ బంగారు వాణిజ్య విధానాలే మారిపోయాయి. బంగారం వినియోగం, వాణిజ్యాన్ని నియంత్రించే కొత్త విధానాలు అమల్లోకి వచ్చాయి. మార్కెట్​లో అప్పటివరకు ఉన్న బంగారం ప్రవాహం అదుపులోకి వచ్చింది. స్థానిక స్వర్ణకారులు కాస్త ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. 

స్వాతంత్య్రానంతరం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంగారం దిగుమతులపై పరిమితులు విధించింది. 1968లో  వచ్చిన గోల్డ్ కంట్రోల్ యాక్ట్  బంగారం ఉత్పత్తి, అమ్మకాలను నియంత్రించింది. బంగారం హోల్డింగ్‌లను అధికారులకు తెలియజేసే విధానం వచ్చింది. ఆ తర్వాత క్వాలిటీ, క్వాంటిటీల విషయంలో వచ్చిన రూల్స్ వల్ల బంగారం కొనుగోళ్లు పెరిగాయి. 

ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని మధ్యతరగతి ప్రజలు కూడా ఈజీగా బంగారం కొనే వెసులుబాటు కలిగింది. ఇదివరకు ప్యూర్​ గోల్డ్​, ఆభరణాలు మాత్రమే కొనేవాళ్లు. కానీ.. ఇప్పుడు ‘సావరిన్​ బాండ్స్​, గోల్డ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ఈటిఎఫ్‌లు), డిజిటల్​ గోల్డ్’​ రూపాల్లో కూడా కొంటున్నారు. ఇదివరకు కంసాలి  మాత్రమే బంగారు నగలు చేసేవాడు. కానీ.. ఇప్పుడు అందరూ బంగారం వ్యాపారం చేస్తున్నారు. ఈ రంగంలో మెషిన్ల వినియోగం పెరిగాక రకరకాల డిజైన్లు అందుబాటులోకి వచ్చాయి. టౌన్లు, సిటీల్లో పెద్ద పెద్ద షాపింగ్​మాల్స్​ వెలిశాయి.

ఎప్పటినుంచో.. 

క్రీస్తు పూర్వం 2,500 నాటి సింధు లోయ నాగరికత నుండి దాదాపు అన్ని చారిత్రక దశల్లో భారతీయ సంస్కృతిలో బంగారు ఆభరణాలకు ప్రాముఖ్యత ఉంది. వివాహాలు, పండుగలు, మతపరమైన వేడుకల్లో బంగారు ఆభరణాలు  భాగం అయిపోయాయి. మనవాళ్లు బంగారాన్ని శుభప్రదంగా చూస్తారు. అంతెందుకు.. మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయేవరకు ఆడ, మగ, ధనిక, పేద తేడా లేకుండా అందరికీ బంగారం కొనడం అనేది ఒక లక్ష్యంగా ఉంటుంది. 

అందుకే ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం వినియోగదారుగా మారింది ఇండియా. దానివల్లే గోల్డ్​ ఇండస్ట్రీలో పవర్‌‌‌‌హౌస్‌‌‌‌గా ఎదిగింది. అందుకే ‘ఇండియా తుమ్మితే, గోల్డ్​ ఇండస్ట్రీకి జలుబు చేస్తుంది’ అంటారు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్‌‌‌‌కు చెందిన అజయ్ మిత్రా. 

దర్వాజ డెస్క్