- జాతరల టైంలో.. కరోనా టెన్షన్
- ఇప్పుడిప్పుడే మొదలవుతున్న సమ్మక్క సారక్క జాతర
- నిత్యం భక్తులతో కిటకిటలాడుతున్న వేములవాడ, కొండగట్టు
- సంక్రాంతి పండుగ నేపథ్యంలో మల్లన్న బోనాల జాతరలు
- ముందు జాగ్రత్తలు తీసుకోవాలంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
వరంగల్, వెలుగు రాష్ట్రంలో ఓవైపు జాతరల సీజన్ మొదలవుతుండగా.. మళ్లీ కొవిడ్ కొత్త వేరియంట్ కేసులు నమోదవుతుండడం అందరినీ టెన్షన్‍కు గురిచేస్తోంది. డిసెంబర్ నాలుగో వారం వచ్చిందంటే క్రిస్‍మస్, న్యూ ఇయర్ వేడుకలతో వారం రోజులు ఎక్కడచూసినా పండుగ వాతావరణమే ఉంటుంది. పల్లె, పట్నమనే తేడా లేకుండా పబ్లిక్ ఒక దగ్గరకు చేరి ఈవెంట్లు చేసుకుంటారు. ఆపై సంక్రాతి నేపథ్యంలో జనవరి, ఫిబ్రవరి అంతటా చాలా జిల్లాల్లో మల్లన్న బోనాల జాతరలు, శివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. లక్షల మంది భక్తులు ఉత్సవాలకు తరలివెళతారు. ఈ క్రమంలో కేరళతో పాటు వివిధ రాష్ట్రాల్లో కరోనా కొత్త వేరియంట్ జేఎన్1 కేసులు, మరణాలు సంభవిస్తుండంతో దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ గా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. దీంతో ముందుజాగ్రత్తల విషయంలో జనాలు, ఆస్పత్రుల్లో ఏర్పాట్లలో అధికారులు అప్రమత్తం కావాలని రాష్ట్ర సర్కారు ఆదేశాలు జారీ చేయడంతో.. దాదాపు రెండేండ్ల తర్వాత కరోనా మరోసారి కలకలం రేపుతోంది.
రాజన్న, అంజన్న ఆలయాల్లో భక్తుల రద్దీ
తెలంగాణ కుంభమేళాగా భావించే మేడారం జాతర చివరగా 2022లో జరిగింది. దీనిని రెండేళ్లకోసారి నిర్వహించే క్రమంలో అమ్మవార్ల జాతర మొక్కులకు వెళ్లేవారిలో మెజారిటీ భక్తులు మొదట ఎములాడ రాజన్న దర్శనం చేసుకుంటారు. పనిలో పనిగా కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకుంటారు. మొన్నటి వరకు కార్తీక మాసం ఉండడం.. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు మహాలక్ష్మి స్కీంలో భాగంగా ఉచిత ప్రయాణం కల్పించడంతో నిత్యం వేములవాడ, కొండగట్టు ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దీనికితోడు యాదాద్రి టెంపుల్ దర్శనానికి ఎక్కువ మంది వెళ్తున్నారు. మేడారం జాతరకు మరో రెండు నెలల సమయం ఉన్నా శని, ఆదివారాల్లో అప్పుడే భక్తుల రద్దీ
మొదలైంది.
సంక్రాంతికి మల్లన్న బోనాల జాతరలు
రాష్ట్రంలో ప్రతిష్టాత్మక మేడారం జాతరకు 2024 ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు తేదీలు ఖరారయ్యాయి. నిత్యం లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకోడానికి వివిధ రాష్ట్రాల నుంచి తరలివెళ్తారు. దీనికితోడు సంక్రాంతి పండుగకు మల్లన్న బోనాలు నిర్వహించుకునే ఆనవాయితీ ఉంది. వరంగల్ ఐనవోలు మల్లికార్జున స్వామి, కొమురెళ్లి, గట్టు మల్లన్న ఆలయాలకుతోడు వీరభద్రుని క్షేత్రాలైన కొత్తకొండ, కురవి ఆలయాల్లో సంక్రాంతి నుంచి ఉగాది వరకు జాతరలు ఉన్నాయి. మధ్యలో శివరాత్రి పర్వదినం సందర్భంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి. దీంతో జనవరి నుంచి మార్చి వరకు రాష్ట్రమంతటా జాతరల సీజనే!.
2020లో మేడారం జాతర ముగిశాకే కరోనా
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ చైనాలోని వూహన్ నుంచి మొదలై 2020 జనవరి 30న మన దేశంలోకి ప్రవేశించింది. అయినా పెద్దగా ప్రభావం చూపలేదు. ఈ నేపథ్యంలో దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరైన మేడారం జాతరపై ఎటువంటి ప్రభావం పడకుండా సాఫీగా సాగింది. ఫిబ్రవరి 5న సారలమ్మ, 6న సమ్మక్క తల్లిని గద్దె మీదకు తీసుకురాగా 7న ప్రధాన పండుగ జరిగింది. 8న అమ్మవార్లు వన ప్రవేశం చేయడంతో మహా జాతర ముగిసింది. ఆ తర్వాతే వైరస్ అసలు ప్రతాపం చూపడం మొదలుపెట్టింది. విదేశాల నుంచి వచ్చేవారితో క్రమేపీ కేసులు పెరగడం షురూ అయింది. దీంతో థియేటర్లు, జిమ్ సెంటర్లు, కాలేజీలు వంటిని మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మార్చి 19న ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. మార్చి 22న ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 వరకు స్వచ్ఛందంగా ఇండ్లల్లో ఉండి జనతా కర్ఫ్యూ పాటించాలని పిలుపునిచ్చారు. ఆ తర్వాత నుంచి దేశ ప్రజలను కరోనా వైరస్ అతలాకుతలం చేసింది.
సర్కార్ ఆదేశం.. కరోనా వార్డుల ఏర్పాటు
కరోనా వైరస్ ఒమిక్రాన్ తన రూపం మార్చుకుని ప్రస్తుతం జేఎన్1 వేరియంట్‍గా మళ్లీ తన ప్రభావాన్ని చూపుతోందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. సోమవారం నాటికి దేశంలో ఆరుగురు దీని బారినపడి మరణించారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో మంగళవారం నాటికి కొత్తగా 402 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా 4 కేసులు పాజిటివ్ గా వచ్చాయని హెల్త్ డైరెక్టర్ ప్రకటించారు.
బుధవారం నాటికి కేసులు 9కి చేరినట్లు తెలుస్తోంది. దీంతో పండుగలు, జాతరల సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వైరస్ తీవ్రత పెరగకుండా చూసేందుకు ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహా అధికారులతో రివ్యూ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో హైదరాబాద్ గాంధీ హస్పిటల్‍తో పాటు వరంగల్ ఎంజీఎంలో 50 బెడ్లతో కొవిడ్ వార్డులు ఏర్పాటు చేశామని అధికారులు వెల్లడించారు. ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలెటర్లు అందుబాటులో ఉంచామన్నారు. జనాలు కూడా గతంలో మాదిరిగా కరోనా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.