న్యూఢిల్లీ: కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటంపై కేంద్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రాబోయే నాలుగు వారాలు అత్యంత కీలకమని పేర్కొంది. కరోనా వ్యాప్తిపై సెంట్రల్ హెల్త్ సెక్రటరీ రాజేశ్ భూషణ్తో కలిసి నీతిఅయోగ్ సభ్యుడు, ప్రొఫెసర్ వినోద్ పాల్మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘దేశంలో కరోనా తీవ్రత పెరుగుతోంది. పరిస్థితి మరింత దిగజారుతోంది. కిందటేడాది కంటే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. వచ్చే నాలుగు వారాలు దేశానికి అత్యంత కీలకం. అర్హులైన వారు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వ్యాక్సిన్ తీసుకోవాలి. దేశంలో సేఫ్ వ్యాక్సిన్లకు ఏ లోటు లేదు. ఇప్పటికైనా ప్రజలు పరిస్థితిని సీరియస్గా తీసుకొని మాస్క్లు ధరించాలి. పబ్లిక్ప్లేస్లలో ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలి’అని పాల్ కోరారు.
ఆర్టీపీసీఆర్ టెస్టులను పెంచాలె..
మహారాష్ట్రలో ఆర్టీపీసీఆర్ టెస్టులు తగ్గాయని కేంద్రం చెప్పింది. దేశం మొత్తమ్మీద ఆ రాష్ట్రంలోనే కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న క్రమంలో ఆర్టీపీసీఆర్ టెస్టుల శాతాన్ని పెంచాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశించింది. సెంట్రల్ హెల్త్ సెక్రటరీ రాజేశ్ భూషణ్ మాట్లాడుతూ.. మహారాష్ట్రలో గతవారం ఆర్టీపీసీఆర్ పద్ధతిలో కేవలం 60 శాతం టెస్టులే చేశారని వెల్లడించారు. 70 శాతం.. అంతకంటే ఎక్కువ ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు సూచించిందని చెప్పారు. కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు 50 ఉన్నత స్థాయి ప్రజారోగ్య బృందాలను పంపినట్లు తెలిపారు. మహారాష్ట్రలోని 30, చత్తీస్గఢ్లోని 11, పంజాబ్లోని 9 జిల్లాల్లో ఈ బృందాలు పర్యటించి.. ఆయా రాష్ట్ర యంత్రాంగాలకు తగిన సూచనలిస్తాయని వివరించారు.