- గడచిన 24గంటల్లో 18వేలకుపైగా కొత్త కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. హమ్మయ్య.. ముప్పు తొలగిపోయిందని అందరూ ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో తాజాగా కేసుల పెరుగుదల వైద్య ఆరోగ్యశాఖను కలవరపెడుతున్నాయి. 24 గంటల వ్యవధిలో ఏకంగా 4వేల కేసుల పెరుగుదల నమోదు అయింది. అంతేకాదు పాజిటివిటీ రేటు 4.16 శాతం నమోదు కాగా.. యాక్టివ్ కేసులు కూడా లక్ష దాటాయి.
వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించిన తాజా బులెటిన్ ప్రకారం గడచిన 24గంటల్లో దేశ వ్యాప్తంగా 4 లక్షల 52వేల మందికి పరీక్షలు చేయగా.. 18 వేల 819 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. రోజు వారీగా నమోదువుతున్న కొత్త కేసుల్లో ఇంత భారీగా తేడా రావడం 130 రోజుల తర్వాత అంటే గడచిన 4 నెలల తర్వాత ఇదే తొలిసారి.
తాజాగా నమోదైన కొత్త కేసుల్లో కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాల్లోనే ఎక్కువ కేసులు ఉన్నాయి. కేరళలో 4 వేల 459 కొత్త కేసులు నమోదు కాగా.. మహారాష్ట్రలో 3వేల 957 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అలాగే కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో కొత్త కేసుల సంఖ్య వెయ్యిపైనే నమోదు అయ్యాయి.
ముఖ్యంగా యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా ఉండడం ప్రమాద హెచ్చరిక అని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. రికవరీ రేటు 98.55 శాతం ఉన్నప్పటికీ యాక్టివ్ కేసుల రేటు .24 శాతానికి పెరుగగా.. గడచని 24 గంటల్లో కరోనా సోకిన వారిలో 39 మంది కోలుకోలేక చనిపోగా.. వీటిలో 17 మరణాలు కేరళలోనే నమోదయ్యాయి.