ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు : సీపీ అంబర్​ కిశోర్​ ఝా

ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు : సీపీ అంబర్​ కిశోర్​ ఝా

హనుమకొండ/ జనగామ అర్బన్/ ఏటూరునాగారం/ ఎల్కతుర్తి/ వర్ధన్నపేట, వెలుగు: ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని వరంగల్​ సీపీ అంబర్​ కిశోర్​ ఝా, జనగామ కలెక్టర్​ రిజ్వాన్​ బాషా షేక్, ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ హెచ్చరించారు. బుధవారం హనుమకొండ జిల్లా కమలాపూర్​ స్టేషన్​ పరిధిలోని అంబాల, నేరెళ్లవాగును సీఐ హరికృష్ణతో కలిసి సీపీ పరిశీలించారు. జనగామ జిల్లా యశ్వంతాపూర్ వాగును డీసీపీ రాజమహేంద్ర నాయక్​ తో కలిసి కలెక్టర్​ తనిఖీ చేశారు. 

ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి వే బ్రిడ్జిని సీఐ అనుములు శ్రీనివాస్​, ఎస్సై తాజుద్దీన్​తో కలిసి ఏఎస్పీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎక్కడైనా అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే ఉపేక్షించేది లేదన్నారు.  ఇదిలాఉండగా ఎల్కతుర్తి మండల పరిధిలో మానేరు వాగు నుంచి బావుపేటకు అక్రమంగా ఇసుక తరలిస్తున్న  రెండు ట్రాక్టర్లను, వర్ధన్నపేట మండలం రాందాన్​ తండా శివారులో ఏడు ట్రాక్టర్లలో ఇసుక నింపుతుండగా పోలీసులు పట్టుకుని కేసులు నమోదు చేశారు.