రోడ్లపై విచ్చలవిడిగా పశువులు..బిడ్డతో నడుచుకుంటూ వెళ్తున్న మహిళపై ఆవు దాడి..తీవ్రగాయాలు

రోడ్లపై విచ్చలవిడిగా పశువులు..బిడ్డతో నడుచుకుంటూ వెళ్తున్న మహిళపై ఆవు దాడి..తీవ్రగాయాలు

చెన్నై పట్టణంలో పశువులు హల్చల్ చేస్తున్నాయి. హైదరాబాద్ లో వీధుల్లో కుక్కల బెడద ఎట్లుందో చెన్నైలో పశువులు సమస్య అలా వుంది. ఎక్కడ పడతే అక్కడ రోడ్లపై తిరుగుతూ ప్రజలను కుమ్మేస్తున్నాయి. ఏడాది కాలంలో చెన్నై పట్టణంలో పశువుల దాడిలో ప్రజలు గాయపడిన ఘటనలు చాలా ఉన్నాయి. తాజాగా శుక్రవారం (మార్చి14) రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న తల్లీకూతుళ్లను ఆవు దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన ఘటన వెలుగులోకి వచ్చింది.  

చెన్నైలోని కొరట్టూరులో కూతురితో నడుచుకుంటూ వెళుతుండగా మహిలపై ఆవు దాడి చేసింది. ఊహించని ఈ ఘటనలో మహిళ తీవ్రంగా గాయపడింది.  ఈ సంఘటన చెన్నై అంతటా జరుగుతున్న వరస పశువుల దాడులను హైలైట్ చేస్తుంది. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (జిసిసి) అధికారులు ఆ జంతువును స్వాధీనం చేసుకున్నారు. ఆ మహిళ కుమార్తె గాయపడకుండా తప్పించుకుంది. ఈఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో  రికార్డయ్యాయి.  

మహిళ తన కూతురితో కలిసి దుకాణానికి వెళ్తుండగా ఆవు దాడి చేసినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తోంది. రోడ్డుపై ఆవును గమనించిన మహిళ రోడ్డు దాటినప్పటికీ అటువైపు వెళ్లిన ఆవు.. తల్లీకూతురిపై దాడి చేసింది. ఆవు మహిళను గోడకేసి బలంగా కొట్టింది. అటువైపునుంచి వెళ్తున్న ఆటో డ్రైవర్, స్థానికులు గమనించి ఆవును తరిమేసేందుకు ప్రయత్నించారు. కొద్దిసేపటి తర్వాత ఆవు పారిపోయింది. గాయపడ్డ మహిళను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

చెన్నైలో ఇలాంటి ఘటనలు కొత్తకాదు.. గతంలో కూడా జరిగాయి. జనవరిలో కుంద్రత్తూర్ సమీపంలోని కలట్టిపెట్టైలో 52 ఏళ్ల మహిళ బైక్ పైనుంచి పడి మృతిచెందింది. రోడ్డుపై అడ్డుగా వచ్చి ఆవును తప్పించబోయి ఆమె కొడుకు బైక్ సడన్ బ్రేక్ వేయడంతో ఆమె కిందపడి చనిపోయింది. 2024 అక్టోబర్‌లో కొరుక్కుపేటలో చెత్త వేయడానికి వెళ్లినప్పుడు ఆవు దాడి చేయడంతో 60 ఏళ్ల వ్యక్తి కాలు విరిగింది.

ఇక ఈ ఘటనతో చెన్నై లో పశువుల బెడదపై అధికారులు దృష్టి సారించారు. ఆవు యజమానిని గుర్తించడానికి పోలీసులు విచారణ చేపట్టారు. ఈ సంఘటన చెన్నైలో విచ్చలవిడిగా తిరుగుతున్న పశువుల సమస్యను హైలైట్ చేసింది.