హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా క్యూనెట్ మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో మోసం చేస్తున్న ప్రధాన నిందితుడు రాజేష్ కన్నాను మొదటిసారి అరెస్ట్ చేశామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. పిరమిడ్ స్కీమ్ తో బోగస్ కంపెనీని ఏర్పాటు చేసి అమాయకులను టార్గెట్ చేసి, మోసాలు చేస్తున్నారని చెప్పారు. ఇటీవల ప్రమాదానికి గురైన సికింద్రాబాద్ స్వప్న లోక్ కాంప్లెక్స్ లోనూ బోగస్ కంపెనీ నడుస్తోందని తెలిపారు. రూ.2 లక్షల పెట్టుబడి పెడితే ప్రతి నెల రూ.20 వేల నుండి 60 వేల వరకు ఆదాయం వస్తుందని నమ్మిస్తున్నారని, మొదట్లో కరెక్టుగానే డబ్బులు ఇచ్చి.. ఆ తర్వాత ఎస్కేప్ అవుతున్నారని చెప్పారు. గొలుసు కట్టు పద్ధతిలో అమాయకులను టార్గెట్ చేసుకుని..మోసం చేస్తున్నారని వెల్లడించారు.
క్యూ నెట్ మల్టీలెవల్ మార్కెటింగ్ లో దాదాపు159 మంది బాధితులు రూ.3 కోట్ల వరకు డబ్బు పోగొట్టుకున్నారని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. క్యూ నెట్ స్కామ్ పై సీసీఎస్, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా దర్యాప్తు చేస్తోందన్నారు. క్యూనెట్ నడిపిస్తున్న రాజేష్ కన్నాను అరెస్ట్ చేశామని, అతడికి సంబంధించిన 35 బ్యాంకు అకౌంట్లు, రూ.54 కోట్ల నగదును ఫ్రీజ్ చేశామని తెలిపారు. సూపర్ మార్కెట్ స్కీం ద్వారా మోసపోయిన 44 మంది బాధితులను గుర్తించామన్నారు. రూ.25 లక్షలు పెట్టుబడి పెడితే ప్రతి నెలా లక్ష రూపాయలు వస్తుందని చెప్పి మోసం చేస్తున్నారని వెల్లడించారు. మొదట్లో రెండు, మూడు నెలల పాటు సరిగానే అమౌంట్ ఇచ్చి.. ఆ తర్వాత ఉడాయిస్తున్నారని చెప్పారు.
మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో దేశంలో వెయ్యి కోట్ల బిజినెస్ చేసినట్లు తాము గుర్తించామని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఆయుర్వేద మందుల పేరుతో ప్రొడక్స్ ఇచ్చి కూడా చాలా రకాలుగా మోసాలు చేస్తున్నారని చెప్పారు. స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్నిప్రమాదంలో చనిపోయిన బాధితులు కూడా క్యూనెట్ లో డబ్బులు పెట్టి మోసపోయారని చెప్పారు. ఇలాంటి మల్టీలెవల్ మార్కెటింగ్ మోసాలపై ప్రజలందరూ మరింత అప్రమత్తంగా ఉండాలని సీవీ ఆనంద్ హెచ్చరించారు.