చైనాలోని 23 నగరాల్లో లాక్డౌన్..కఠిన ఆంక్షలు

  • బీభత్సం సృష్టిస్తున్న ఓమిక్రాన్ బీఏ.2 మ్యుటేషన్ వైరస్
  • ఒక్క షాంఘై సిటీలోనే రోజుకు 20వేలకు పైగా కేసులు
  • బాల్కనీల్లోకి వచ్చి కేకలు వేస్తున్న జనం
  • ఒకే గదిలో దంపతులు ఉండొద్దన్న నిబంధనను సడలించని సర్కార్
  • కరోనా రోగులతో నిండిపోతున్న ఆస్పత్రులు

షాంఘై:  ప్రపంచంలో అగ్రగామి నగరమైన షాంఘైలో కరోనా విజృంభిస్తోంది. దాదాపు 2 కోట్ల 60 లక్షల మంది జనాభాతో ఫైనాన్షియల్ హబ్ గా పేరుపొందిన షాంఘై నగరంలో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. ఓమిక్రాన్ లోని బీఏ.2 మ్యుటేషన్ వైరస్ చైనాలో బీభత్సం సృష్టిస్తోంది. కరోనా కట్టడి కోసం... లాక్ డౌన్ తో పాటు పలు ఆంక్షలు అమలు చేస్తోం చైనా ప్రభుత్వం. ఇతర దేశాల్లోనూ గతంలో లాక్ డౌన్లు విధించినా... ఎక్కడా లేని విధంగా షాంఘైలో మాత్రం ఒకే గదిలో దంపతులు ఉండొద్దని.. కఠిన ఆంక్షలు జారీ చేశారు. వాటిని ఇప్పటికీ సడలించలేదు. నిత్యావసరాలు కొరతతో.. నగర వాసులు ఆకలికి అల్లల్లాడిపోతున్నారు. తమ ఇళ్లలో ఆహారం, మందులు లేవని బాల్కనీల్లోకి వచ్చి ప్రజలు నినాదాలు చేస్తున్నారు.
షాంఘైలో తీవ్రమైన ఆంక్షలతో ఆహారం కూడా దొరకట్లేదు. లాక్ డౌన్ స్టార్టింగ్ లో చైనా ప్రభుత్వం.. ఆహార పదార్థాలు పంపిణీ చేసినా.. అవి కొద్దిరోజులకే అయిపోయాయి. ఆ తర్వాత మళ్లీ పంపిణీ చేయలేదని ఆరోపిస్తున్నారు చైనా ప్రజలు. షాంఘైలోని అపార్ట్ మెంటుల్లో కొందరు బాల్కనీల్లోకి వచ్చి నిరసన తెలుపుతూ పాటలు పాడుతున్నారు. దీంతో  కొన్ని నిమిషాలకే స్పందించిన అధికారులు..  పాటలు పాడటం ద్వారా వైరస్ మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని డ్రోన్ల ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. 
చైనాలో దాదాపు 23 సిటీల్లో లాక్ డౌన్ లోకి వెళ్లాయి. కరోనా పేషంట్లతో హాస్పిటల్స్ నిండిపోయాయి. డాక్టర్లు, నర్సులు ఎంతో అలసిపోతున్నారు. సేవలు అందిస్తూ.. కుప్పకూలిన వైద్యుడ్ని రోగులే చేతుల మీదుగా మోసుకుంటూ వచ్చిన వీడియో వైరల్ గా మారింది.
మార్చి 28న మొదలై.. షాంఘై సిటీ అంతా విస్తరించిన కరోనా ఆంక్షలు
మార్చి 28న షాంఘైలోని ఈస్ట్ ప్లేస్ కే పరిమితమైన కొవిడ్ ఆంక్షలు, ఏప్రిల్ ఒకటి నుంచి సిటీ అంతా విస్తరించాయి. అప్పటికే నిత్యావసరాలపైన సరైన జాగ్రత్తలు తీసుకోలేదు. దీంతో ఇళ్లల్లో ఆహారం, తాగు నీళ్లు, మందులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిటీలోని కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తతలు మరింత పెరిగి, అల్లర్లు మొదలవుతున్నాయి. 
కరోనాతో కాదు.. ఆకలితోనే చచ్చిపోతున్నాం
షాంఘైలోని ప్రాంతలో ప్రజలు పెద్ద సంఖ్యలో బయటకు వచ్చి సూపర్ మార్కెట్లను లూటీ చేశారు. వారిని అదుపు చేసేందుకు వచ్చిన అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇన్ని కఠిన ఆంక్షలు విధించినా... చైనాలో కరోనా కేసుల సంఖ్య తగ్గట్లేదు. రోజుకు 20 వేల కేసులు షాంఘైలోనే వస్తున్నాయి. కరోనా సంగతి పక్కనపెడితే.. ఆకలితోనే ప్రాణాలు పోయేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు షాంఘై ప్రజలు.

 

 

ఇవి కూడా చదవండి

ట్రాన్స్ జెండర్లకు భద్రత, రక్షణ కల్పిస్తాం

రోప్ వే ప్రమాద రెస్క్యూ ఆపరేషన్ క్లోజ్

అక్బరుద్దీన్ కేసులో తీర్పు వాయిదా

ఒకప్పుడు సైడ్ యాక్టర్.. ఇప్పడు హ్యాట్రిక్ హీరో

మా వివరాలు ఇవ్వొద్దు..స్విస్ కోర్టులకు ఇండియన్ల రిక్వెస్ట్