మట్టి దందాపై సీపీ సీరియస్ !

  • కమిషనర్ ఆదేశాలతో కేసు
  • ‘వెలుగు’ కథనానికి స్పందన

హనుమకొండ, వెలుగు: మట్టి దందాపై వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ సీరియస్ అయ్యారు.  హనుమకొండ జిల్లాలోని ధర్మసాగర్ మండలం ఉనికిచర్ల శివారు నాగుల చెరువు కుంటలో శనివారం రాత్రి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తవ్వడమే కాకుండా ఓవర్ స్పీడ్ తో దేవన్నపేట క్వార్టర్స్ మీదుగా వెళ్తుండగా.. స్థానికులు 'డయల్ 100'కి కాల్ చేసి ఫిర్యాదు చేశారు.  పోలీసులు అరగంట తర్వాత స్పాట్ కి చేరారు . 

ఇల్లీగల్ మైనింగ్ గా నిర్ధారించి ఒక హిటాచి, నాలుగు టిప్పర్ల ఫొటోలు తీసుకుని స్టేషన్ కి తరలించాల్సిందిగా చెప్పి, వాటిని వెనకే ఫాలో అవుతూ రింగ్ రోడ్డు ఎక్కారు. కానీ టిప్పర్లు తప్పించుకోవడంతో ..  సోమవారం 'వెలుగు' దినపత్రిక లో  'పట్టుకున్న మట్టి దందా వాహనాలు పోలీస్ స్టేషన్ చేరలే' హెడ్డింగ్ తో వార్త పబ్లిష్ అయింది . ఇది సీపీ దృష్టికి వెళ్లడంతో కిందిస్థాయి సిబ్బందిని మందలించినట్టు తెలిసింది. కేసు ఫైల్ చేయాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడంతో ధర్మసాగర్ పోలీసులు సోమవారం ఉదయం రెండు టిప్పర్లు స్టేషన్ కి తరలించారు. నాలుగు టిప్పర్లు, ఒక హిటాచీ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా వెహికల్ ఓనర్ల పేర్లు ఎఫ్ఐఆర్ లో నమోదు చేయకపోవడంపై అనుమానాలు
వ్యక్తమవుతున్నాయి.