- శంషాబాద్ మండలం జూకల్లో సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి పర్యటన
- ధ్వంసమైన చౌడమ్మ, సోమన్న దేవాలయాల సందర్శన
శంషాబాద్, వెలుగు: దేవాలయాలపై దాడులు చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి అన్నారు. శనివారం రాత్రి శంషాబాద్ మండలం జూకల్ గ్రామంలో డీసీపీ రాజేశ్, అడిషనల్ డీసీపీ రామ్ కుమార్తో కలిసి ఆయన పర్యటించారు. చౌడమ్మ, సోమన్న దేవాలయాలను సందర్శించి పూజారి కుమ్మరి కృష్ణ, స్థానికులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఆలయంలో విగ్రహాలు ధ్వంసం చేసిన నిందితుడిని మహారాష్ట్ర స్టేట్ జలగావ్ జిల్లా సవ్‌ఖేడా గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించామన్నారు. స్థానికుల నుంచి ఫిర్యాదు అందగానే శంషాబాద్ పోలీసులు వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారన్నారు. నిందితుడిపై గతంలో రాయ్‌గడ్ జిల్లా తాల పోలీస్ స్టేషన్లో పలు కేసుల్లో జైలుకు వెళ్లాడన్నారు. నవంబర్ 9వ తేదీ సాయంత్రం చౌడమ్మ, సోమన్న ఆలయంలోకి ప్రవేశించి, నిందితుడు విగ్రహాలను ధ్వంసం చేసినట్లు చెప్పారు. శంషాబాద్ పోలీసులు సల్మాన్ ను న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారని పేర్కొన్నారు.