సిద్దిపేట రూరల్, వెలుగు: బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలని, ఇందుకోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని సీపీ అనురాధ సూచించారు. ఆపరేషన్ స్మైల్- పూర్తయిన సందర్భంగా 83 మందిని కాపాడి వారి తల్లిదండ్రులకు, బంధువులకు అప్పగించినట్లు శనివారం తెలిపారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. బాల కార్మికులతో పని చేయించిన 17 మంది యజమానులపై కేసులు నమోదు చేశామన్నారు.
జిల్లాలో ఎక్కడైనా బాల కార్మికులు పనిచేసినట్లు కనిపిస్తే వెంటనే డయల్100, సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712667100 కు సమాచారం అందించాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినందున లైసెన్స్ ఉన్న తుపాకులను స్థానిక పీఎస్లో అప్పగించాలని సీపీ ఆదేశించారు. ఈ నెల 8 లోపు డిపాజిట్ చేయాలని, ఎన్నికల కోడ్ పూర్తయిన తర్వాత తిరిగి తీసుకువెళ్లవచ్చన్నారు. తుపాకులు డిపాజిట్ చేయని వారిపై ఎలక్షన్ కమిషన్ ఆదేశానుసారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సంగారెడ్డి జిల్లాలో 57 మందికి విముక్తి
సంగారెడ్డి: ఆపరేషన్ స్మైల్ లో భాగంగా జనవరి 1 నుంచి 31 వరకు నిర్వహించిన తనిఖీల్లో 57 మంది చిన్నారులకు విముక్తి కల్పించినట్లు ఎస్పీ రూపేశ్ వెల్లడించారు. పని ప్రదేశాల్లో 5 నుంచి 14 ఏళ్లలోపు చిన్నారులను పెట్టుకుంటే బాల కార్మికులుగా పరిగణిస్తామన్నారు. ఎక్కడైనా బాల కార్మికులు కనిపిస్తే చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 1098, 112 కు ఫిర్యాదు చేయాలని సూచించారు.