జగిత్యాల జిల్లాలో ఆవు దూడకు జన్మదిన వేడుకలు

సాధారణంగా ఎవరైనా పుట్టినరోజు నిర్వహించుకుంటే బ్యానర్లు కట్టి.. ఇరుగూ పొరుగు వారిని ఇంటికి పిలిచి.. కేక్ కట్ చేసి, స్వీట్లు పంచిపెడుతుంటారు.  మనుషుల పుట్టిన రోజు జరుపుకున్నట్లే  ఆవుదూడకు కూడా ఘనంగా జన్మదిన వేడుకలను జరిపారు జగిత్యాల జిల్లాకు చెందిన దంపతులు. అంతేకాదు తన ఇంట పుట్టిన ఆవుకు పేరు పెట్టి, ప్రతీయేటా క్రమం తప్పకుండా జన్మదిన వేడుకలు జరిపిస్తున్నారు. ఆ ఆవు పుట్టిన రోజును పురస్కరించుకుని కేక్‌ కూడా కట్ చేయించి సంబరాలు జరిపించారు.

జగిత్యాల జిల్లా వెల్గటూర్ లో నివాసముంటున్న బందెల లలిత, లక్ష్మణ్  దంపతులకు పిల్లలు లేరు. వ్యవసాయం చేస్తున్న లక్ష్మణ్ కు ఓ ఆవు ఉంది. దానికి రెండు సంవత్సరాల క్రితం ఓ దూడ జన్మించింది. పిల్లలు లేని దంపతులు ఆవు దూడను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ఆవు దూడకు ధనలక్ష్మీ అని పేరు పెట్టుకున్నారు.

ఇప్పటికే ధనలక్ష్మీ మొదటి పుట్టిన రోజును ఘనంగా నిర్వహించామని, రెండవ పుట్టిన రోజు వేడుకను కూడా ఓ పండగలా చేస్తున్నామని తెలిపారు. అంతేకాదు.. ‘ధనలక్ష్మీ’ పేరిట బ్యానర్ కూడా ఏర్పాటు చేసి, సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఇరుగుపొరుగు వారిని కూడా పిలిచి కేక్ కట్ చేసి.. పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు.