- అరెస్ట్ చేసేందుకు చర్యలు చేపట్టినం
- ఇప్పటికే లుక్ ఔట్ సర్క్యులర్ జారీ చేసినం
- ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇది ప్రారంభమే.. ఇంకా చాలా ఉంది
- పక్కా ఆధారాలతో ముందుకు వెళ్తున్నం
- కేసులో అధికారులున్నా, లీడర్లున్నా వదిలిపెట్టే ప్రసక్తేలేదని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్, ఎస్‌ఐబీ లాగర్ రూమ్ ధ్వంసం కేసులో ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేస్తామని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ‘‘ప్రభాకర్‌రావును అరెస్ట్ చేసేందుకు రెడ్ కార్నర్ ప్రొసీజర్‌ను ప్రారంభించినం. అరెస్ట్ వారంట్ కోసం కోర్టులో కావాల్సిన చర్యలు స్టార్ట్ చేసినం” అని ఆయన వెల్లడించారు.
బషీర్‌బాగ్‌లోని ఓల్డ్ సీపీ ఆఫీస్‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో సీపీ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తుపై ఆయన స్పందించారు. ‘‘ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నం. ఇప్పటికే లుక్ ఔట్ సర్క్యులర్ జారీ చేసినం. ఇది ప్రారంభం మాత్రమే.. ఇంకా చాలా ఉంది” అని అన్నారు. ఇతరుల వ్యక్తిగత విషయాలను రహస్యంగా తెలుసుకున్న వాళ్లను ఎవరినీ వదిలే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. పూర్తి ఆధారాలతో ముందుకెళ్తున్నామని.. ఈ కేసులో అధికారులు, రాజకీయ నాయకులు సహా ఎవరి ప్రమేయం ఉన్నా వదిలిపెట్టబోమని ఆయన స్పష్టం చేశారు.
ఢిల్లీ పోలీసులకు సహకరిస్తున్నాం
కేంద్ర హోం మంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో ఢిల్లీ పోలీసులకు సహకరిస్తున్నామని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన మార్ఫింగ్ వీడియోలు ఎక్కడ క్రియేట్ చేశారో వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. కేసు దర్యాప్తు వివరాలను సోమవారం ఆయన వెల్లడించారు. మార్ఫింగ్ వీడియోలను సెంట్రల్ ఎఫ్‌ఎస్‌ఎల్ ల్యాబ్ కు పంపించామని వెల్లడించారు.
గత నెల 26న ఢిల్లీ పోలీసులు తమను సంప్రదించారని తెలిపారు. కానీ, అమిత్ షా వీడియో మార్ఫింగ్‌పై గత నెల 27న తమకు వచ్చిన ఫిర్యాదుతో అదే రోజు కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. ఢిల్లీ స్పెషల్ సెల్‌లో 28న కేసు నమోదైందని, నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామని చెప్పారు. ఢిల్లీ పోలీసులు కేసుకు సంబంధించిన వివరాలు కోరితే అధికారికంగా ఇచ్చామని తెలిపారు.