దేశంలో రోజురోజుకూ కరోనా కేసులు మరింత పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లోనే 6,050 కొవిడ్-19 కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ కేసులు నిన్నటితో పోలిస్తే 13 శాతం పెరిగాయని తెలిపింది. కరోనా కారణంగా దేశంలో ఒక్కరోజులోనే 14 మంది మరణించారు. దీంతో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 28,303కు చేరుకోగా.. కొవిడ్ తో చనిపోయిన వారి సంఖ్య 5,30,943 కు చేరుకుంది. ఇప్పటివరకు కరోనా బారిన పడి, డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 4,41,85,858గా చేరుకుందని ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవ్య వెల్లడించారు.
కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం మరోసారి రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలను జారీ చేసింది. కరోనా కేసులపై ఇప్పటికే సమీక్ష నిర్వహించిన ప్రధాని మోడీ.. రాష్ట్రాలు మళ్లీ కరోనా నిబంధనలు పాటించాలని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఇదే విషయంపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవ్య రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య మంత్రులతో సమావేశం కానున్నారు.
రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 3.39 శాతంగా ఉండగా, వారంవారీ పాజిటివిటీ రేటు 3.02 శాతంగా ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 24 గంటల్లో మొత్తం 2,334 కరోనా వ్యాక్సిన్‌లను అందించారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 2,20,66,20,700 వ్యాక్సిన్‌లు టీకాలు వేసినట్టు స్పష్టం చేశారు.