ఎస్సారెస్పీ కాకతీయ కెనాల్​ గట్లకు కప్పిన కవర్లు కోసుకుపోతున్నారు

ఎస్సారెస్పీ కాకతీయ కెనాల్​  గట్లకు కప్పిన కవర్లు కోసుకుపోతున్నారు

వరంగల్, వెలుగు:  ఎస్సారెస్పీ కాకతీయ కెనాల్​ సేఫ్​ గా ఉండడానికి కాల్వ గట్లకు కప్పిన కవర్లు కోసుకుపోతున్నారు.  వరద  నీటికి కట్టలు తెగకుండా, బుంగలు పడకుండా ఉండేందుకు విదేశాల నుంచి హైడెన్సిటీ పాలిథీన్​(హెచ్‍డీపీ) బ్లాక్‍ షీట్లు తెప్పించారు.  వరంగల్‍, హనుమకొండ సిటీ పరిధిలో  కెనాల్‍ ఉండే ఏడెనిమిది కిలోమీటర్లు వాటిని కాల్వ లోపలి వైపు పరిచారు. కవర్లు మందంగా ఉండడంతో 100 ఏండ్ల లైఫ్‍ ఉంటుందని చెప్పారు. 10 ఏండ్ల వరకైతే  కత్తితో కోసిన తెగదని.. నిప్పుంటుకున్నా కాలిపోవని చెప్పారు. ఐదేండ్ల తర్వాత చూద్దామంటే ఎక్కడా ఆ కవర్లు కనిపించడంలేదు. ప్రాజెక్టు పనులు అడ్డదిడ్డంగా చేయడంతో ప్రవాహం ధాటికి కిందుండే కవర్లు కొట్టుకుపోయాయి.  పైన రెండువైపులా ఉండే కవర్లను కొన్ని రోజులుగా దుండగులు రంపాలు, కొడవళ్లతో కోసుకెళ్తున్నారు. కాంట్రాక్టర్లు చేసిన పనుల ప్రొగ్రెస్‍ ఎప్పటికప్పుడు చూడాల్సిన ఆఫీసర్లు అటువైపు చూడడం లేదు.

 రూ.120 కోట్లు ఖర్చు ..

ఎస్సారెస్పీని  బలపరచడానికి  స్టేజీ –1, స్టేజీ –2 ద్వారా 7 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. 2017–18లో ఎల్ఎండీ నుంచి వరంగల్‍ వరకు కాల్వ సైడ్ లైనింగ్, వెడల్పు, ఎత్తు పెంచే పనులకు  రూ.120 కోట్లు ఖర్చు చేసింది. చాలాచోట్ల కాల్వకు మరీ దగ్గరగా ఉన్న నిర్మాణాలను కూల్చివేశారు. కెనాల్ లోపలి భాగం వెడల్పు చేసి ఇరువైపుల కొత్తగా సిమెంట్‍ లైనింగ్‍ చేశారు. కట్ట ఎత్తు,
వెడల్పు పెంచారు.

రూ.5.26 కోట్లతో హెచ్‍డీపీ షీట్లు..

గ్రేటర్ వరంగల్‍ వచ్చేసరికి కెనాల్‍కు ఇరువైపులా వేలాది ఇండ్లు ఉన్నాయి.  మొదటి దశలో ఎక్కడైన కట్టలు తెగితే పూడ్చడానికి వాహనాలు వెళ్లేలా కాల్వకు ఇరువైపులా దారులు చేశారు. కెనాల్​ లో ఎంత వరద ప్రవాహం వచ్చినా తట్టుకునేలా ఆస్ట్రియా దేశం నుంచి రూ.5 కోట్ల 26 లక్షలు ఖర్చు చేసి 1 లక్ష 65 వేల మీటర్ల హెచ్‍డీపీ షీట్లు తెప్పించారు. గుండ్లసింగారం షట్టర్ల నుంచి యాదవనగర్‍, పెద్దమ్మగడ్డ, ఆటోనగర్‍ అవతలి వరకు కెనాల్‍ లోపలి భాగంలో కింద, ఇరువైపులా వీటిని పరిచారు.

5 ఏండ్లకే కవర్లు కనిపించట్లే

 2018లో పరిచిన హైడెన్సిటీ పాలిథీన్​ కవర్లు చిన్నపాటి నీటి ప్రవాహానికే  కొట్టుకుపోయాయి.  నాడు పనులు దక్కించుకున్న సంస్థ  పనులను  బ్లాక్​ షీట్లు పరిచే పనులు అడ్డదిడ్డంగా చేయడంతో కింద వేసినవి ఎక్కడికక్కడ ఊడిపోయాయి.  అయినా ఆఫీసర్లు ఏనాడు వాటిని సరిచేసే ఆలోచన చేయలేదు. ఈ క్రమంలో ఎంతో గట్టిగా, బలంగా ఉండే ఈ కవర్లపై కొందరు దుండగుల కన్ను పడింది.  కొన్ని రోజులుగా గుండ్లసింగారం నుంచి పెద్దమ్మగడ్డ వరకు ఈ షీట్లను కొడవళ్లు, రంపాలతో కోసి  ఆటోలు, ట్రాక్టర్లు పెట్టి మరీ వాటిని చోరీ చేస్తున్నారు.

ఇప్పటికే రెండుసార్లు గండి

వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు 9 ఏండ్ల కింద రెడ్డికాలనీ–పెద్దమ్మగడ్డ మధ్య కెనాల్ కట్టకు గండి పడింది.  సిటీ మురుగు నీరు వెళ్లే మెయిన్‍ డ్రైనేజీకి దగ్గరగా ఉండడంతో కెనాల్‍ నీరంతా అందులో పడడంతో సిటీ జనాలు ఊపిరి పీల్చుకున్నారు. రెండేండ్ల కింద గణేశ్‍ నగర్‍ వద్ద కట్టకు బుంగపడింది. దీంతో చుట్టుపక్క కాలనీలు నీటమునిగాయి. ఇన్నాళ్లు రక్షణగా నిలిచిన కవర్లు కొట్టుకుపోవడంతో మళ్లీ వరద వస్తే ఎలా జనాలు టెన్షన్‍ పడ్తున్నారు.