రాచకొండ కమిషరేట్ పరిధిలో గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు. 56 చెరువుల దగ్గర ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నిమజ్జన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. నిమజ్జనాల నేపథ్యంలో క్రేన్ ఆపరేటర్ విధిగా 8 గంటలు డ్యూటీలో ఉండాలని ఆదేశించారు. రెండు క్రేన్లకు కలిపి అదనంగా మరో క్రేన్ ఆపరేటర్ ను నియమించామన్నారు. ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ విషయంలో నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ప్రతి విగ్రహానికి బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు పెద్ద విగ్రహాలకు ఒక కానిస్టేబుల్, హోంగార్డుతో భద్రత కల్పించనున్నట్లు చెప్పారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 228 పికెట్ ఏరియాలను చేపట్టామన్నారు. నిమజ్జనం సమయంలో మొబైల్ టాయిలెట్స్, అంబులెన్స్ లతో పాటు మెడికల్ టీంలు, ఆర్టీసీ నుంచి అదనంగా డ్రైవర్లను కూడా అందుబాటులో ఉంచామన్నారు. రూట్ టాప్, షీ టీమ్స్, మఫ్టీ పోలీస్ లతో భద్రత కట్టుదిట్టం చేశామని వివరించారు.
భక్తులు మద్యం సేవించి వినాయక నిమజ్జనానికి రావద్దని సీపీ డీఎస్ చౌహాన్ కోరారు. వినాయక నిమజ్జనం కోసం 6వేల మంది పోలీస్ సిబ్బంది విధుల్లో పాల్గొంటారని చెప్పారు. మరో వెయ్యిమంది అదనపు సిబ్బంది ఉంటారని వెల్లడించారు. నిమజ్జనం సందర్భంగా కమిషనరేట్ పరిధిలో కొన్ని ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు. నిమజ్జనం కోసం సుమారుగా 3600 సీసీ కెమెరాలను వినియోగిస్తున్నామని తెలిపారు. ఉప్పల్, నేరేడ్మెట్, నాగోల్ లలో కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేశామని సీపీ డీఎస్ చౌహాన్ స్పష్టం చేశారు.